కోదాడలో పోలీస్ కస్టడీలో మృతి చెందిన దళిత యువకుడు కార్ల రాజేశ్ కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం పరామర్శించారు. లక్ష రూపాయల వివాదంలో తెలంగాణ ప్రభుత్వం నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని కవిత విమర్శించారు. రాజేశ్ చనిపోయిన తర్వాత కూడా విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో రిమాండ్ చేసి నాలుగు రోజులు పలు స్టేషన్లలో తిప్పారని చెప్పారు. రిమాండ్ కూడా చూపించకుండా రాజేష్ పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరుషంతో లక్ష రూపాయలు వాళ్ల మొఖాన కొట్టినా జాలి లేకుండా ఆ అబ్బాయి ఆరోగ్యం పాడయ్యేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు హాస్పిటళ్లలో చూపించామని చెబుతున్నారు కానీ జైలు అధికారులు కాకుండా రెగ్యులర్ పోలీసులు ఎందుకు ఇందులో ఇన్ వాల్వ్ అయ్యారో వెల్లడించాలని ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసులు రాజేష్ ను పొట్టన బెట్టుకున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు విశారదన్ వచ్చినప్పుడు అనేక మంది జాగృతి నాయకులు ఆయన వెంట ఉన్నారని గుర్తు చేశారు. మందకృష్ణ మాదిగ వచ్చి గట్టిగా మాట్లాడిన తర్వాతనే ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చిందని తెలిపారు. రాజేశ్ కాస్టోడియల్ డెత్ విషయంలో అగ్రవర్ణానికి చెందిన ఎస్సైని కాపాడి బీసీ బిడ్డ అయిన సీఐని బదిలీ చేశారని కవిత విమర్శించారు. పోస్ట్ మార్టం సహా అనేక అంశాలపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఇంత అన్యాయం జరిగితే సరిదిద్దుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం విచారకరమన్నారు. స్థానిక ఎమ్మెల్యే పద్మావతమ్మ ఏ గుడికి వెళ్లినా సరే నియోజకవర్గ ప్రజల పేరు మీదనే అర్ఛన చేయిస్తా అని చెబుతుంటారు. మరి కర్ల రాజేష్ మీ బిడ్డ లాంటి వ్యక్తి కాదా అని నేను ప్రశ్నించారు. అతని మరణం మిమ్మల్ని కలిచి వేయటం లేదా అని నిలదీశారు. మీ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఘటన జరిగితే మీరు కనీసం మాట్లాడకపోవటం ఏంటని ఎమ్మెల్యే పద్మావతిని ధ్వజమెత్తారు.
ఇలాంటి అనేక అట్రాసిటీస్ విషయాల్లో డీజీపీని కలుస్తామంటే కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వటం లేదని కవిత చెప్పారు. సూర్యాపేట జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందించాలని డిమాండ్ చేశారు.
నిండు ప్రాణం పోయినా సరే నాకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించటం సరికాదన్నారు. 2025 లో కూడా దళితులను చావకొట్టి నోరు మూస్తామంటే కుదిరే పనికాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కర్ల రాజేష్ విషయంలో ఏం జరిగిందో తెలియాలన్నారు. దీని మీద ఎంక్వైరీ వేయాలి. ఎస్సైని కచ్చితంగా సస్పెండ్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. అదే విధంగా జైలు అధికారులకు ఏం శిక్ష పడిందో తెలియాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే పద్మావతమ్మ కర్ల రాజేష్ కుటుంబాన్ని వెంటనే పరామర్శించాలని కోరారు.