జాగృతి జనం బాట, నల్గొండ జిల్లా | Jagruthi Janam Bata Nalgonda

జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో తేదీ 11-11-2025 రోజున మొదటి రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కిష్టరాయినిపల్లి, నక్కలగుంట ప్రాజెక్ట్ లతో పాటు దేవరకొండలో బాలుర వెల్పేర్ హాస్టల్ ను సందర్శించారు. అక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పై పోరాటం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. 

డిండి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు

“డిండి లిప్ట్ ఇరిగేషన్ పూర్తైతే వేలాది మందికి లాభం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈ ప్రాంతం చుట్టు పక్కల ప్రజలు పెద్ద మనసు చేసుకొని తమ ల్యాండ్ ఇచ్చారు.  2015 లోనే తొందరగా ప్రాజెక్ట్ పూర్తై ఉంటే సమస్యలు ఉండకపోయేవి. దాదాపు 11 ఏళ్లు ఆలస్యమైంది. దీంతో అప్పుడు 18 ఏళ్లు నిండని చాలా మందికి ఇప్పుడు 18 ఏళ్లు దాటాయి.వారికి కూడా పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. అప్పుడున్న ధరలకు ఇప్పుడున్న ధరలకు చాలా తేడా ఉంది. అంతే కాకుండా నిర్వాసితులకు ఇళ్లు గానీ వేరే కాలనీలు గానీ కట్టించలేదు.

ప్రజలను వారికి కట్టించిన ఇళ్లలో దిగపెట్టే వరకు నెల నెల ఖర్చు ఇవ్వాలని చట్టంలో ఉంది. ఈ నాలుగు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకే ఇక్కడకు వచ్చా. గతంలో మునుగోడు ఎన్నికలు జరిగినప్పుడు ప్రపంచం మొత్తం ఆ ఎన్నిక గురించి మాట్లాడుకుందాం. అంత పెద్ద ఎత్తున ఆ ఎన్నికల్లో ఖర్చు చేశారు. అప్పుడు మీరు న్యాయం చేస్తానని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఇప్పుడు మాత్రం అడిగితే పట్టించుకోవటం లేదని మీరే చెబుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు సైతం మీకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. మిడ్ మానేర్ కు కట్టినప్పుడు కేటీఆర్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ కట్టిన సమయంలో కేసీఆర్ నియోజకవర్గం ప్రజలకు న్యాయం చేసినట్లు చేస్తానని అన్నారు. ఉదయం సముద్రం, శివన్నగూడెం, కిష్టరాంపల్లి, లక్ష్మణ పురం ప్రజలకు…ఎకరాకు రూ. 25 లక్షలు ఇప్పిస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన కూడా పట్టించుకోవటం లేదు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని పదే పదే అడిగి ఒత్తిడి తేవాల్సిన అవసరముంది. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. మేము రావటం కారణంగా మీకు 2 రూపాయలు లాభమైనా నా జన్మ ధన్యమైనట్లే. 

ఇక్కడకు వచ్చాక కాంట్రాక్టర్ తో మాట్లాడాను. 4 నెలలుగా వాళ్లకు కూడా ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వటం లేదంట. కట్టపోసుడు బంద్ పెట్టినం అని చెబుతున్నాడు. అంటే ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది.

ఆ లోపల మనం ఇళ్ల జాగాలు సాధించుకోవాల్సిన అవసరముంది. కొంతమంది ఇబ్రహీంపట్నం, మరికొంతమంది చింతపల్లి లో ల్యాండ్ కావాలని అడుగుతున్నారు. ఈ అంశానికి సంబంధించి ఒక తారీఖు అనుకొని నల్గొండలో లేదంటే హైదరాబాద్ లో మనం ప్రభుత్వాన్ని నిలదీయాలి. పంతం పట్టి అడిగితేనే పనులు అయ్యే పరిస్థితి ఉంది. 

మొత్తం దిండి పరివాహాక ప్రాంతంలో పనులు ఆగిపోయాయి. చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా ఆలస్యమయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఆలస్యం చేస్తున్న కొద్దీ నష్టం ఎక్కువ అవుతోంది. 

ఇది వరకు రైతులుగా ఉన్న వారు కూలీలు అయ్యారని చెబుతుంటే బాధేస్తోంది. ఇక కూలీలు ఏమైపోయారో తెలియని పరిస్థితి. ఊరంతా ఎత్తిపోయింది. ప్రభుత్వం తీరు కరెక్ట్ కాదు. బాధితులకు న్యాయం చేయాలి. 

వెంటనే వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. లేదంటే ఇక్కడ యువతతో కలిసి హైదరాబాద్ లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యాచరణ చేస్తాం”. అని చెప్పారు. 

దేవరకొండ మండలం కొమ్మపల్లి గురుకుల పాఠశాలను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు 

దేవరకొండ మండలం కొమ్మపల్లి గురుకుల పాఠశాలను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. ఈ సందర్భంగా విద్యార్థులతో తరగతి గదిలో కూర్చుని ముచ్చటించారు. గురుకులంలో పరిస్థితులు, ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. 

“దేవరకొండ ఎస్టీ బాలుర రెసిడెన్షియల్ హాస్టల్ లో ఉన్నాం. ఇక్కడి హాస్టల్ గురించి నేను ఒక రోజు పేపర్ లో వార్త చదివా. భారీగా వర్షం పడటంతో మోకాళ్లలోతు నీళ్ల నుంచి విద్యార్థులు బయటకు వచ్చారు. 

అప్పుడే ఈ స్కూల్ ను విజిట్ చేయాలనుకున్నా. ఇక్కడ వచ్చి చూస్తే ఇది లోతట్టు ప్రాంతం, స్కూల్ కు కాంపౌండ్ వాల్ లేదు. విద్యార్థులకు మినిమమ్ ఫెసిలిటీస్ లేవు. హాస్టల్ ఉంది. కానీ క్లాస్ రూమ్, స్కూల్ లేదు. పిల్లలు పడుకునే చోటే చదవు కోవటమనేది దారుణం. చాలా దయనీయం. శానిటేషన్ కోసం కూడా పిలిస్తే ఇద్దరే వర్కర్లు వచ్చినట్లు తెలిసింది. 450 మంది పిల్లలు ఉన్న చోట ఇద్దరే వర్కర్లు బాత్ రూమ్స్ క్లీన్ చేయటం బాధాకరం. 

పిల్లలకు ధోబి లేడు. వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటున్నారు.  స్కూల్ కు సంబంధించి 5 ఎకరాలు స్థలం ఉండేది. 

దాదాపు 2 ఎకరాలు ఎన్ క్రోచ్ మెంట్ అయ్యింది. పూర్తిగా స్థలాన్ని పంచనామా చేసి ఎన్ క్రోచ్ మెంట్ అయిన ల్యాండ్ ను గుర్తించాలని కలెక్టర్ గారిని కోరుతున్నా. అదే విధంగా స్కూల్ కు కాంపౌండ్ వాల్ నిర్మించాలి. 

స్కూల్ భవనం కట్టేందుకు కూడా టెండర్లు పిలవాలి. విద్యార్థులకు ఫుల్ టైమ్ ధోబి ఉండాలి. పౌష్టికాహారం లోపం కూడా ఉన్నట్లు తెలిసింది. పిల్లలకు రెగ్యులర్ గా హెల్త్ క్యాంప్ లు నిర్వహించాలి. ఇక్కడి విద్యార్థులు ఆటల్లో ముందున్నారని తెలిసింది. వారిని ఆ దిశగా ఎంకరేజ్ చేస్తూ సౌకర్యాలు కల్పించాలని ఆర్డీవో, కలెక్టర్ గారిని కోరుతున్నా. చిన్న గది ఉన్న సరే వంట వాళ్లు, మిగతా వర్కర్లు పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నారు. 

హాస్టల్స్ లో రాత్రి పూట టీచర్లకు డ్యూటీ వేస్తున్నారు. దాని కారణంగా టీచర్లు అలిసి పోతున్నారు. 

హాస్టల్స్ లో నైట్ డ్యూటీ కోసం వేరే సిబ్బందిని నియమించాలి”. అని డిమాండ్ చేశారు. 

దివంగత కవి అందెశ్రీ చిత్రపటానికి నివాళి 

దేవరకొండ బస్టాండ్ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. ఈ సందర్భంగా దివంగత కవి అందెశ్రీ గారి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. 

నక్కలగండి ప్రాజెక్ట్ సందర్శన

నక్కలగండి ప్రాజెక్టు సందర్శించి నిర్వాసితుల గోడు తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. నిర్వాసితులకు అండగా ఉంటానని హామీ. 

“ఎన్టీఆర్ హయాంలో రూపకల్పన చేసిన ఎస్ఎల్ బీసీ ఆధారంగా నక్కల గండి ప్రాజెక్ట్ కట్టాలని నిర్ణయించారు. 2009లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 545 కోట్లతో ప్రాజెక్ట్ ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పటికీ తెలంగాణ ఉద్యమం సాగుతుండటంతో పనులు జరగలేదు. తెలంగాణ వచ్చే వరకు కూడా ఎస్ఎల్ బీసీ ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగాయి. తెలంగాణ వచ్చాక 8 కిలోమీటర్ల వరకు టన్నెల్ తవ్వే ప్రయత్నం జరిగింది. కానీ సాంకేతిక కారణాలతో ప్రాజెక్ట్ పనులను ఆపాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సాంకేతిక లోపాలను పట్టించుకోలేదు. దాంతో పెద్ద ప్రమాదం జరిగి ఎనిమిది మంది చనిపోయారు. ఇప్పటికి నక్కల గండి సహా మరో రెండు తాండాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. మొథ్యా తాండా ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అసలు ఈ ప్రభుత్వం ఎస్ఎల్ బీసీని ఎప్పుడు పూర్తి చేస్తుందో చెప్పాలి.

ఈ కాంట్రాక్ట్ కూడా మంత్రి పొంగులేటికి చెందిన సంస్థదే. పనులు ఏ మాత్రం నాణ్యతతో చేయటం లేదని చెబుతున్నారు. చిన్న వరదకే జాలు వారుతోంది. అసలు సరిగా పనులు చేయటం లేదు. పైగా 2007 నాడే భూములు తీసుకున్నారు. కానీ ఇప్పటికీ చాలా మందికి సరైన పరిహారం రాలేదు. ఎంతో మంది పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్లు అయ్యారు. 18 ఏళ్లు నిండిన వాళ్లకు కూడా ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. అప్పట్లో గజం 70 రూపాయలు అని లెక్క గట్టారు. కానీ ఇప్పుడు రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పుడు రెండు లక్షలు ఇస్తామని అంటున్నారు. ఆ రేటుకే ఇళ్లను ఇవ్వాలని బెదిరిస్తున్నారు. అందుకు ఇక్కడి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని చెబుతున్నారు 

మొన్న బర్లపాడు తాండా మొత్తం మునిగిపోతే కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికీ రైతుల చేతుల్లోనే వారి పొలాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ రికార్డులలో లెక్కలు లేవు. దీంతో రైతులకు రైతుభరోసా, లోన్లు, కరెంట్ ఇలా ఏమీ రావటం లేదు. రైతుల విషయంలో ప్రభుత్వానికి ఎందుకు పట్టి లేదు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ పూర్తి అయ్యే వరకు కూడా రైతుల పొలాలకు అన్ని ప్రయోజనాలు అందించాలి. మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏమీ చేస్తోంది. ఇక్కడి ఎమ్మెల్యే గారు వచ్చి ప్రజల దయనీయ పరిస్థితిని చూడాలి. అసలు ఎస్ఎల్ బీసీకే కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో అనుమతి రాలే. టన్నెల్ పూర్తైనే అయితేనే నక్కల గండి ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. నక్కల గండి ప్రాజెక్ట్ కోసం 2300 ఎకరాలు భూమిని సేకరించారు. మరో 700 ఎకరాలు అటవీ భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు అటవీ భూమిని ప్రభుత్వానికి ఇవ్వలేదు. టన్నెల్ పనులు పూర్తి కాలేదు.  అటవీ భూమి ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరీ టన్నెల్ పనులు ఎన్నటికీ పూర్తి చేస్తారో చెప్పాలి. ప్రాజెక్ట్ అయ్యే వరకు రైతుల భూములకు మామూలు రైతుల ఇచ్చినట్లుగానే ప్రయోజనాలు ఇవ్వాలి. దాని గురించి మనం అడగాలి. అడగకపోతే ఇబ్బంది అవుతుంది. మీ తరఫున నేను ప్రభుత్వాన్ని అడుగుతా. సీఎం గారిని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలుద్దాం. మనకు భేషజాలు లేవు. ఎమ్మెల్యే వస్తలేడన్న విషయం కూడా చెబుదాం. పోయిన ఇళ్లకు సంబంధించి కూడా రివైజ్డ్ ఎస్టిమేషన్ వేయాలని కోరుదాం. ముందుగా మంత్రిగారిని అడుగుదాం. ఆయన ద్వారా పనికాకపోతే త్వరాత సీఎం ను కూడా అడుగుదాం”. అని అన్నారు.