వనపర్తిలో జాగృతి జనం బాట రెండో రోజు | Jagruthi Janam Bata Wanaparthy – Day 2 Highlights

వనపర్తి జిల్లా లో జాగృతి జనం బాటలో భాగంగా తేదీ 24-11-2025 న వనపర్తి జిల్లాలో రెండో రోజు పర్యటించారు. ఉదయం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజ్ ను సందర్శించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. రెండు రోజుల పర్యటనలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రస్తావించారు. ఆ తర్వాత ఏదుల రిజర్వాయర్ ను సందర్శించారు. 

పాలిటెక్నిక్ కాలేజ్ సందర్శన

వనపర్తి పాలిటెక్నిక్ కాలేజ్ ను సందర్శించి .. విద్యార్థులతో మాట్లాడిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. చారిత్రక వనపర్తి ప్యాలెస్ లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ భవనం అధ్వానంగా మారడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఆందోళన. 

వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్

రెండు రోజుల వనపర్తి పర్యటనలో తమ దృష్టికి వచ్చిన సమస్యలపై కవిత గారి ప్రెస్ మీట్. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమాలపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ కీలక కామెంట్స్. 

కవిత గారి కామెంట్స్

“ఇక్కడి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి కారణంగా బీఆర్ఎస్ కోలుకోని విధంగా దెబ్బతింటోంది. ఆయన బీసీలపై అరాచకం సృష్టించారు. వాళ్లపై కేసులు పెట్టి రక్తాలు వచ్చేలా కొట్టారు. మూడు, మూడు సార్లు 32 మంది బీసీల పై అన్యాయంగా కేసులు పెట్టించారు. నిరంజన్ రెడ్డి గారు మూడు, మూడు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారు. కష్టజీతంతో కట్టుకుంటే సరే. కానీ వీటిలో అసైన్డ్ భూములు ఉన్నాయి. కృష్ణా నది కాల్వనే ఆ భూముల్లో ఉందని చెబుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయటం లేదు? ఈ విషయం కేసీఆర్ గారి తెలియదా? హరీష్ రావు గారు తన మనిషి అని కేసీఆర్ గారికి తెలియకుండా చేస్తున్నారా? నిరంజన్ గారి అరాచకాలు ఘోరతి ఘోరంగా ఉన్నాయని చిన్నపిల్లాడిని అడిగిన చెబుతున్నారు. ఇలాంటి వ్యక్తి నాపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. 

మా తండ్రి వయసు ఉన్న వారని ఇప్పటి గౌరవిస్తున్నా. మీరు ఎమ్మార్వో ఆఫీస్ తగలబెట్టారు. కేసీఆర్ గారికి అది తెలిసినా ఊరుకుంటే మాత్రం అది తప్పే. నిరంజన్ రెడ్డి గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేసిపోతుంది.

వ్యవసాయ శాఖ మంత్రి కేసీఆర్ గారు అవకాశం ఇస్తే ప్రజల రక్తం తాగుతారా? ఎదుల రిజర్వాయర్ కూడా మీరు పూర్తి చేయలేదు. కానీ మీకు మీరే నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారు. జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. పాత వాటికే కనెక్ట్ చేసి నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకోవటం సరికాదు. పెబ్లేరు సంత చాలా ఫేమస్. అక్కడ 32 ఎకరాలను నిరంజన్ రెడ్డి మనుషులు కబ్జా పెట్టి అమ్ముకోవాలని చూస్తున్నారంట. 

దేవుడి గుళ్లనైనా అవినీతి నుంచి వదిలేయాలని హెచ్చరిస్తున్నా. కబ్జా కోరులకు పెద్ద నాయకులు సపోర్ట్ చేయవద్దని కోరుతున్నా. వనపర్తి, పెబ్బేరు ఎక్కడైనా కబ్జాలేనా? నిరంజన్ రెడ్డి గారి భూదాహానికి అంతులేదా?

ఇలాంటి వ్యక్తులను ఏ పార్టీ కూడా ఎంకరేజ్ చేయవద్దని కోరుతున్నా. ఇలాగే ఉండే బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో బతికి బట్టకట్టదు. ఇంకా ఎక్కువ మెజార్టీతో ప్రజలు ఓడిస్తారు. హరీష్ రావు మనిషి కాబట్టే నిరంజన్ రెడ్డిపై సీఎం చర్యలు తీసుకోవటం లేదు. ఇలా అవినీతిని ఎంకరేజ్ చేస్తే తెలంగాణ బాగుపడతదా? నేను చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. అద్దాల మేడల్లో ఉన్నోళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే వారికే నష్టం. మీ అరాచకాలు కేసీఆర్ గారి తెలియవని అనుకుంటున్నా. అందుకే మీడియా ద్వారా చెబుతున్నా. 

ఇలాంటి వాళ్లను ప్రజల మీదకు రుద్దటం అన్యాయం.  సంస్కృతిక సంపద కు మారుపేరు వనపర్తి జిల్లా. 

వందల ఏళ్ల ఘన చరిత్ర ఈ జిల్లాకు ఉంది. సాహు మహారాజ్ స్ఫూర్తి తో విద్యాసంస్థల్లో అప్పట్లోనే రిజర్వేషన్లు ఇచ్చారు. రైతుల కోసం నీళ్లు ప్రాజెక్టులను అప్పట్లోనే పాలకులు ఏర్పాటు చేశారు. వనపర్తి ప్రజలంటేనే ఆత్మగౌరవానికి ప్రతీక అని మేము హైదరాబాద్ లో అనుకుంటాం. అలాంటి జిల్లాలో చాలా సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు. ఎంతో మంది ఉద్యమకారులు తన ఆవేదనను నాకు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మహేష్ అనే యువకుడు ఏర్పాటు చేశారు. ఏ నాయకుడైనా సరే ఇప్పుడు ఆ విగ్రహాం వద్దకు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. అలా ఉద్యమంలో వనపర్తి జిల్లా ప్రజలు ముందున్నారు. 

కానీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనం అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు.కొత్త కోట మండలంలో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు చేనేత కార్మికుల కోసం బిక్షాటన చేసి వారిని ఆదుకున్నారు. రాష్ట్రం వచ్చాక వారికి కొంత చేసుకున్నాం. కేసీఆర్ గారు చేనేతలకు వారితో పాటు ఇద్దరు సహాయకులకు ఆర్థిక సాయం అందించారు. కానీ కాంగ్రెస్ రాగానే అందులో ఒకరికి ఆర్థిక సాయాన్ని ఆపేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో 8, 891 మంది చేనేత కార్మికులు సాయం కోసం జులైలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా సాయం చేయలేదు. చేనేత కార్మికులకు పెండింగ్ బకాయిలు పదికోట్లు ఉన్నాయి. వాటిని విడుదల చేయాలి. వారికి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. 

వెంటనే ఆ లక్ష రూపాయలను మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. చేనేత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కనాయ్ పల్లి శంకర సముద్రం ప్రాజెక్ట్ నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా ఉంది. 

20 ఏళ్లుగా వారి గురించి అన్ని పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. 10 ఏళ్ల కింద నేను కూడా ఇక్కడ వచ్చి బతుకమ్మ ఆడాను. ఆ ప్రాంతమంతా ఇప్పుడు మునిగిపోయింది. తెలంగాణ వచ్చాక కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. 

తెలంగాణ తెచ్చుకున్నదే బీమా, నెట్టంపాడు, కల్వకుర్తి లాంటి ప్రాజెక్ట్ లు పూర్తి చేయటానికి. కానీ ఇప్పుడు వరకు అది జరగలేదు. 2004, 2005 లోనే ఇక్కడ ప్రజల భూములు తీసుకున్నారు. వారికి ఆర్ అండ్ ఆర్ కాలనీ కట్టించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.పైగా ఇష్టమున్నట్లు గేట్లు ఎత్తటంతో సగం ఊళ్లోకి నీళ్లు వస్తున్న పరిస్థితి ఉంది. ఇంటి నిండా పాములతో చాలా దారుణమైన స్థితిలో ప్రజలు ఉన్నారు. అదే విధంగా 18 నిండిన వాళ్లు 450 మంది ఉన్నారు. వారికి కూడా పరిహారం ఇవ్వాలి. గతంలో 30 నుంచి 35 మంది పేర్లను రాయటం మర్చిపోయారు. వారికి న్యాయం చేయాలి. అప్పుడు ఊళ్లో లేని మరో వంద మంది వరకు ఉన్నారు. వారికి కూడా సాయం చేయాలి. గతంలో కొంతమంది గ్రామస్తులకు ఇచ్చిన భూమిని కూడా రాజకీయ నాయకులు కబ్జా పెట్టారంట. వాళ్ల భూమి కాపాడి వారందరికీ మేలు చేయాలి. అదే విధంగా మల్లన్న సాగర్, మిడ్ మానేరు నిర్వాసితులకు కట్టిచ్చినట్లుగానే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాలి. శంకర సముద్రం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తే మరో 40 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ ప్రాంతానికి చెందిన నాయకుడు రావుల చంద్రశేఖర్ రావు గారు మంచి మనిషి. అవినీతి మరక లేని వారు. ఆయన కేసీఆర్ గారికి ఈ విషయాన్ని చెప్పి ప్రజలకు న్యాయం చేయాల్సింది. 

ఇప్పటికైనా ఈ అంశంలో ఇక్కడి ప్రజల తరఫున ముందుండి పోరాడాలని కోరుతున్నా. భూమాతా ద్వారా రైతుల తలరాత మారుతుందని ప్రభుత్వం చెప్పింది. కానీ ఎవరి తలరాత మారలేదు. పైగా 4 ఎకరాలున్న ఓ రైతుకు గవర్నమెంట్ జాబ్ ఉందని పడింది. దీంతో ఆయన ప్రభుత్వ పథకాలు అందటం లేదు. కనీసం ఆయన రికార్డ్ ను సరిచేయండి. కడకుంట్లలో పెద్ద చెరువు నీళ్లు వెనక్కి తన్నటంతో రైతులు చాలా నష్టపోయారు. వారందరికీ ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. అధికారుల తప్పు కారణంగానే భూములు మునిగిపోయాయి. 

కనుక ప్రభుత్వం కచ్చితంగా ఆ రైతులకు నష్టపరిహారం అందిచాలని కోరుతున్నా. మదర్ అండ్ హాస్పిటల్ లో డాక్టర్లు, సిబ్బంది కెపాసిటీకి మించి పనిచేస్తున్నారు. చాలా తక్కువ మంది డాక్టర్లు ఉన్నారు. రేడియాలజీలో పర్మినెంట్ స్టాఫ్ లేదు. డయాగ్నిసిస్ సెంటర్ లో మెషీన్లను ఎలుకలు కోరికాయంట. ఏ పొలిటికల్ ఎలుకలో అవి. 

టెస్టుల లేకపోవటంతో మహాబూబ్ నగర్ కు వెళ్లాల్సి వస్తుంది. దీంతో డిలే అవుతోంది. ప్రజలు ప్రైవేట్ కు వెళ్లి ఇబ్బంది పడుతున్నారు. మేము ఎక్కడికి వెళ్లిన సరే హాస్పిటల్స్ పరిస్థితిపై దృష్టి పెడుతున్నాం. ముఖ్యంగా శానిటేషన్, కేర్ టేకర్స్, సెక్యురిటీ వాళ్లకు మూడు నెలలుగా జీతాలు రావటం లేదు. వెంటనే వారికి జీతాలు ఇవ్వాలని సీఎం గారిని డిమాండ్ చేస్తున్నా. వనపర్తి జిల్లాలో నాలుగున్నర లక్షల టన్నుల ధాన్యం పండుతుందని అంచనా వేశారు.మూడన్నర లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం 1000 కి పైగా కొనుగోలు కేంద్రాలు కావాలి. కానీ 330 మాత్రమే పెట్టారు. టార్గెట్ లో 10శాతం కూడా కొనుగోలు చేయలేదు. రైతులకు బోనస్ ఎగ్గొటేందుకే కొనుగోలు ఆలస్యం చేస్తున్నారు. రైతుల అలసి పోయి ప్రైవేట్ కు అమ్ముకునేలా చేస్తున్నారు. 

17 శాతం తేమ ఉన్న సరే కొనుగోలు చేయాలని సీఎం గారు చెబుతున్నారు. కానీ అసలు ఆ నిర్ణయాన్నే అధికారులు పట్టించుకోవటం లేదు. రైతుల సమస్య పై ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇక పాతపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కంప్లీట్ చేయటం లేదు. కాంట్రాక్టర్ సమస్య అంటున్నారు. అదే విధంగా ఇంటికి 80 వేలు లంచం అడుగుతున్నారు. అక్కడ మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. కలెక్టర్ గారు వీలైనంత త్వరగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వారికి అందజేయాలి. పెబ్బేరులో రోడ్లు బాగాలేవు. అక్కడ రోడ్ వైండింగ్ లో ల్యాండ్ పోయిన వారికి చిన్న ఫ్లాట్ ఇస్తున్నారు. వారి భూమికి ఎంత వాల్యు ఉందో అంత ఇవ్వాలి. వనపర్తి లో మార్కెట్ సంబంధించి కబ్జాలు చేస్తున్నట్లు తెలిసింది. అదే విధంగా జర్నలిస్టుకు ఇచ్చిన ఇళ్లను కూడా రద్దు చేశారంట. నిజామాబాద్ లో కూడా ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇచ్చిన ఇళ్లకు ఇంకా అవసరమైతే ఎక్కువ ఇవ్వాలి. అంతే కానీ ఇచ్చిన వాటిని తీసుకోవద్దు. జర్నలిస్టులతో పెట్టుకున్న వాడు బాగుపడినట్లు చరిత్రలో లేదు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలి. సీఎం మాట్లాడితే పాలమూరు పులిబిడ్డను అని చెప్పుకుంటారు.మరో 10 వేల కోట్లు ఖర్చు చేస్తే నాలుగున్నర లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. నార్లపూర్ రిజర్వాయర్ ను పూర్తి చేయాలని సీఎం గారిని కోరుతున్నా. అచ్చంపేట లో పుట్టిన వనపర్తి లో చదివిన కొడంగల్ లో గెలిచిన అని సీఎం అంటారు. నిజంగా మహబూబ్ నగర్ జిల్లాపై ప్రేమ ఉంటే వారికి మంచి చేయాలి. అచ్చంపేటలో తులం బంగారం, వనపర్తిలో స్కూటీలు, కొడంగల్ లో మహిళలకు రూ. 2500 ఇవ్వాలి. వనపర్తి పాలిటెక్నిక్ కాలేజ్ కు రూ. 23 కోట్లు వస్తే క్యాన్సల్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా లాస్ట్ ఇయర్ లో నిధులు విడుదల చేసింది. వాటిని ముఖ్యమంత్రి గారు రద్దు చేశారు. అవసరమైతే వంద కోట్లు కేటాయించాలి. కానీ విడుదలైన నిధులను రద్దు చేయటం అన్యాయం.దాదాపు 850 మంది విద్యార్థులు కాలేజ్ లో ఉన్నారు. వారికి కనీసం హాస్టల్ కూడా లేదు. కక్షపూరిత రాజకీయాల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కాలేజ్ లో స్టాఫ్ లేదు. పాములు తిరుగుతుండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి 13 వరకు కాలేజ్ ను బాగు చేయాలి. లేదంటే జాగృతి తరఫున వచ్చి మేమే బాగుచేస్తాం. సీఎం గారు కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేస్తాం అంటారు. ఆడబిడ్డలకు 36 లక్షలతో బస్సు కొనిస్తామని చెబుతున్నారు.ఆ బస్సు ద్వారా నెలకు రూ. 69 వేలు వస్తుంది. దాంట్లో 19 వేలు ఖర్చులకే పోతాయి. వచ్చే రూ. 50 వేలతో మండలంలో ఉన్న వేలాది మందిలో ఒకరికి లోన్ ఇస్తారు. అదే విధంగా జిల్లా సమాఖ్య ద్వారా పెట్రోల్ పంపు పెట్టిస్తామంటున్నారు. ఆ ఆదాయం లక్ష రూపాయలు వస్తుంది. లక్ష రూపాయలతో జిల్లాలో ఉన్న మహిళలకు ఎంత మందికి లోన్ ఇస్తారు? 50 వేలు, లక్ష రూపాయల లోన్ తో మహిళలు కోటిశ్వరులు అవుతారా? ఇంకా మహిళలను మోసం చేసే మాటలను మానుకోవాలి. 

వారికి నాలుగు లక్షల వరకు ఫండ్ ఇవ్వాలి. రెండు లక్షలు లోన్ ఇవ్వాలి. మహిళలు వ్యాపారం చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని సీఎం చెప్పేదంతా ట్రాష్, మోసం. 

ఇకనైనా మసిపూసి మారేడు కాయ చేయటాన్ని మానేయండి. మహిళ పేరుతో లోన్లు తెచ్చి వారి శ్రమను వాడుకోవాలని చూస్తున్నారు. మీ గురువు గారి మాదిరిగా ప్రపంచ బ్యాంక్ కు తెలంగాణ మహిళల శ్రమను కుదవ పెట్టవద్దు. తెలంగాణ మహిళలకు ఇచ్చే చీరలకు ఇందిరమ్మ పేరు పెట్టారు. ఇందిరమ్మను ప్రసన్నం చేసుకోవటమే ఆయనకు కావాలి. తెలంగాణ సెంటిమెంట్ తో ఉద్యమంతో ఆయనకు సంబంధం లేదు. బతుకమ్మ చీరలను ఇందిరమ్మ జయంతి నుంచి సోనియమ్మ పుట్టిన రోజు వరకు ఇస్తామంటున్నారు. అసలు వాళ్లకు తెలంగాణతో ఏం సంబంధం?మరో రెండు రోజులు అయితే ఎన్నికల కోడ్ రానుంది. ఈ లోపే చీరలు పంచాలంటూ వీఏఓ లపై ఒత్తిడి తెస్తున్నారు. పైగా సెల్ఫ్  హెల్ఫ్ గ్రూప్ ల మహిళలకే చీరలు ఇస్తున్నారు. మీరిచ్చే రూ. 150 చీరను కూడా అందరికీ ఇవ్వరా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆడబిడ్డలందరికీ చీరలు ఇచ్చారు. ఆధార్ కార్డు ఉంటే చాలు చీరలు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి మహిళకు చీరలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నా”. అని అన్నారు. 

ఏదుల రిజర్వాయర్ సందర్శన

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రెండో రిజర్వాయర్ ఏదుల ను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు.