ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో సాగునీటి సమస్య పరిష్కారానికి పెద్ద చెరువులను రిజర్వాయర్లుగా అభివృద్ధి చేయాల్సిన అవసరముందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాటలో భాగంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని వెలుగుపల్లి రుద్రమచెరువును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎస్సారెస్పీ స్టేజ్ 2 లో భాగంగా నల్గొండ జిల్లాలో రిజర్వాయర్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. రుద్రమచెరువును 5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ గా రూపొందిస్తామని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు స్థానికులకు ఆశలు కల్పించి ఓట్లు దండుకున్నాయని విమర్శించారు. ఈ చెరువును లక్నవరంలా పర్యటక కేంద్రం చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా పనులు మాత్రం చేపట్టడం లేదన్నారు. 700 ఎకరాల్లో విస్తరించి ఉన్న రుద్రమ చెరువు ఈ ప్రాంత రైతుల అవసరాలు తీర్చాలంటే ఇక్కడికి గోదావరి జలాలు రప్పించాలన్నారు. కిలోమీటర్ కు పైగా డిస్ట్రిబ్యూటరీ కాల్వ తవ్వకపోవటం కారణంగా గోదావరి నీళ్లు రావటం లేదని చెప్పారు. ఈ చెరువును భారీ రిజర్వాయర్ గా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.


అంతకుముందు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చే ఎస్సార్ ఎస్పీ స్టేజీ -2 కాల్వను కవిత పరిశీలించారు. రాష్ట్రంలో పంట కాల్వల మెయింటేనెన్స్ సరిగా లేదని విమర్శించారు. కాల్వల్లో కంప చెట్లు పెరిగాయని చెప్పారు. వీటి మెయింటెనెన్స్ కోసం బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఒక్కపైసా విడుదల చేయలేదన్నారు.
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగానికి కనీసం నిధులు ఇవ్వటం లేదని తెలిపారు. కోదాడ వరకు నీళ్లు ఇచ్చే డిస్ట్రిబ్యూటరీ కాల్వ 70 కిలోమీటర్లు ఉంటుంది.. ఈ కాల్వను సరిగా మెయింటెన్ చేయటం లేదను కవిత విమర్శించారు.
అర్వపల్లి మండలంలోని కేజీవీబీ స్కూల్ సందర్శించిన సందర్భంగా అక్కడి దుర్భర పరిస్థితి తెలిసిందని కల్వకుంట్ల కవిత చెప్పారు. ఎప్పుడు వర్షం వచ్చినా సరే ఆ స్కూల్ ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోతుందని తెలిపారు. పూర్తిగా చెరువులో కట్టటంతో ఎప్పుడు నీళ్లు నిలిచి దోమల బెడద ఉంటుందని పేర్కొన్నారు. గతేడాదిలో తుపాన్ వచ్చి స్కూల్ మునిగిపోతే కలెక్టర్ వచ్చి పరిశీలించారు.. కానీ ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకోలేదన్నారు. సూర్యాపేట జిల్లాసాయుధ, విప్లవ పోరాటాలకు పెట్టింది పేరని, సాయుధ పోరాటం నాటి నుంచి ఎన్నో ఉద్యమాల్లో ఎంతో మంది అమరులయ్యారని కవిత కొనియాడారు. బండెనుక బండి కట్టి అనే పాట రాసిన బండి యాదగిరిది కూడా ఇదే జిల్లా అని గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో మా లాంటి సంస్థలు జిల్లా అభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై దృష్టి పెట్టామని చెప్పారు.
