కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోని బోయిన్ పల్లి ప్రభుత్వ పాఠశాల ఎస్సెస్సీ విద్యార్థులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంపర్ ఆఫరిచ్చారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయిన్ పల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కవిత విద్యార్థులు, టీచర్లతో మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థులతో కొద్దిసేపు గడిపారు. సరదాగా మాట్లాడారు. ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో క్లాస్ లో మంచి మార్కులు సాధించి టాప్ టెన్ స్థానాలు పొందిన విద్యార్థులను వారు కోరుకున్న కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిస్తానని హామీ ఇచ్చారు. వారి చదువుకయ్యే ఖర్చు తెలంగాణ జాగృతి భరిస్తుందని ప్రకటించారు. బాగా చదువుకుని మంచి మార్కులు సాధించాలని సూచించారు.

“బోయినిపల్లి స్కూల్ ను మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా బాగు చేశారు. కానీ కాంపౌండ్ వాల్, సీసీ కెమెరాలు లేవు. వాటిని మేము ఏర్పాటు చేస్తాం. ఈ స్కూళ్లోనే అంగన్ వాడీని కూడా కలిపారు. అంగన్ వాడీలో హెల్పర్లు లేరు.
జనం బాటలో భాగంగా విద్య, వైద్యం మీద ఫోకస్ పెట్టాం. స్కూల్స్, హాస్పిటళ్లలో మౌలిక వసతులు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తున్నాం. ఇండ్లు, ఇళ్ల పట్టాలు లేని వారి సమస్యలు కూడా తెలుసుకుంటున్నాం. మా వరకు చేయగలిగేది మేము ఒక సంస్థగా చేస్తాం. టాప్ టెన్ విద్యార్థులకు మా తరఫున స్కాలర్ షిప్ లు ఇస్తాం. అదే విధంగా ప్రభుత్వం సాధించే వాటిని కూడా మేము చేయిస్తాం. ఏ జిల్లా కు వెళ్లినా ప్రజల నుంచి ఆదరణ, సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటున్నది.
ప్రజల సమస్యలను వీలైనంతగా మేము పరిష్కరిస్తాం. గత ప్రభుత్వంలో నన్ను నిజామాబాద్ కే పరిమితం చేశారు.
అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదు. తెలంగాణ వచ్చాక ఏం జరిగింది. ఏం జరగలేదన్నది జనం బాట కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. మేము చేయగలిగేవి చేస్తాం. మిగిలిన సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. మంచిని మంచి, చెడును చెడు అనే అంటాం. ఈ స్కూల్ ను బాగు చేశారు. బాగుందనే అంటాం. రాష్ట్రంలో ప్రతిపక్షం పట్టించుకోవటం లేదు. పాలక పక్షం అసలే పట్టించుకుంట లేదు. అందుకే జాగృతి జనం గళమై పనిచేస్తోంది.”