Kavitha attacks political drama affecting Krishna water rights

గుంటనక్క హరీష్ రావు కుట్రలతో రాష్ట్రానికి ద్రోహం -కల్వకుంట్ల కవిత

అసెంబ్లీ వదిలి ఆఫీసులో డ్రామాలు | సూర్యాపేట

 గుంటనక్క హరీష్ రావు కారణంగానే తెలంగాణకు సాగునీటి జలాల విషయంలో అన్యాయం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆయనను ముఖ్యమంత్రి ఒక్క మాట అంటే సభను వాయిదా వేసుకొని వెళ్లిపోయారని తప్పుపట్టారు. ప్రతిపక్షం అంటే ఒక పార్టీ మాత్రమే కాదు.. ప్రజల గొంతుక అన్నారు. తన మాట నెగ్గడం కోసం సభ నుంచి పార్టీ మొత్తాన్ని వాకౌట్ చేయించారని హరీశ్ రావుపై ధ్వజమెత్తారు. జాగృతి జనంబాటలో భాగంగా సూర్య పేటలో కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు.

బీఆర్ఎస్ డ్రామా

“సభలో కాంగ్రెస్ ది ఒక డ్రామా అయితే బీఆర్ఎస్ ది మరొక డ్రామా. సభలో మూసీ, జీహెచ్ఎంసీకి సంబంధించిన డివిజన్లపై చర్చ జరిగితే ప్రతిపక్షం లేదు. కేవలం హరీశ్ రావు ను అంటే బాయ్ కాట్ చేస్తారా? కేసీఆర్ ను తిట్టినప్పుడు ఈ గుంటనక్క అలాగే వ్యవహరించిందా? ఏదైనా అంశంపై వ్యతిరేకత ఉంటే ఆ అంశంపై మాత్రమే బాయ్ కాట్ చేయాలి. మేము పార్లమెంటులో ఉన్నప్పుడు కూడా అంశాలను బట్టి వ్యతిరేకత చెప్పే వాళ్లం. మళ్లీ వేరే అంశానికి సంబంధించి చర్చ జరిగినప్పుడు వచ్చి మాట్లాడే వాళ్లం. నిన్న జీహెచ్ఎంసీని 300 డివిజన్ చేసే బిల్లు పెట్టారు. అది అవసరం లేదా? దానిపై బీఆర్ఎస్ చర్చలో పాల్గొనవద్దా..హరీష్ రావు ను తిట్టారు కనుక వాయిదా వేసుకొని పోయారా? డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా బాయ్ కాట్ నిర్ణయాన్ని హరీశ్ రావు తీసుకున్నారా.. లేక బీఆర్ఎస్ అధినాయకత్వం తీసుకుందా? బీఆర్ఎస్ మిగతా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు సబితా, శ్రీనివాస్ యాదవ్ కూడా తమ టైమ్ హరీశ్ రావుకే ఇవ్వమన్నారు. అంటే హరీశ్ రావు పార్టీలో తనకంటూ ఒక గుంపును తయారుచేసుకుంటున్నారా.. 

బాయ్ కాట్ నిర్ణయం కచ్చితంగా హరీశ్ రావు దే అని నేను బలంగా నమ్ముతున్నా. ఒకవేళ కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ తీసుకొని ఉంటే అది శ్రేయస్కరమైన పద్ధతి కాదు. కృష్ణా జలాల అంశంపై సభలు పెడతామంటున్నారు. చట్టసభలో వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం సరికాదు. ప్రజలు ఏమనుకున్నా సరే బీఆర్ఎస్ లో తోక కుక్కను ఊపే పరిస్థితి వచ్చింది. ప్రతిపక్షం లేకపోవటంతో కాంగ్రెస్ వాళ్లు ఇష్టమొచ్చినట్లు అబద్దాలు చెప్పారు. బీఆర్ఎస్ ఉండి ఉంటే ఆ అబద్ధాలను అడ్డుకునే అవకాశం ఉండేది కదా? “

Kavitha criticising Harish Rao over Telangana irrigation injustice

రాష్ట్రానికి హరీశ్ అన్యాయం

“తెలంగాణ నీటివాటాను తగ్గించే విధంగా హరీశ్ రావు మంత్రిహోదాలో నిర్ణయం తీసుకుని రాష్ట్రానికి అన్యాయం చేశారు. తెలంగాణకు 3 శాతం నీటి వాటా తగ్గించే ఒప్పందానికి సంతకం చేసింది హరీశ్ రావ్ కాదా? ఇప్పటికే కట్టిన ప్రాజెక్టులపై తెలంగాణకు 37 శాతం, ఆంధ్రాకు 63 శాతం వాటా ఉండేది. కానీ కాళేశ్వరరావు అని పిలిపించుకున్న హరీశ్ రావు మనకు 34 శాతం నీళ్ల వాటాకే అంగీకరిస్తూ సంతకం చేశారు. ఇది నిజమా..కాదా? చెప్పాలి. విజ్ఞతకే వదిలేస్తున్నా అంటే ప్రజలు గమనిస్తారు. లేదంటే ప్రజలు తమ విజ్ఞతను ప్రదర్శిస్తారు. నేను అడిగిన ప్రశ్నలకు హరీశ్ రావు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సమాధానం చెప్పాలి. జూరాల నుంచి శ్రీశైలంకు ఇన్ టేక్ పాయింట్ ఎందుకు మార్చారో కూడా చెప్పాలి. హరీశ్ రావు ధనదాహాం కారణంగానే ఇన్ టేక్ పాయింట్ శ్రీశైలంకు మారింది. ఏల్లూర్ పంప్ హౌస్ ను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ గా మార్చారు. అందుకు దాదాపు 14 వందల కోట్లు ఖర్చు పెట్టారు. దీని కారణంగా 30 మీటర్ల ఎత్తు పెరిగి మనం తీసుకోవాల్సిన వాటర్ కెపాసిటీ తగ్గింది. పైగా అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కారణంగా కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ లో మోటార్లు చెడిపోయాయి. మొత్తం 5 మోటార్లకు గాను ఇప్పటి వరకు 3 మోటార్లే పనిచేస్తున్నాయి. వాటిని రిపేర్ కూడా చేయలేదు. 

అసెంబ్లీలో చెప్పే అంశాలను పార్టీ ఆఫీసులో చెప్పటం సరికాదు. హరీశ్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటేనే ఆయనకు రేవంత్ తో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు ఉంటాయి. కేసీఆర్ ను సీఎం కసబ్ తో పోల్చితే నేను మాత్రమే రియాక్ట్ అయ్యాను. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు. అలాంటి వ్యక్తిని టెర్రరిస్ట్ తో పోల్చుతారా.. రాజకీయంగా హుందాగా విమర్శలు చేయాలని భావించే వ్యక్తిని నేను. కేసీఆర్ ను ఉరి తీయాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి కృష్ణానది నీటిలో నష్టం చేస్తున్న దానికి ఆయనను రెండుసార్లు ఉరి తీయాలి. కేసీఆర్ అలా విమర్శించటం దేశద్రోహామే అవుతుంది. కేసీఆర్ అలా విమర్శిస్తే బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడలేదు. ఎవరి ఎజెండాలు వాళ్లకు ఉన్నాయి. అందుకే వాళ్లు లోపలున్నరు..నేను బయట ఉన్నాను. బీఆర్ఎస్ హయాంలో నన్ను నిజామాబాద్ కే పరిమితం చేశారు. అయినా సరే ఆ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్లో నాకు కూడా భాగం ఉన్నట్లే. నేను జనంబాట ప్రారంభించినప్పుడే క్షమాపణ చెప్పి ముందుకు కదిలాను. నాయకులు తప్పులు చేసినప్పుడు క్షమాపణ కోరి సరిదిద్దుకోవాలి. బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేశారు. ఉద్యమకారులకు చేయాల్సినంత చేయలేదు. ఆ పాపంలో నాకు భాగస్వామ్యం ఉన్నట్లే. అందుకే క్షమాపణ చెప్పాను. భవిష్యత్తులో చాలా జరుగుతాయి. ఇక నేను సక్సెస్ అవుతానా.. ఫెయిల్ అవుతానా ప్రజలు నిర్ణయిస్తారు.”