ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా 03-11-2025 మొదటి రోజున జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు ప్రాంతాలను పరిశీలించారు. ప్రజా సమస్యలు, రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పత్తి రైతుల సమస్యకు సంబంధించి కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. చనఖా, కొరటా ప్రాజెక్ట్ ను పరిశీలించి ప్రాజెక్ట్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.బేల జైనాథ్ మండలాల మధ్యలో తరుణి బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.




ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ చేరుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ సంప్రదాయం ఉట్టి పడేలా ఆమెకు స్వాగతం పలికారు.




పత్తి రైతుల కొనుగోలు యార్డ్ ను జాగృతి అధ్యక్షురాలు పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి రైతులు తమ సమస్యలను చెప్పారు. వారికి ప్రభుత్వం మేలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. కలెక్టర్ తోనూ మాట్లాడి తేమ శాతం ఎక్కువ ఉన్న సరే కొనుగోలు చేయాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా పత్తి రైతుకు మేలు చేయాలని డిమాండ్ చేశారు.

“కలెక్టర్ గారు నేను కల్వకుంట్ల కవిత ఎక్స్ ఎమ్మెల్సీని. పత్తి కొనుగోలు చేసేందుకు 12 శాతం తేమ ఉండాలని అంటున్నారంట. మొంథా తుపాన్ వర్షాల కారణంగా 25 శాతం తేమ వచ్చింది. ఇక్కడి పరిస్థితిని మీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయండి. ప్రైవేట్ వాళ్లకు అమ్ముకోవటం కారణంగా పత్తి రైతులకు ఒక్క బండికి రూ. 50 వేలు నష్టం వస్తుంది. తేమశాతం పెంచే ఆర్డర్ ను మీరు ఇవ్వలేరా? సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారా? అన్ని జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. మీరు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారా? ఈ పరిధిలో ఉన్నంత వరకు పత్తి రైతులకు మేలు చేయండి. ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ వచ్చే వరకు కనీసం కొనుగోళ్లు ఆపేయండి? మమ్మల్నే కేంద్ర టెక్స్ టైల్ మంత్రితో మాట్లాడమంటరా? మీరు ఏమీ చేయలేరా?
కనీసం రెండు రోజుల పాటు మార్కెట్ ను షట్ డౌన్ చేయండి. అది కూడా చేయలేరా? పత్తి రైతులు రాగానే తేమశాతం తీసుకుంటున్నారు. అలా కాకుండా పత్తి ఆరబెట్టుకునే సమయం రైతులకు ఇవ్వండి.
కేంద్రంతో మాట్లాడి పత్తి రైతులకు మేలు చేసే ప్రయత్నం మేమే చేస్తాం”. అన్నారు.
పత్తి యార్డ్ ను జాగృతి అధ్యక్షురాలు కవిత పరిశీలించారు. పత్తి రైతుల బాధ చూస్తే కడుపు తరుక్కుపోతోందన్నారు. 12 శాతం కన్నా ఎక్కువ తేమ ఉన్న సరే పత్తి కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక్క బండికి రైతులు రూ. 50 వేలు నష్టపోతున్నారు.
“జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చాం. ఇక్కడి పత్తి మార్కెట్ యార్డ్ లో పత్తి రైతుల పరిస్థితి చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. .వానలు పడుతుండటంతో పత్తి రైతు నష్టపోతున్నాడు. పత్తి కి తేమ ను పీల్చుకునే గుణం ఉంటుంది. అందుకే ఎక్కువ తేమ శాతం ఉన్న కొనుగోలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి ఎక్కడ పండిన సరే పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్రంలోని అన్ని చోట్ల పత్తి రైతు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఆవేదనతో ఉన్నాడు. మార్కెట్ కు పత్తి తీసుకొస్తే 12 శాతం తేమ ఉంటేనే సీసీఐ కొనుగోలు చేస్తామని చెబుతోంది. అసలు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి, ఎంపీ, ఎమ్మెల్యేలకు మొంథా తుపాను వచ్చిన విషయం తెలియదా? ఆదిలాబాద్ లో ఎంపీ, ఎమ్మెల్యే కూడా బీజేపీ వారే ఉన్నారు. వారికి పత్తి రైతును ఆదుకునే బాధ్యత లేదా? పత్తి తేమ శాతం ఎక్కువ ఉన్న సరే కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాయాల్సిన అవసరం లేదా? ఈ విషయంలో మేము కలెక్టర్ గారితో మాట్లాడితే సీసీఐ తో మాట్లాడాలని చెబుతారు. 12 నుంచి 20 శాతం తేమ ఉన్న సరే కొనుగోలు చేయండి అంటే రాష్ట్రం ప్రభుత్వం తో మాట్లాడమంటారు. అంటే కేంద్రంలో అధికారంలోకి ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు రైతులంటే లెక్కలేదా? ఐతే బీఆర్ఎస్, లేదంటే జాగృతి లాంటి సంస్థలే రైతుల గురించి మాట్లాడాలా? వరంగల్ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ వాళ్లే రైతులకు మేలు చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు కదా? ఆదిలాబాద్ పత్తి మార్కెట్ లో రైతులను చూస్తుంటే కళ్లలో నీళ్లు వస్తున్నాయి. కడుపు తరుక్కు పోతుంది. ఒక్కో బండికి రైతుకు 50 వేల నష్టం తో ప్రైవేట్ వాళ్లకు పత్తి అమ్ముకుంటున్నారు.
ముఖ్యమంత్రి గారు ముందు జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రచారాన్ని పక్కన పెట్టండి. అక్కడ ఏ పార్టీ గెలిచిన ఒరిగేదీ ఏమీ లేదు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి పై సీఎం వెంటనే సమీక్ష చేయాలని డిమాండ్ చేస్తున్నా. 20 నుంచి 25 శాతం తేమ ఉన్నా సరే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం తరఫున చెప్పండి. ఒక్క పత్తి రైతు మాత్రమే కాదు మక్కా, సోయ, వరి రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తేమ, బూజు, మొలకలు వచ్చిన సరే కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే రూల్ కావాలె. ఏ ప్రభుత్వం ఉన్న సరే ఎలాంటి కండిషన్స్ లేకుండా కొనుగోలు చేయాలి. తెలంగాణ మీకు పదవులు రావటానికి తెచ్చుకోలే. రైతులు బాగుండాలని తెచ్చుకున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు బీజేపీ పక్ష నేత కూడా. ఆయన ప్రధానికి, కేంద్రమంత్రి కి మాట్లాడి పత్తి రైతులకు మేలు చేయాలి. 20 నుంచి 25 శాతం తేమ ఉన్న సరే రైతుల పక్షాన నిలబడాలని డిమాండ్ చేస్తున్నా బీజేపీ నేతలు కనీసం ఒళ్లు నొప్పించుకుంటలేరు. యూరియ టైమ్ కు రాదు. అయిన సరే రైతుల పరిస్థితిని వాళ్లు పట్టించుకుంట లేరు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్లు మాట్లాడితే కేంద్రం ఒప్పుకోదా? రైతుల కోసం బీజేపీ నేతలు ఒళ్లు నొప్పించుకొని పని చేయాలి. ఈ సమస్య కొత్తది కాదు. తుపాను వచ్చిన సంగతి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులకు తెలియదా? ఒక్కసారి రైతుల వద్దకు వస్తే గానీ మీకు వాళ్ల బాధ అర్థం కాదు.
మార్కెట్ యార్డ్ లో హామీలుగా ఉన్న 70 మంది ఆడబిడ్డలను తొలగించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
ఏడీ గారితో మాట్లాడితే ప్రస్తుతానికి దాన్ని ఆపారు. వారి పొట్ట కొట్టవద్దని కలెక్టర్ గారిని కోరుతున్నా. వారిని పనిలో కొనసాగించాలి”. అన్నారు.
చనాకా కొరటా ప్రాజెక్ట్ ను కల్వకుంట్ల కవిత పరిశీలించారు. 90 శాతం పూర్తైన ఈ ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ చేసిన ప్రాజెక్ట్ అని పక్కన పెడుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.









“మనం ఇప్పుడు కొరాటా గ్రామంలో మనం ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలోని రైతులకు 50 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ఈ ప్రాజెక్ట్ కడతామని నాలుగు దశాబ్దాలు కాలయాపన చేశారు. కాంగ్రెస్, టీడీపీ లు ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పి ఓట్లు దండుకున్నాయి. కానీ బీఆర్ఎస్ వచ్చాక చనఖా, కొరాటా ప్రాజెక్ట్ ను 90 శాతం పూర్తి చేసుకున్నాం. ఈ ప్రాజెక్ట్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. కాంగ్రెస్ రైతుల విషయంలో చిత్తశుద్ధితో ఉండి ఉంటే కనీసం ఏటా 10 వేల ఎకరాలకైనా నీళ్లు వచ్చేవి.
ప్రాజెక్ట్ కు సంబంధించి గతేడాది 72 కోట్లు, ఈ ఏడాది రూ. 179 కోట్లు బడ్జెట్ లో పెట్టారు. కానీ ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. బడ్జెట్ లో పెట్టి రైతులను మభ్య పెట్టటం దేనికని అడుగుతున్నా?
90 శాతం పూర్తైన ప్రాజెక్ట్ ను మరో పది శాతం పూర్తి చేయలేరా? ప్రాజెక్ట్ కోసం తీసిన కాల్వల్లో ఓవర్ ఫ్లో అయి పంటలు పాడవుతున్న పరిస్థితి ఉంది. కొరటా గ్రామంలో నిర్వాసితులు 213 మంది ఉన్నారు. వాళ్లకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రయత్నం వచ్చాక కనీసం వాళ్లకు పరిహారం ఇచ్చే పని కూడా చేయలే.
మహారాష్ట్ర వైపు ఉన్న చనాఖా గ్రామంలో 1500 ఎకరాల భూ సేకరణ మిగిలి ఉంది. ఇక్కడ ఉన్నది బీజేపీ ఎమ్మెల్యే, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఆయన ఎందుకు అక్కడి ప్రభుత్వాన్ని ఒప్పించి భూ సేకరణ చేయించటం లేదు. మహారాష్ట్ర వైపు రిటైనింగ్ వాల్ కట్టారు. మన వైపు కూడా కట్టాలని రైతులు కోరుతున్నారు.
ఇది రాజకీయాలు చేయాల్సిన అంశం కాదు. పార్టీలకు అతీతంగా రైతులకు మేలు చేయాల్సిన అవసరముంది.
అసలే రైతులు ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ఇబ్బందుల కారణంగా నష్టపోతున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యానికి నిరనసగా ఇక్కడే మేము వంటలు చేసుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో వంట వార్పు కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ కు నిరసన తెలిపినట్టే…ఇప్పుడు నిరసన తెలుపుతున్నాం. ప్రాణహిత- చెవేళ్ల రీ డిజైన్ చేసుకున్నందుకే ఆదిలాబాద్ కు నీళ్ల కోసం చనఖా-కొరటా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. ఇందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వమే రూ. 2 వేల కోట్లు మంజూరు చేసింది. బీఆర్ఎస్ లో ప్రభుత్వంలో జరిగిన మంచిని మంచి…చెడును చెడు అని చెబుతా. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏనుగు ఎల్లింది. తోక చిక్కింది. వీళ్లు బడ్జెట్ లో పెట్టిన రూ. 179 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్ట్ పూర్తవుతుంది. అది కూడా చేయకుండా కాంగ్రెస్ మహాపాపానికి ఒడిగట్టింది.
దీనిపై బీజేపీ వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదు. ఈ జిల్లాలో పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ పక్ష నేత కూడా రాష్ట్రంలో అన్ని అంశాలపై మాట్లాడాల్సిన ఆయన ఎందుకు ఈ ప్రాజెక్ట్ కోసం మాట్లాడటం లేదు.
పత్తి రైతుల సమస్యలపై, చనాకా కొరటా ప్రాజెక్ట్ పై ఆయన మౌనం దేనికి? అసలు ఈ ప్రాజెక్ట్ వద్దకు పాయల్ శంకర్ గారు ఎందుకు రాలేదు? ఆయన ఇక్కడికి వచ్చి రైతుల కోసం మాట్లాడాలి. ప్రాణహిత- చెవేళ్ల రీడిజైన్ కారణంగానే ఆదిలాబాద్ లో పలు ప్రాజెక్ట్ లు డిజైన్ చేసుకున్నాం. అందులో భాగంగానే 90 శాతం పూర్తైన ప్రాజెక్ట్ ను 10 శాతం కంప్లీట్ చేస్తలేరు. అంటే ఇది రైతులకు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయం. గతంలో ప్రాణహిత-చెవేళ్లను కాంగ్రెస్ పార్టీ ఏటీఎం గా వాడుకుంది. కాల్వలకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి ఆంధ్రా కాంట్రాక్టర్ల జేబులు నింపింది.
తెలంగాణ వచ్చాక ప్రాజెక్ట్ రీ డిజైన్ చేసుకున్నాం. తుమ్మడి హెట్టి వద్ద ప్రాజెక్ట్ సరికాదు అని నిపుణులతో మాట్లాడితే చెప్పారు. అందుకే తుమ్మిడి హెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్ట్ ను మార్చటం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ తుమ్మిడి హెట్టి వద్ద కడతామని చెబుతోంది. రెండేళ్లు అయిన సరే ఎందుకు కట్టలేదు.
బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్ట్ అని దాన్ని పూర్తి చేయకపోవటమంటే రైతులకు అన్యాయం చేసినట్లే”. అన్నారు.
చనఖా – కొరాటా బ్యారేజ్ సమీపం లో పత్తి తీస్తున్న మహిళలతో కవిత గారు మాటా మంతీ నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పత్తి ఏరుతున్న మహిళలతో కలిసి పత్తి తీశారు.
జైనాథ్ , బేల మండలాల మధ్య గల తరుణం బ్రిడ్జి పరిశీలన
జాగృతి జనంబాట లో జైనాథ్ , బేల మండలాల మధ్య గల తరుణం బ్రిడ్జిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల పరిశీలించారు. తరుణం బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
“మనం బేల జైనాథ్ మండలాల మధ్యలో ఉన్నాం. ఇక్కడ బ్రిడ్జి కోసం స్థానిక ప్రజలు ఫైట్ చేస్తే గానీ రూ. 4 కోట్లతో చిన్న బ్రిడ్జి కట్టారు. ముందు రోడ్ కట్టి తర్వాత బ్రిడ్జి కడుతారు. కానీ ఇక్కడ అటు, ఇటు రోడ్ వేసి చిన్న బ్రిడ్జి కట్టారు. పాత బ్రిడ్జి ని కూడా కూలగొట్టారు. దీంతో టూవీలర్స్ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాలు, వరదలకు ఇక్కడ పలు సందర్భాల్లో లారీలు కొట్టుకుపోయాయి. ఇక్కడున్న తరుణం బ్రిడ్జి కట్టకపోతే మహారాష్ట్రతో కూడా కనెక్టివిటీ పోయే పరిస్థితి ఉంది. రెండు మండలాల్లోని వందలాది గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సమస్య తీరాలంటే ప్రభుత్వం వెంటనే తరుణం బ్రిడ్జిని పూర్తి చేయాలి. స్థానికంగా ఎంపీ, ఎమ్మెల్యే కూడా ఈ సమస్యను పట్టించుకోవాలె. తరుణం బ్రిడ్జి పూర్తయ్యే వరకు జాగృతి కార్యకర్తలు కూడా ప్రభుత్వం పై పోరాటం చేస్తారు”. అన్నారు.
ఆదిలాబాద్ లో తమకు పట్టాలివ్వలాంటూ ఆందోళన చేపట్టిన ఆదివాసీ తెగల కుటుంబాల ఆందోళనకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంఘీభావం తెలిపారు. వారికి పట్టాలిచ్చే వరకు ప్రభుత్వంపై పోరాడుతానని హామీ ఇచ్చారు.
“ఇక్కడి కొమ్రం భీమ్ కాలనీలో వివిధ ఆదివాసీ తెగలకు చెందిన వెయ్యి కుటుంబాలు ఉన్నాయి. వారికి అన్యాయం జరుగుతోంది. ఇక్కడే కాదు దేశ వ్యాప్తంగా ఆదివాసీలకు అన్యాయం జరుగుతోంది. ఆదివాసీలను అడవుల నుంచి పంపించి బడా పారిశ్రామిక వేత్తలకు సహజ వనరులను కట్టబెడుతున్నారు. ఇటువంటి అన్యాయాలను మా లాంటి వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ కట్టేందుకు కొండా రెడ్డి అనే తెగను అడవి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అప్పుడు జాగృతి తరఫున సుప్రీంకోర్టులో మేమే కేసు వేశాం.
దాదాపు పదేళ్లు కొండా రెడ్లను కాపాడుకున్నాం. రాష్ట్రం విడిపోవటంతో ఆ అంశం మన చేతుల్లో లేకుండా పోయింది. ఇప్పటికీ ఆదివాసీలకు లిపి లేదు. చాలా తెగల వారికి బయటకు వచ్చి ఉద్యోగం, వ్యాపారం చేసే పరిస్థితి లేదు. వారందరికీ మేలు చేయాలంటే వారి తరఫున పోరాటం చేయాల్సిన అవసరముంది. అందుకే జాగృతి లో ప్రత్యేకంగా ఆదివాసీ విభాగాన్ని పెట్టుకున్నాం. ఆదిలాబాద్ అంటేనే అడవి బిడ్డల జిల్లా. ఇక్కడ ఆదివాసీల సమస్యలు చాలా ఉంటాయి. ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలో ఈ వెయ్యి కుటుంబాల సమస్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఏదైనా సమస్యను జాగృతి పట్టుకుందంటే అది పరిష్కారం అయ్యే వరకు వదలదు. ఇక్కడ ఉన్నవాళ్లకు ఆధార్, రేషన్ కార్డులు ఇచ్చినట్లు చెబుతున్నారు. అంటే సంస్థలు గుర్తిస్తున్నాయి. కానీ పట్టాలు మాత్రం ఇవ్వటం లేదు.
అందుకే గవర్నర్ గారి అపాయింట్ మెంట్ తీసుకొని ఆయనను కలుద్దాం. పట్టా చేయించుకుందాం.
ఇక్కడ భూముల్లో కొంత ప్రైవేట్ వాళ్ల భూములు ఉన్నాయని అంటున్నారు. దాని పరిష్కారం కోసం ప్రభుత్వం మనల్ని చర్చలకు పిలవాలి కదా? రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న సరే ప్రభుత్వ పథకాలు ఇవ్వటం లేదు.
అంటే ఇక్కడి ఆదివాసీలను ప్రభుత్వం గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తుంది. అందుకే నేను మీ కోసం పోరాటం చేస్తా. మీ అడుగులో అడుగునై నడుస్తా. గవర్నర్ గారిని అపాయింట్ మెంట్ ముందు తీసుకుందాం. ఆ తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమం చేద్దాం. హైదరాబాద్ వేదికగా మేము మీ గొంతుకగా మారి పోరాటం చేస్తాం.
నేను మాటలు చెప్పే మనిషి కాదు. చేతల్లో చూపే మనిషి . నేను మీకు మాటిస్తున్నా. నూటికి వెయ్యి శాతం మీకోసం ఒక తల్లిలాగా పోరాటం చేస్తా. ఆదివాసీల రక్షణ కోసం మనమందరం ఐక్యంగా పోరాడుదాం.” అన్నారు.
ప్రముఖ విద్యావేత్త, గోండు భాషలో మహాభారతం, రామాయణం రచించిన తొడాసం కైలాష్ గారి నివాసంలో ఆదివాసీ ప్రముఖులతో కలిసి సోమవారం రాత్రి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహపంక్తి భోజనం చేశారు.
జాగృతి జనంబాటలో భాగంగా సోమవారం రాత్రి తొడసం కైలాష్ గారి నివాసంలో రాత్రి బస చేశారు.