Kalvakuntla Kavitha addressing Janambata public meeting in Tungaturthi

ప్రజలేమైనా ఓటింగ్ మెషీన్లా -కల్వకుంట్ల కవిత

విద్యా, వైద్యమే ప్రధానంగా పాలన సాగాలి | (తుంగతుర్తి)

ప్రజల అవసరాలు తీర్చాలన్న సోయి మరచి ప్రజలంటే ఓట్లు వేసే మెషీన్లుగానే నాయకులు భావించే పరిస్థితి వచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతి పోయి…కొత్త పంథా రావాలని కోరారు. జాగృతి జనంబాటలో భాగంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతన్ కల్ లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కృష్ణవేణి, సీనియర్ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కవిత మాట్లాడుతూ

అధికారం, పదవులు తప్ప జనం బాధలు పట్టించుకునే నాయకులే కరవయ్యారని చెప్పారు.

ప్రభుత్వ అలసత్వం

“జనం బాటలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలో  

చాలా చోట్ల పాడు పాడిన కాల్వలు దర్శనమిస్తున్నాయి. 

100 పడకల హాస్పిటల్, రుద్రమచెరువు బాగు చేస్తామని ఇచ్చిన మాటలు ప్రభుత్వాలు నిలబెట్టుకోలేదు. తుంగతుర్తిలో 100 పడకల హాస్పిటల్ ను 2018 నుంచి కడుతూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారాక మళ్లీ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో నాలుగేళ్లు, ఈ ప్రభుత్వంలో రెండేళ్లుగా హాస్పిటల్ కడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 30 పడకల హాస్పిటల్ కు మూడున్నర లక్షల మంది వస్తున్నారని ఇక్కడ సిబ్బంది చెబుతున్నారు. సరైన వసతలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ హాస్పిటల్ కు రావటం లేదు. దీంతో నెలకు ఇక్కడ రెండు డెలివరీలు మాత్రమే అవుతున్నాయి. 

తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ప్రైవేట్ కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. పేదలను ఆదుకోవల్సిన ప్రభుత్వాలు ఆలస్యం చేస్తున్నాయి. మనకు ప్రధానంగా కావాల్సింది విద్య, వైద్యమే కదా? హాస్పిటల్ నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతుందని ప్రశ్నిస్తే బిల్లులు రావటం లేదని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. విద్య, వైద్యం మీద కాకుండా ఈ ప్రభుత్వం దేని మీద ఖర్చు చేస్తుంది..?

పెన్షన్లు పెంచుతాం, ఫ్రీ కరెంట్, ఫ్రీ గ్యాస్, రైతు బంధు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇచ్చిన హామీల్లో ఏదీ నెరవేర్చలేదు. మనం పిడికిలెత్తి గట్టిగా నిలదీయకపోవటంతోనే ప్రభుత్వం హామీలు విస్మరిస్తోంది. 

ఇప్పుడు ఓట్లు లేవు. నేను ఓట్లు అడగటానికి కూడా రాలేదు. గత 10, 12 ఏళ్లుగా పెండింగులో ఉన్న పనులను ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి చేయిస్తున్నాం. “

Telangana Jagruthi Janambata meeting highlights public issues in Tungaturthi

హామీల అమలుకు పోరు

“సూర్యాపేట పేరులోనే సూర్యుడు ఉన్నాడు. 

మల్లు స్వరాజ్యం, బండి యాదగిరి, మారోజు వీరన్న లాంటి మహనీయులను కన్న జిల్లా ఇది. వాళ్ల స్ఫూర్తితో మేము ప్రజల కోసం పోరాటం చేస్తాం. సూర్యాపేట జిల్లాకు రాగానే నాలో ఎంతో స్ఫూర్తి వచ్చింది. మీ స్ఫూర్తిని తీసుకొని వెళ్తున్నా. ఇంతటి చైతన్యవంతమైన ప్రజలకు కూడా నాయకులు పనిచేయటం లేదు. సమాజంలోని అట్టడుగు వారి కోసం, మహిళలు, యువత కోసం జాగృతి పోరాడుతుంది. ఆడబిడ్డలంటే నాకు కొంచెం పక్షపాతం ఎక్కువ. వారికి విద్య, వైద్య సదుపాయాలు బాగుండాలని నేను కోరుకుంటా. అందుకే ప్రతి జిల్లాలో విద్య, వైద్య వసతులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నా. ముఖ్యంగా ప్రసూతి హాస్పిటల్ లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడుగుతున్నా. నాకు మీ దీవెనెలు కావాలి. మీ దీవెనెలు ఉంటే తెలంగాణ అంతా బాగున్నట్టే. తెలంగాణ కోసం ఉద్యమకారులు దుగ్యాల రవీందర్ రావు ఎంతో కొట్లాడారు. ఉద్యమ సమయంలో  12 వందల మంది అమరులయ్యారని బీఆర్ఎస్ చెప్పింది. కానీ వారందరికీ సాయం చేయలేదు. అమరుల కుటుంబాలకు కోటి సాయం అందే వరకు పోరాటం చేస్తాం. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇస్తామన్న 250 గజాల స్థలం, రూ. 25 వేల పెన్షన్ ఇవ్వాలి. 

ఆ భూమి ఇచ్చే వరకు ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమిని మేమే ఆక్రమించి ఉద్యమకారులకు పట్టా రాసి ఇస్తున్నాం.”