జాగృతి జనం బాట, కామారెడ్డి జిల్లా | Jagruthi Janam Bata Kamareddy Day 2 (28-11-2025)

జాగృతి జనం బాట లో భాగంగా కామారెడ్డిలో రెండో రోజు తేదీ 28-11-2025 రోజు జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. కామారెడ్డిలో ప్రజలను నుంచి తెలుసుకున్న సమస్యలను ప్రస్తావించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు కోసం రైల్ రోకో నిర్వహించారు. దీంతో పోలీసులు కవిత గారిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. 

కవిత గారి కామెంట్స్

“మా కుటుంబం  ఉద్యమం, రాజకీయం అనే కమిట్ మెంట్ ఉన్న కుటుంబం. ప్రజలను, కుటుంబాన్ని వేర్వేరు చూసే పరిస్థితి లేదు. నన్ను కుటుంబం నుంచి దూరం చేసే కుట్రలో సస్పెండ్ చేయించారు. అందుకు బాధగా ఉంది. సస్పెండ్ చేయించిన వారు శునకానందం పొందవచ్చు.  కానీ మరో కుటుంబం అనుకునే తెలంగాణ కోసం పనిచేస్తూనే ఉంటా. నేను జైల్లో ఉన్నప్పుడు నా పిల్లల కన్నా కూడా మా అమ్మ ఆరోగ్యం గురించే ఎక్కువ బాధపడ్డా. 

తెలంగాణ అనే మరో కుటుంబం నాకు ఉంది. వారి కోసం ధైర్యంగా పనిచేస్తా. ఇక కామారెడ్డికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచే కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది.ఇక్కడి లీడర్లు చెబితే నమ్మరని కర్ణాటక సీఎం సిద్ధిరామయ్య గారిని తీసుకొచ్చి హామీలు ఇప్పించింది. కానీ అదే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రజలు వాళ్ల మాటలు నమ్మి గెలిపించారు. ఏతే ఎవరు అడగరని కాంగ్రెస్ భావిస్తుందేమో. జాగృతి తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. అసెంబ్లీ లో పూలే గారి విగ్రహాం, సాయిత్రి భాయ్ ఫూలే జన్మదినాన్ని మహిళ టీచర్ దినోత్సవం చేసేలా చేశాం. కామారెడ్డి డిక్లరేషన్ యధావిధిగా అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశాం. మా పోరాటం ఫలితంగా మేము మూడు బిల్లులు అడిగితే రెండు బిల్లులు తెచ్చారు. కానీ ఆ రెండు బిల్లులు కూడా రాష్ట్రపతి గారి వద్ద ఆగిపోయాయి. 

ఆ తర్వాత మేము రైల్ రోకో చేస్తామని వార్నింగ్ ఇస్తే మళ్లీ ఆర్డినెన్స్ తెచ్చారు. కానీ ఆ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి వద్దే ఆగిపోయింది. ఈ విషయంలో మేము బీజేపీ, కాంగ్రెస్ కొట్లాడుతూనే ఉంటాం. బీసీ రిజర్వేషన్ల సాధనలో జాగృతి ముందుంటుంది. కాంగ్రెస్ ఎంబీసీలకు మినిస్ట్రీ ఇస్తామని ప్రకటించింది. దాని జోలికి కూడా పోలేదు. 

నాయి బ్రహ్మణులు, రజకులకు ఇచ్చిన ఫ్రీ కరెంట్ బంద్ పెట్టారు. 3 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వాళ్లకు ఫీజు రీయింబర్స్ మెంట్ అన్నారు. ఇప్పుడు ఫీజు చెల్లించకపోవటంతో బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు బాధ పడుతున్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ లలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అన్నారు. మేము హైదరాబాద్ లో పోరాటం చేసి 42 శాతం రిజర్వేషన్లు వచ్చేలా చేశాం. బీసీలకు ఏటా రూ. 20 వేల కోట్లతో బడ్జెట్ పెడతామని చెప్పారు. 

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ఏడాదిలో బీసీలకు 9 వేల కోట్లే బడ్జెట్ పెట్టింది. అందులో సగం మాత్రమే ఖర్చు చేశారు. రెండో ఏడాది 11 వేల కోట్లు బడ్జెట్ పెడితే  కనీసం పావు వంతు కూడా ఖర్చు చేయలే. కనీసం రాజీవ్ యువ వికాసం లోనైనా పెద్ద ఎత్తున బీసీలకు నిధులు ఇవ్వండి. బీసీ, ఎంబీసీ లకు కార్పొరేషన్ అన్నారు. దాని ఊసే లేదు. అన్ని కులాలకు ఫెడరేషన్లు అని చెప్పి ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారిని బీసీ ద్రోహిగా మేము ఇప్పటికే ప్రకటించాం. ఆయన ఇప్పటి వరకు కూడా ప్రధాని మోడీ ఈ అంశంలో ఒక్క లేఖ రాయలేదు. అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్లలేదు. ఢిల్లీలో మాత్రం రెండు సార్లు ధర్నా చేస్తే రాహుల్ గాంధీ కూడా రాలేదు. వాళ్ల ధర్నాల కారణంగా నెట్ రిజల్డ్ జీరో ఉంది. ఇంత అర్జెంట్ గా పంచాయితీ ఎన్నికల అవసరమేముంది? తమిళనాడు లో జయలలిత గారు 9 ఏళ్లు ఎన్నికలను ఆపి రిజర్వేషన్లు సాధించారు. కేంద్రం నుంచి నిధులు రావనుకుంటే దాని గురించి వారితో మాట్లాడాలి. కాంగ్రెస్ కు బీసీలకు న్యాయం చేయాలని లేదు. అందుకే ఇంత తొందరగా ఎన్నికలు పెడుతున్నారు. పార్టీల పరంగా సీట్లు అంటే కాంగ్రెస్ ఇచ్చిన చోటే బీఆర్ఎస్, బీజేపీ బీసీలకు సీట్లు ఇస్తుందా? అంటే ఏదో ఇచ్చినట్లు ఇచ్చి వారిని ఒడగొట్టాలన్న కుట్ర. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే యకుత్ పుర సీటును బీసీకి ఇచ్చి ఒడగొట్టారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో అందరికన్నా మొదటి ద్రోహి బీజేపీ, రెండో ద్రోహి కాంగ్రెస్. ఆ రెండు పార్టీలను మేము నిలదీస్తూనే ఉంటాం. కాళేశ్వరంలో ప్యాకేజ్ 22 ద్వారా కామారెడ్డి నీళ్లు ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. అందుకు రూ. 1446 కోట్లు అవసరమైతే రూ. 450 కోట్లు మాత్రమే ఇచ్చారు.

మొత్తం 1500 ఎకరాల ల్యాండ్ అవసరమైతే రెండు వంతు భూసేకరణ కూడా చేయలేదు. కాళేశ్వరంతో కామారెడ్డికి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదు. నిజామాబాద్ కు కూడా కాళేశ్వరం నీళ్లు రాలేదు. ఒక్క సీజన్ లో మాత్రమే హల్ది వాగు ద్వారా నీళ్లు ఇచ్చారు. ఈ విషయం నేను చెబితే బీఆర్ఎస్ వాళ్లు నా మీద నోరు వేసుకొని పడిపోతారు. కొండం చెరువు కెపాసిటీ ని తగ్గించారు. కానీ ప్రాజెక్ట్ వ్యయం మాత్రం తగ్గించలేదు. కాళేశ్వరం 21, 22 ప్యాకేజ్ ల కారణంగా ప్రజలకు మేలు జరగలేదు. కాంట్రాక్టర్లకు మాత్రమే పైసల్ పోయినయ్. కాళేశ్వరం ప్యాకేజ్ 21, 22 కింద కాలువ డిజైన్ కు వేల ఎకరాలు భూసేకరణ అవసరమైంది. ఐతే భూసేకరణ ఎక్కువ లేకుండా డిజైన్లు మార్పించాం.

ఫైప్డ్ వాటర్ కు చెరువుల ద్వారా సప్లయ్ చేసే ప్రయత్నం చేశాం. కానీ ఇప్పటి వరకు కూడా  కాళేశ్వరం నీళ్లు రాలేదు. ఒక ప్రభుత్వం చేపట్టిన పనులు ఇంకో ప్రభుత్వం కొనసాగించాలి. కాళేశ్వరం పనులు కొనసాగించకపోతే కామారెడ్డి వేరే ఏ మార్గంలో నీళ్లు తెస్తారో ప్రభుత్వం చెప్పాలి. 19 ఏళ్లుగా తెలంగాణ జాగృతి తెలంగాణ ప్రజల ఆశలు, అకాంక్షలే పరమావధిగా పనిచేస్తోంది. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం పరితపించాం. 

ఎక్కని కొండ లేదు, మొక్కని దేవుడు లేడు అన్నట్లు అప్పుడు పనిచేశాం. రాష్ట్రం వచ్చాక కూడా ప్రజలు బాగుండాలని మేము చేస్తున్న పోరాటాన్ని మీరు గమనిస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు మాకు ఒక్కటే చెప్పేవారు. ఒక రాష్ట్రం అస్తిత్వం, సంస్కృతికి వైభవం పోతే తిరిగి సాధించుకోవటానికి చాలా ఏళ్లు పడుతుందనే వారు. అందుకే మేము తెలంగాణ సాంస్కృతి, వైభవాన్ని కాపాడేందుకు పోరాటం చేశాం. అదే సమయంలో రాజకీయాల గురించి కూడా మాట్లాడాం. మన దేశంలో ఏ మార్పు రావాలన్న రాజకీయాల ద్వారానే సాధ్యం. 

అందుకే రాజకీయాలను ప్రభావితం చేస్తూ ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. జనం బాటలో భాగంగా ఇప్పటి వరకు 11 జిల్లాలు తిరిగాం. ఇంకా 21 జిల్లాలు పర్యటిస్తాం. ఎన్నికల కోడ్ రావటంతో కామారెడ్డి పర్యటన తర్వాత జనం బాటలో స్వల్ప మార్పులు ఉంటాయి. హైదరాబాద్, మేడ్చల్ లో మా పర్యటన కొనసాగుతుంది. 

కామారెడ్డి పర్యటనలో భాగంగా జుక్కల్ లో నాగమడుగు, నిజాం సాగర్, నాగిరెడ్డి, లింగంపేట్ ప్రాంతాలను సందర్శించాం. అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకున్నాం. వాటికి పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం. 

ఇక ఇటీవల కాలంలో కామారెడ్డి పేరు వార్తల్లో ఎక్కువగా వినిపించింది. గత ఆగస్ట్ లో కురిసిన భారీ వర్షాలకు మొత్తం కామారెడ్డి నీట మునిగింది. దీంతో చాలా మంది ఇళ్లు కోల్పోయారు. వరి, పత్తి, సోయ, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. 94 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆగస్ట్ 27, 28 తేదీల్లో వర్షాలు పడితే సీఎం గారు మాత్రం సెప్టెంబర్ న 4 పర్యటనకు వచ్చారు. వచ్చి వరదల కారణంగా చనిపోయిన వారికి రూ. 5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. దెబ్బ తిన్న పంటలు, పశువులు, ఇళ్లకు సంబంధించి పరిహారం ఇస్తామని చెప్పారు. 

మళ్లీ 15 రోజుల్లో రివ్యూ కూడా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. 

కానీ 4 వందల ఇళ్లకు మాత్రమే 11 వేలు తక్షణ సాయం చేశారు. మిగతా వారికి ఒక్క పైసా కూడా రాలేదు. ఇది దారుణం, అన్యాయం. పంట పొలాల్లో 2, 3 ఫీట్లు బురద పేరుకుపోయింది. రైతులు కట్టుబట్టలతో మిగిలిపోయారు. 

ముఖ్యమంత్రి గారు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేశారు. కానీ కొండగల్ మీద చూపిన ప్రేమ కామారెడ్డి పై చూపటం లేదు. ఎందుకు కామారెడ్డి పై శీతకన్ను వివక్ష చూపుతున్నారో చెప్పాలి. ముఖ్యమంత్రి గారు వెళ్లిన తర్వాత ప్రజలకు కనీసం రూపాయి కూడా రాలేదు. లింగంపల్లి- కామారెడ్డి బ్రిడ్జి కొట్టుకుపోతే రెండు నెలలు పట్టించుకోలేదు. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డ సరే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏదో కాంట్రాక్టర్ కు చెబితే ఆయన మట్టి పోసి కాస్త బాగు చేశారు. కానీ ఇప్పటి పెద్ద వర్షం వస్తే ఏమైతదో తెలియని పరిస్థితి ఉంది. 

ప్రభుత్వం వెంటనే శ్రద్ద పెట్టి ఆ బ్రిడ్జి పనులను పూర్తి చేయాలి. ఇక్కడున్న షబ్బీర్ అలీ గారు ప్రభుత్వంలో చాలా పలుకుబడి ఉన్న నేత. ఆయన ఈసారి గెలవలేదు. కానీ గెలిచిన వాళ్లను టార్చర్ పెడుతున్నాడు. ఇక్కడి ఎమ్మెల్యేను కాదని అన్ని కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తున్నారు. కానీ కామారెడ్డికి రూపాయి నిధులు తేవటం లేదు. మీరు సొంతూరు కామారెడ్డి, మీరు నిజామాబాద్ నుంచి పోటీ చేశారు. ఈ రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి తో మాట్లాడి నిధులు తీసుకురండి. కామారెడ్డి లో వరద బురదకు కారణమైన వాళ్లు గతంలో బీఆర్ఎస్ ఉండి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లారు. దీంతో అప్పుడు, ఇప్పుడు వారిపై చర్యలు తీసుకుంటలేరు. 

హైడ్రా లాంటి సంస్థ ఇక్కడ కూడా పెట్టి బురద సాప్ అయితదేమో చూడాలని సీఎం గారిని కోరుతున్నా. 

ఇక్కడ ఎమ్మెల్యే గా గెలిచిన వెంకట రమణారెడ్డి గారు ఇద్దరు సీఎంలను ఓడించారు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన ఏమీ పనిచేయటం లేదు. కామారెడ్డికి వరదలు వస్తే బీజేపీ వాళ్లు పేరేడ్ చూసినట్లు చూశారు. 

వాళ్లకు మన కష్టం పేరేడ్ లాగా కనిపిస్తోంది. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదు. 

గుజరాత్, బీహార్ లో వరదలు వస్తే కోట్ల రూపాయలు సాయం చేశారు. కామారెడ్డిలో మాత్రం వరదలు వస్తే పైసా ఇవ్వలేదు. బీజేపీకి తెలంగాణ అంటేనే పట్టదన్న విషయం ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. కామారెడ్డి ఎమ్మెల్యే గారు గెలిచేందుకు ఆపద మొక్కులు చాలా చెప్పారు. ఇప్పుడు అవి అడిగితే మీ ఆస్తులు మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. కనీసం ప్రజల కోసం సీఎంతో పోరాటం చేయండి. బీజేపీ ద్వారా నిధులు వచ్చేలా చేయండి. కాంగ్రెస్ తో కొట్లాడండి. ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? మనకు తెలుసు తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం. కానీ ఇక్కడ నిజాం సాగర్ తో జుక్కల్ కు ప్రయోజనం లేని పరిస్థితి. లెండి కట్టాల్సిన ఉన్నప్పటికీ మహారాష్ట్రతో పంచాయతీ ఉంది. ఇక జుక్కల్ కు నీళ్లు రావాలంటే నాగమడుగు ప్రాజెక్ట్ కట్టాల్సి ఉంది. నిన్న మేము ఆ ప్రాంతాన్ని సందర్శించాం.  ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు 464 కోట్లు కావాల్సి ఉంది. మొత్తం 2 వందల ఎకరాల భూ సేకరణ జరగాలి. కానీ 12 ఎకరాలు మాత్రమే సేకరించారు. అదే విధంగా రూ. 64 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు ఖర్చు చేశారు. ఆ ప్రాజెక్ట్ ను పట్టించుకోవటం లేదు. నిన్న మేము వస్తున్నామని తెలిసి ఏదో నడిపించే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు కేవలం 64 కోట్లు మాత్రమే ఖర్చు చేశారంటే… ప్రాజెక్ట్ పూర్తి కావటానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. ఇక్కడి ఎమ్మెల్యే గారు సీఎం ను డిమాండ్ చేసి పనులు జరిపించాలి. ఈ సమస్యను మేము వదలిపెట్టం. ఇరిగేషన్ మినిస్టర్ ను కూడా కలుస్తాం. నిజాం సాగర్ ను 3 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా  30 టీఎంసీల సామర్థ్యంతో కట్టారు. కానీ ప్రాజెక్ట్ లో భారీగా మట్టి పూడుకుపోయింది. ఆ మట్టిని తీస్తే కామారెడ్డి జిల్లాను సస్య శ్యామలం చేయవచ్చు.నిజాం సాగర్ ను టూరిస్ట్ స్పాట్ చేసేందుకు ఇక్కడి ఎమ్మెల్యే గారు శ్రద్ధ పెట్టాలి. 

కామారెడ్డి పత్తి రైతుల ఇబ్బందులు శాశ్వతంగా తొలగాలంటే ఇక్కడ జిన్నింగ్ మిల్లు ఏర్పాటు చేయాలి.లంబాడాలకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలి. వీటి కోసం జాగృతి ప్రత్యేక కార్యాచరణ చేపడుతుంది. 

ఇందిరమ్మ ఇళ్లు ఇదివరకు ఇళ్లు ఉన్నవాళ్లకు, కాంగ్రెస్ వాళ్లకే ఇచ్చారు. ఒకరిద్దరూ బయట వాళ్లకు ఇస్తే వారి వద్ద నుంచి కూడా లంచం తీసుకున్నారు. పైగా ఇళ్లు ఇవ్వాలంటే ఉన్న ఇళ్లు కూలగొట్టుకోవాలంట. దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య లేకుండా ప్రభుత్వం ఉపాయం వెతకాలి. ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు అడుగుతున్న విషయంపై సీఎం, షబ్బరీ అలీ కఠినంగా వ్యవహరించాలి. ఇక్కడి త్రిలింగేశ్వర, కాళ బైరవ స్వామి గుళ్లకు డబ్బులు నేను తెస్తే అడ్డుకున్నారు. అప్పుడున్న ఎమ్మెల్యే, ఇప్పుడన్న ఎమ్మెల్యే కూడా నిధులు తేలే.  

వీళ్లకు మనుషుల మీద, దేవుళ్ల మీద కూడా కోపమే.ఎమ్మెల్యే గారు ఈ రెండు గుళ్లకు నిధులు తేవాలి. లేదంటే మేమే సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నిధులు తెస్తాం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మొహన్ రావు గారు రెండేళ్లుగా ప్రజలకు కనిపించటం లేదంట. ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటేనే ప్రజలు వారి సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. 

సర్పంచ్ ఎన్నికల కోస వచ్చే పార్టీలను యువత ప్రశ్నించాలి. వారు ఏం చేస్తారో మాట తీసుకోండి. గెలిచాక చేయకపోతే తాట తీయండి.రాజకీయాలు మారాలంటే యువ మిత్రులు మేల్కొవాల్సిన అవసరముంది. 

ఆడబిడ్డలైతే కచ్చితంగా ప్రశ్నిస్తారు. యువమిత్రులు వారి చైతన్యాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. కౌలాస్ కోట ను బీబీపాటిల్ గారు దత్తత తీసుకొని ఒక్క రూపాయి తేలేదు. జనం బాటలో భాగంగా రెండు ప్రాంతాలను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే మనం గత శతాబ్దంలో ఉన్నామా అనిపించింది. మళ్లీ జుక్కల్ లో అలాంటి పరిస్థితినే చూశాను.  ఇక్కడ రోడ్లు చాలా ఆధ్వాన్నంగా ఉన్నాయి. రోడ్లు బాగా లేవని నిరసన తెలిపితే 11 మంది యువకులపై కేసులు పెట్టారు. 

చేెవెళ్లలో కూడా రోడ్లు బాగా లేవని ధర్నా చేసిన వారిపై కేసులు పెట్టారు. ఆ మరుసటి రోజే అక్కడ యాక్సిడెంట్ అయ్యింది.కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు. జుక్కల్ లో యువకులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. జీవో నంబర్ 317 కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ అంశంపై కేసీఆర్ గారిని విమర్శించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. కానీ రెండేళ్లైనా ఆ సమస్య పరిష్కారం కాలేదు. ముఖ్యమంత్రి గారు దీనిపై దృష్టి పెట్టాలి.ఇక్కడి రైల్వే ట్రాక్ మీద గొర్లను కాపాడే ప్రయత్నంలో గొర్ల కాపరి సుధాకర్ అనే యువకుడు మరణించాడు. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. 

కనీసం రైల్వే వాళ్లతో మాట్లాడి వారికి పరిహారం అందించే ప్రయత్నం కూడా చేయటం లేదు. గతంలో ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎమ్మార్వో గారి వచ్చి తక్షణ సాయం అందించే వారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కనీసం అలాంటి సాయం కూడా చేయకపోవటం దారుణం. రైలు ప్రమాదంలో 2 వందల గొర్రెలతో పాటు సుధాకర్ అనే గొర్ల కాపరి కూడా చనిపోయారు. వారి కుటుంబానికి జాగృతి తరఫున రూ. 50 వేలు సాయం అందించాం. వారి పిల్లల చదువు బాధ్యతను కూడా మేము తీసుకుంటాం. కానీ ఒక సంస్థగా మేము ఎంత వరకు చేయగలం? ప్రభుత్వమే దీనిపై ఒక పాలసీ తేవాలి. రెండో విడత గొర్రెల పంపిణీ ఆగిపోయింది. ఇప్పటికీ యాదవ సోదరులు డీడీలు కట్టారు. 

వారిపై మిత్తిల మీద మిత్తి పడుతోంది. రేవంత్ రెడ్డి మాదిరిగా యాదవ, కురుమ సోదరులు ధనవంతులు కాదు. 

వారికి వెంటనే వారి డబ్బు లేదా గొర్రెలను పంపిణీ చేయాలి. జాగృతి జనం బాటలో భాగంగా ప్రజల సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. దీర్ఘకాలిక సమస్యలుంటే ఒక కార్యాచరణ, తక్షణం పరిష్కరమయ్యే సమస్యలకు ఒక విధంగా పని చేస్తున్నాం. ప్రతి ఐదు జిల్లాలకు మేము యాక్షన్ టేకేన్ రిపోర్ట్ ను విడుదల చేస్తాం. ఆటో డ్రైవర్లను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. వారికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఏటా ఇస్తామన్న రూ. 12 వేలు కూడా వెంటనే ఇవ్వాలి. కానీ కేసీఆర్ గారినే తిడతామంటే కుదరదు. ఆ ప్రభుత్వం ఓడిపోయింది”. అన్నారు. 

బీసీ రిజర్వేషన్ల కోసం కామారెడ్డి లో రైల్ రోకో

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో రైలు రోకో. పట్టాలపై బైఠాయించిన కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి నాయకులు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో కవిత రైలు రోకో నేపథ్యంలో సిర్నపల్లి – ఇందల్వాయి మధ్య దేవగిరి ఎక్స్ ప్రెస్ రైలు నిలిపివేసిన అధికారులు. కల్వకుంట్ల కవిత గారిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ రూట్లో తరలించిన పోలీసులు. కవిత గారి వాహనం తప్ప మరో వాహనం కూడా వెంట వెళ్లకుండా కామారెడ్డిలో నిలిపివేసిన పోలీసులు.పోలీసులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి నాయకుల ఆందోళన. కవిత గారి రైలు రోకో నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న దేవగిరి ఎక్స్ ప్రెస్ తో పాటు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపునకు వెళ్తున్న గూడ్స్ రైలును నిలిపి వేసిన అధికారులు.  రైలు రోకో చేస్తున్న కవిత గారిని అదుపులోకి తీసుకొనే సమయంలో పెనుగులాట.. కవిత గారి చేతికి స్వల్ప గాయం. 

అరెస్ట్ తర్వాత మాట్లాడిన కవిత గారు

“రైల్ రోకో చేసి ఢిల్లీ వరకు మెసేజ్ పంపిస్తున్నాం. కచ్చితంగా బీజేపీ దిగిరావాలి. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. బీసీ బిడ్డలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లు ఇవ్వాలి. రాష్ట్రపతి, గవర్నర్ దగ్గర ఉన్న బిల్లుకు బీజేపీ అడ్డం పడవద్దు. బీసీ బిడ్డలకు బీజేపీ అన్యాయం చేయవద్దని కోరుతున్నా. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నా”.  అని అన్నారు.