జనం బాటలో కవితకు జనం బాసట మహబూబ్ నగర్ జనం బాసట రెండో రోజు – Mahbubnagar Janam Basata

జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా 2025 అక్టోబర్ 28న మంగళవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. రెండు రోజుల జిల్లా పర్యటన కోసం వచ్చిన కవితకు తొలి రోజే జాగృతి శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికి ఆదరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసిన కవిత ఆయా ప్రాంతాల సమస్యలు ఆరా తీశారు. పలువురు తెలంగాణ ఉద్యమ కారులను కలిశారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించారు.

ఘనస్వాగతం

మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన షాద్ నగర్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షాద్ నగర్ లో ఆమె మీడియాతో మాట్లాడారు.

“జనంబాటలో భాగంగా ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వచ్చాను. జిల్లాలోని దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల నియోజకవర్గాలను విజిట్ చేస్తాం. ఆయా నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని…వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిన సరే ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదు. ఒక్క ఫ్రీ బస్సు మినహా ఏ హామీని ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. పెన్షన్లు పెంచలేదు, ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వలేదు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్ట్ లు కానీ ఇతర ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయలేదు. వీటిన్నింటిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం. జూబ్లీహిల్స్ ఎన్నిక దురదృష్టవశాత్తు వచ్చింది. ఆ ఎన్నికపై మాకు ఏ స్టాండ్ లేదు.
జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలిచినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. మేము ప్రజలకు కావాల్సిన పనులు చేయించే బాధ్యత తీసుకున్నాం. ప్రజలకు మంచి చేసేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచే పని చేస్తాం.”

ఉద్దండపూర్ సందర్శన

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగమైన ఉద్దండపూర్ రిజర్వాయర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు.ఉద్దండపూర్ నిర్వాసిత రైతులతో సమావేశంమై వారి బాధలు అడిగి తెలుసుకున్నారు.

“ఉద్దండపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇవ్వాలి. ఏ రోజు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందో ఆనాటి రేటు కట్టి ఇవ్వాలి. 2021 నాటికే కటాఫ్ పెట్టటం సరికాదు. పరిహారం ఇచ్చే నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఇవ్వాల్సిందే. తప్పు బీఆర్ఎస్ దా, కాంగ్రెస్ దా అని కాదు. ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు. ప్రజలకు మంచి జరగాలని మాత్రమే నేను ఆలోచిస్తున్నా. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు ఈ ప్రభుత్వం చేస్తుందా? లేదా? చెప్పాలి. తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ నగర్ లో నీళ్ల కరువు ఎలా ఉండేదో అందరికీ తెలుసు. వందల ఎకరాలు ఉన్న వారు కూడా నీళ్లు లేక వలస పోయారు. తెలంగాణ వచ్చాక కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా నీటి సౌలత్ మంచిగా చేసుకున్నాం.

చెరువులు బాగా అయినయ్. ఎండకాలంలో కూడా మహబూబ్ నగర్ జిల్లాలో చెరువులు కళకళలాడేవి. తెలంగాణ వచ్చాక చాలా మంచి పనులు జరిగాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కృష్ణా నది నీళ్లను వినియోగించుకోవాలని కేసీఆర్ గారు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ చేపట్టారు.

ఉద్దండపూర్ రిజర్వాయర్ సహా అన్ని పనులు 80 శాతం వరకు అప్పుడే పూర్తయ్యాయి. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గెలిచి కూడా రెండేళ్లు అయ్యింది. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయటం లేదు. తప్పు బీఆర్ఎస్ దా, కాంగ్రెస్ దా అన్నది పక్కన పెడుదాం. ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు. ప్రాజెక్ట్ కోసం భూములు ఇవ్వటానికి ఇక్కడి ప్రజలు పెద్ద మనసు చేసుకొని ఒప్పుకున్నందుకు వారికి కృతజ్ఞతలు. 2 వందల ఎకరాల్లో కోర్టు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ ను ఆలస్యం చేస్తున్నారు. పైగా నిర్వాసితులైన రైతులకు కటాఫ్ ఏజ్ 2021 నాటికే పెడుతున్నారు.

ఇప్పుడు 18 ఏళ్లు ఉన్నవారికి పరిహారం ఇవ్వమంటున్నారు. ప్రభుత్వం ప్రాజెక్ట్ పూర్తి చేస్తుందా లేదా? ప్రాజెక్ట్ నిర్మాణంలో అయితే స్పష్టంగా నాణ్యత లోపం తెలుస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటే మాత్రం… ఎప్పుడు డబ్బులు ఇస్తే ఆనాటి రేటు కట్టి ఇవ్వాలి. ఆనాటికి 18 ఏళ్లు ఉన్న వాళ్ల అందరికీ పరిహారం ఇవ్వాల్సిందే. దాదాపు 286 మంది డబ్బులు రావని ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా భూమి పోతున్న యువకులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి. పోలేపల్లి లో ఎకరాకు పన్నెండున్నర లక్షలు ఇచ్చి… మిగతా ప్రాజెక్టుల ముంపు గ్రామాల ప్రజలకు ఆరున్నర లక్షలు ఇస్తున్నారు. అందరికీ ఒకటే ధర కట్టి ఇవ్వాలి. ఇక్కడి ఎమ్మెల్యే డిసెంబర్ 9వ తేదీలోపు నిర్వాసితులకు ఎకరాకు రూ. 25 లక్షల పరిహారం, రూ.25 లక్షల చొప్పున ప్యాకేజీ ఇప్పిస్తానని మాట ఇచ్చారు. అప్పటి వరకు వేచి చూద్దాం. ఆ తర్వాత మాత్రం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యాచరణ చేద్దాం. ప్రాజెక్ట్ విషయంలో అందరీ తప్పు ఉంది. తప్పు బీఆర్ఎస్ దా, కాంగ్రెస్ దా అని కాదు. ఇక్కడ ఇంకో 20 శాతం పనులు చేపిస్తే చాలు ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. నన్ను గెలిపిస్తే మహబూబ్ నగర్ కు మంచి చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకోవటం లేదు. ఇక్కడ ప్రాజెక్ట్ కట్టకుండా నారాయణ పేట- కొడంగల్ లిప్ట్ పేరుతో కొత్త ప్రాజెక్ట్ అంటున్నాడు. ఇంజనీర్లు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆయన ముందుకు పోతుండు. దీంతో జరగాల్సినంత మేలు జరగటం లేదు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ఏనుగు వెళ్లి తోక చిక్కింది. ప్రాజెక్ట్ విషయంలో రాజకీయాలు వద్దు. ప్రజలకు మేలు జరగాలి. ఇప్పుడు 18 ఏళ్లు నిండిన 286 మందికి కూడా పరిహారం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఏరోజు డబ్బులు ఇస్తే ఆనాటి రేటు కట్టి ఇవ్వాలి. నిర్వాసితులకు మంచి జరగాలని మాత్రమే నేను ఆలోచిస్తున్నా. ఇళ్లు, భూములు కోల్పోతున్న రైతుల బాధ నాకు తెలుసు. వారి విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. కాంగ్రెస్ గెలిస్తే తమకు మేలు జరుగుతుందని ఆశ పెట్టుకొని ప్రజలు గెలిపించారు. ఇచ్చిన మాట నిలుపుకోవాలి. పెన్షన్, రైతు భరోసా, బోనస్, మహిళలకు రూ. 2500 సాయం అంశాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఉద్యమకారులకు ఇస్తామన్న డబ్బులు ఇస్తలేరు.

దేవరకద్ర.. కరివెన రిజర్వాయర్ సందర్శన

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన కరివెన రిజర్వాయర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు పలువురు నిర్వాసితులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

“మహబూబ్ నగర్ జిల్లాకు చారిత్రక అన్యాయం చేస్తున్నారు. జిల్లా ప్రజలు ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని క్షమించరు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ లను సుప్రీంకోర్టు సస్పెన్షన్ లో పెట్టినా… రివ్యూ పిటిషన్ వేయకపోవటం దారుణం. సీడ్ల్యూసీ ప్రాజెక్ట్ ల పర్మిషన్ ఆపేసి లిస్ట్ లోంచి తీసేసింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవటం లేదు. సొంత జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారు. వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయాలి. మహబూబ్ నగర్ జిల్లాకు నీరిచ్చే వరప్రదాయని కృష్ణానది. అలాంటి కృష్ణానదిలో తెలంగాణ సిద్దించిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ డిజైన్ చేసుకోవటం జరిగింది. కేసీఆర్ గారి హయాంలోనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు 80 శాతం పూర్తైనయ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా సరే ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఉద్దండపూర్, కరివెన లో ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. నార్లపూర్ నుంచి ఎదెల వరకు వచ్చే టన్నెల్ పనులను చేయటం లేదు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ లను సుప్రీంకోర్టు సస్పెన్షన్ లో పెట్టింది. అయినా సరే కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. రివ్యూ పిటిషన్ కూడా వేయలేదు. ఇది దారుణం. ఇంకా దారుణంగా సీడ్య్లూసీ ఈ ప్రాజెక్ట్ ల పర్మిషన్లను ఆపేసి ప్రాజెక్ట్ లను లిస్ట్ లోంచి తీసేసింది. అయినా సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. పాలమూరు పులిబిడ్డను అని చెప్పుకునే ముఖ్యమంత్రే స్వంత జిల్లాకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఒక పక్క ఉన్న నీళ్లను వాడుకోవటం లేదు. మరో పక్క ఆల్మట్టి ఎత్తు పెంచితే మాట్లాడటం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీయే ఉంటది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే ఉంటది. అయిన చూస్తూ ఊరుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్లు మహబూబ్ నగర్ జిల్లాకు చారిత్రక అన్యాయం చేస్తున్నారు. జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. తక్షణమే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నా.”

అప్పంపల్లిలో అమరులకు నివాళి

దేవరకద్ర నియోజకవర్గం లోని అప్పంపల్లిలో సాయుధ రైతాంగ పోరాట యోధులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

“ఇక్కడకు ఉద్యమ సమయంలో రావటం జరిగింది. ఆనాడు కూడా తెలంగాణ ప్రజల కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించారో వారి స్ఫూర్తితో తెలంగాణ సాధించాలని అనుకున్నాం. ఈ రోజు కూడా అమరవీరుల స్ఫూర్తితోనే తెలంగాణ బాగు చేసుకోవాలని అనుకుంటున్నాం. గత పదేళ్లలో చాలా మంచి చేసుకోవటం జరిగింది. ఐతే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. 1948 ప్రాంతంలో భూమి కోసం, తెలంగాణ కోసం ఆనాటి దొరలు, నిజాం ప్రభువుల అరాచకాలపై పోరాడిన గ్రామ ప్రజల చరిత్ర ఇక్కడ ఉంది. గ్రామంలో ఉన్న సబ్బండ వర్గాల ప్రజల ఆనాటి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఇవ్వాళ కూడా మన హక్కులను సాధించుకోవాలంటే అందరం కలిసి ముందుకు సాగాలి. 1948, 1969, మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందాల్సిఉండే. కానీ వారికి అందాల్సినంత సాయం అందలేదని ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఇప్పుడు కూడా చెబుతున్నాను. వారందరికీ సాయం అందేంత వరకు కూడా నా తరఫున కృషి చేయటం జరుగుతుంది. తెలంగాణ లో అనేక గ్రామాల్లో ఇలాంటి స్థూపాలు కనబడతాయి. వారి కుటుంబాల దగ్గరకు కూడా వెళ్తాం. వారికి సముచిత గౌరవం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. 1948 లో పోరాటం చేసిన యోధులు మహబూబ్ నగర్ లో ఇంకా బతికే ఉన్నారు. వారందరినీ అనుభవాలు, పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు మీలో ఒకరిగా పోరాటం చేశా. ఇవ్వాళ కూడా నేను అలాగే ఉన్నా. ఏం మారలేదు. జనంబాట కార్యక్రమం ద్వారా మహబూబ్ నగర్ లో రెండు రోజులు పర్యటించనున్నాను. ఈ క్రమంలో మీ అందరినీ కలుసుకోవటం సంతోషంగా ఉంది. అమరవీరుల కుటుంబాలను సముచితంగా గౌరవించుకోవాల్సి ఉంది. 1948 పోరాట అమరవీరులకు సంబంధించి అక్కడక్కడ స్థూపాలు ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వారి విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై మేధావులతో రేపు చర్చలు జరపనున్నాం. అమరవీరుల కుటుంబాల నుంచి కూడా రావాలని కోరుతున్నా. యావత్తు తెలంగాణలో పోరాటం చేసిన వీరులను ఒక్క దగ్గరికి ఎలా తీసుకురావాలన్న దానిపై కూడా చర్చలు చేస్తాం. అందుకే మేధావులతో సమాలోచన…ప్రజలతో మమేకం కార్యక్రమం చేపట్టాం. దీనికి మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుతున్నా.”

ఆలయాల సందర్శన

మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా కల్వకుంట్ల కవిత పలు ఆలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జడ్చర్ల మండలంలోని మీనాంబరం శ్రీ పరుషవేదీశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికిన అర్చకులు.. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.