జాగృతి జనం బాటలో భాగంగా రెండు రోజుల కామారెడ్డి పర్యటనలో భాగంగా తేదీ 27-11-2025 న కామారెడ్డి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కవిత గారు పర్యటించారు. పలు ప్రాజెక్ట్ ల నిర్వాసితులను కలిశారు. వెల్ఫేర్ హాస్టల్ ను సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకన్నారు.

నాగమడుగు ఎత్తిపోతల ను కవిత గారు సందర్శించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
“జుక్కల్ నియోజకవర్గానికి సాగు నీరు ఇచ్చే వ్యవస్థ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ నిజాం సాగర్ ఉన్నప్పటికీ దాని ద్వారా జుక్కల్ కు ప్రయోజనం లేని పరిస్థితి. జుక్కల్ లో చెరువుల ద్వారా 22 వేల ఎకరాలు, కైలాస్ నాలా ద్వారా 9 వేల ఎకరాలు సాగు అవుతోంది. మహారాష్ట్ర తో పంచాయతీ కారణంగా లెండి ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి కాకుండా ఉంది.

జుక్కల్ లో 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని నాగమడుగు లిప్ట్ ప్లాన్ చేశారు. మంజీర నది నుంచి మనం నీటిని ఎత్తిపోసుకోవాలి. అందుకోసం దాదాపు 2 వందల ఎకరాలపై పైగా భూ సేకరణ అవసరం. అయితే పంప్ హౌస్ కు కావాల్సిన 12 ఎకరాలు మాత్రమే సేకరించారు. కరకట్ట, చెక్ డ్యామ్ కోసం 200 ఎకరాల భూ సేకరణ అవసరమైతే గుంట కూడా సేకరించలేదు. పైగా రాళ్లు అడ్డం పెట్టి నిర్మాణాలు మొదలు పెట్టారు. దీంతో ఇక్కడి మూడు గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. పైగా తమకు నీళ్లు రావని కూడా ఇక్కడి ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి వివరాలతో డీపీఆర్ ఉంచాలి. ఏయే గ్రామాలు ముంపునకు గురవుతాయో స్పష్టంగా చెప్పాల్సిన అవసరముంది. అంతకుముందు ఉన్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా డీపీఆర్ సిద్ధం చేయలేదు. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ పని చేయాలి.వడ్డెపల్లి పంప్ హౌస్ పనులను ఏళ్లుగా పెండింగ్ పెట్టారు. మా కార్యక్రమం ఉందని తెలిసి రెండు రోజుల క్రితమే క్లీన్ చేసి మోటార్లు ఆన్ చేశారు. అంతకుముందు పూర్తిగా పంప్ హౌస్ లను బంద్ పెట్టిన పరిస్థితి. పనుల పేరు చెప్పి హేవీ వెహికల్స్ వస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది రైతులు ప్రాజెక్ట్ కారణంగా అర, పావు ఎకరం భూమి కోల్పోతున్నారు. కలెక్టర్ గారు ఇక్కడకు వచ్చి రైతుల బాధను చూడాలి. వారికి ఏం నష్ట పరిహారం ఇస్తారో చెప్పాల్సి ఉంది. గతంలో ఎకరానికి రూ. 17 లక్షలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ధరలు పెరిగాయి. ఐతే ఎకరానికి ఎకరం ఇవ్వండి, లేదా ఎకరానికి రూ. 50 లక్షలు ఇవ్వాలని రైతులు అడుగుతున్నారు. దాదాపు రూ. 430 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కు ఇప్పటి వరకు మూడో వంతు నిధులు కూడా ఇవ్వలేదు. ఆగమాగం నిధులు కేటాయిస్తూ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారు. ఇలా అయితే ప్రాజెక్ట్ పూర్తి కావటానికి ఇంకా చాలా సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంది. ఈ సమస్యను మేము ఇక్కడితో వదిలిపెట్టం. కచ్చితంగా ఫాలో అప్ చేస్తాం. కలెక్టర్ గారిని, ఇరిగేషన్ అధికారులను కలిసి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. అవసరమైతే రైతులతో కలిసి ఇరిగేషన్ మంత్రి ముందు ఆందోళన చేస్తాం”. అని అన్నారు.

నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించిన నిజాం ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ నవాజ్ అలీ జంగ్ బహదూర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. అనంతరం నిజాం సాగర్ ప్రాజెక్ట్ సందర్శన.
“నిజాం సాగర్ ప్రాజెక్ట్ మన వారసత్వ సంపద. 1923 లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ వందేళ్లు పూర్తి చేసుకుంది.
జుక్కల్ లో ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ బాన్సువాడలో 60 వేల ఎకరాలు నీళ్లు ఇచ్చుకోగలుగుతున్నాం. మూడు కిలోమీటర్ల వరకు మూడు గేట్లతో చాలా బాగా నిజాం సాగర్ ను నిర్మించారు. ఐతే ఈ ప్రాజెక్ట్ లోని సగం కెపాసిటీకి సమానంగా మట్టి పేరుకుపోయింది. 1972 లో ఒకసారి రిపేర్ చేయించారు. దీంతో 30 టీఎంసీల కెపాసిటీ కి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ మట్టి పేరుకుపోవటంతో 11 టీఎంసీలు అయ్యింది. ఇప్పుడు 17 టీఎంసీల కెపాసిటీ ఉంది. దీంతో నీళ్లను స్టోర్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది. వర్షం ద్వారా వచ్చిన నీళ్లను వచ్చినట్లు గేట్లు ఎత్తి పంపించటం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కు ఎక్స్ టెన్షన్ గా అలీసాగర్ ప్రాజెక్ట్ ను కూడా నిర్మించుకున్నాం. ఒరిజినల్ గా 3 లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంది. కానీ అన్ని ఎకరాలకు నీళ్లు రావటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ లలో మట్టి పూడికను తీసే కార్యక్రమం పెట్టుకుంది. నిజాం సాగర్ లో కూడా పేరుకుపోయిన మట్టిని వెంటనే తీసేయించాలి. ఆ మట్టిని కమర్షియల్ గా కాకుండా రైతులకు ఇవ్వాలి. గ్రామాలను బలోపేతం చేయాలి. అది సాధ్యమైతదా కాదా అన్న డీపీఆర్ ను ప్రభుత్వం వెంటనే తయారు చేయాలి. మట్టి పేరుకుపోవటంతో ఎల్లారెడ్డిపేటలోని కొన్ని గ్రామాలు మునిగిపోతున్నాయి. మొన్నటి వర్షాలకు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ మెదక్ లో పాపన్న పేట వరకు వెళ్లిన పరిస్థితి.

బ్యాక్ వాటర్ కారణంగా దాదాపు 4 వేల ఎకరాల పంటల నష్టం జరిగింది. అయిన సరే ప్రభుత్వం కనీసం స్పందించటం లేదు. మన వారసత్వ సంపదను కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వెంటనే నిజాం సాగర్ లో మట్టి పూడికను తీయాలి. మోడ్రనైజేషన్ పనులు చేపట్టాలి. బ్యాక్ వాటర్ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి”. అని డిమాండ్ చేశారు.

బాన్సువాడ కొయ్యగుట్ట తండా రెసిడెన్షియల్ కాలేజీని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.

“స్కూల్, కాలేజ్ క్యాంపస్ చాలా బాగుంది. సెక్యూరిటీ, టీచర్లు కూడా బాగా పనిచేస్తున్నారని స్టూడెంట్స్ చెబుతున్నారు. ఐతే అన్ని మోడల్స్ స్కూళ్లలో ఉన్న సమస్యే ఉంది. టీచర్లే హాస్టల్ వార్డెన్స్ గా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి మారాలి. హాస్టల్ వార్డెన్స్ పనిని టీచర్లకు లేకుండా చేయాలి. ఇక కాస్మోటిక్ ఛార్జీలను ఇవ్వటం మానేశారు. వాటిని వెంటనే ఇవ్వాలి. బాలికలకు కల్పించాల్సిన వసతులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇక్కడ టీచర్లు చాలా ఇంట్రెస్ట్ గా పాఠాలు చెబుతున్నారు. క్యాంపస్ చాలా బాగుంది. ఇక్కడి ఈ ఒరవడి కొనసాగాలి. ఐతే ఆడబిడ్డలకు కచ్చితంగా ప్రభుత్వం కాస్మోటిక్ ఛార్జీలను చెల్లించాలి. చండూరులో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి గురించి పోలీసులతో మాట్లాడాం. స్కూల్ వాళ్లు సూసైడ్ అంటున్నారు. తల్లితండ్రులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సిన అవసరముంది. ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు 2 వందల మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. ఎక్కడో ఒక స్కూల్ లో మాత్రమే పరిస్థితులు బాగా ఉన్నాయి. మిగతా అన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి. వాటిని తీర్చే విధంగా ప్రభుత్వం పనిచేయాలని డిమాండ్ చేస్తున్నా”. అన్నారు.

ఎల్లారెడ్డి మండలం నాగిరెడ్డిపేట్ గ్రామంలో నిజాం సాగర్ ప్రాజెక్టు ముంపు రైతులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశం. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.
“కాంగ్రెస్ వాళ్లు రెండేళ్ల కింద నోటికి ఏదీ వస్తే అది చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇవ్వాళ మాత్రం కనబడకుండా పోయిన్రు. ఇక్కడ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు కనబడని పరిస్థితి. అధికారులకు చెప్పి పనులు చేయించాల్సిన ఎమ్మెల్యేనే లేకపోతే అధికారులు కూడా పనిచేస్తలేరు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ నీళ్ల కారణంగా నాగిరెడ్డి పల్లి మండలంలోని చాలా గ్రామాల్లో వేల ఎకరాలు మునిగిపోయాయి. ఆరు వేల ఎకరాలు, ఏడు వేల ఎకరాల అని అంటున్నారు. అసలు లెక్క ఎంత అన్నది కూడా రాసుకునే పరిస్థితి లేదు. అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకుంటే వాళ్లు కూడా పనిచేసే పరిస్థితి లేదు. వెంటనే ఎంత నష్టం జరిగిందో లెక్క తీసి రైతులకు పరిహారం ఇవ్వాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా. లేదంటే రైతులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తాం.
రైతుల తప్పు వల్ల పంటలు నష్టపోలేదు. ప్రకృతి వల్ల జరిగింది. కనుక ప్రభుత్వమే రైతులకు అండగా ఉండి వారిని ఆదుకోవాలి. ఒక్కో ఎకరాకు కనీసం రూ. 25 వేలు ఇవ్వాలి. రైతుల సమస్య తీరే వరకు వదిలేది లేదు. నేను మొండి దాన్ని. బతుకమ్మ, బోనం ఎత్తుకుంటే దించిందే లేదు. అలాగే ప్రజల సమస్యలను కూడా పరిష్కారమయ్యే వరకు వదిలేది లేదు. వానలు, గాలికి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు పాడయ్యాయి. వాటికి కూడా పట్టించుకోవటం లేదు. మార్పు తెస్తామని చెప్పి వీళ్లు పాత చీకటి రోజులను తెచ్చారు. మళ్లీ కొంతమంది రైతులు కలిసి వాళ్లే రిపేర్ చేసుకునే పరిస్థితి తెచ్చారు. ఐకేపీ సెంటర్లలో వడ్లు కొనకుండా ఇబ్బంది పెడుతున్నారు. దొడ్డు, సన్న రకం వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు వడ్లు కూడా కొంటలేరు. కాంగ్రెస్ వి బోనస్ ఇచ్చే మాటలు కాదు. బోగస్ మాటలు.
వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నాగిరెడ్డి పేట్ మండలంలో 3 వేల ఎకరాల వరకు పాస్ పట్టాలు ఇవ్వాల్సి ఉంది. ఈ సమస్యపై పూర్తి వివరాలు తీసుకొని పరిష్కారమయ్యే వరకు కొట్లాడుతా.
ఇక ఇక్కడ పత్తి ఎక్కువగా పండుతుంది. కానీ సీసీఐ వాళ్లు కొనటం లేదు. సమస్య లేకుండా జిన్నింగ్ మిల్లు ఏర్పాటు కు ప్రభుత్వం చొరవ చూపాలి. ఫ్రీ బస్సు కారణంగా ఆటో అన్నలకు ఇబ్బంది అవుతోంది.
వారికి ఇస్తామన్న రూ. 12 వేలు వెంటనే ఇవ్వాలి. అదే విధంగా ఇన్సూరెన్స్ కట్టాలి. ఆటో వెల్ఫేర్ బోర్డు తెస్తామన్నారు. దానిని కూడా ఏర్పాటు చేయాలి. ఆడబిడ్డలందరికీ ఇళ్లు ఉంటే చాలని ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి ఉన్న ఇళ్లు కూలగొడుతున్నారు. అదొక విచిత్ర పరిస్థితి తెచ్చారు. ఈ ప్రభుత్వం కూడా విచిత్రంగా ఉంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇచ్చే డబ్బులు మొత్తం ఒకేసారి ఇవ్వాలి. పీఎఫ్ కార్డు లేకపోయినా సరే బీడీలు చేసే వారికి పెన్షన్ ఇస్తామన్నారు. అన్ని రకాల పెన్షన్లను 2 వేల నుంచి 4 వేలు చేయాలి. 18 ఏళ్లు దాటినా ఆడబిడ్డలకు రూ.2500 లు ఇవ్వాలి. దీనికోసం పంతం పట్టినట్లుగా పోరాటం చేస్తాం. ఇప్పటికే సోనియమ్మకు లక్షల లేఖలు రాసినప్పటికీ ఉలుకు, పలుకు లేదు. సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్ లో లేని వాళ్లకు కూడా ఇందిరమ్మ చీరలు ఇవ్వాలి. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు.
కానీ ఆడబిడ్డలందరికీ కనీసం చీరలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మహిళలందరికీ చీరలు ఇవ్వాల్సిందే.
ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ పోదాం. ఒకేేసారి అన్ని సమస్యలు తీరవు.
కానీ గట్టిగా కొట్లాడితే కచ్చితంగా సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి”. అని అన్నారు.
జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత గారికి ఘన స్వాగతం పలికిన జాగృతి శ్రేణులు, ప్రజలు.