జాగృతి జనం బాట రంగారెడ్డి జిల్లా | Jagruthi Janam Bata Ranga Reddy District Full Highlights

జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు రంగారెడ్డి జిల్లాలో రెండు రోజులు నవంబర్ 20, 21 వ తేదీల్లో పర్యటించారు.  ఈ సందర్భంగా జిల్లాలోని చాలా ప్రజా సమస్యలను వారి దగ్గరకే వెళ్లి అడిగి తెలుసుకున్నారు. ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులు, ఏరో స్పేస్ భూ నిర్వాసితులతో మాట్లాడారు. జిల్లాలోని లైబ్రరీ, హాస్పిటల్ ను సందర్శించారు. పలు బస్తీల్లో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న చెరువుల కబ్జాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. రెండు రోజుల పాటు రంగారెడ్డి జిల్లాలో తెలుసుకున్న సమస్యలకు పరిష్కారం వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.  

దళిత యువకుడి కస్టోడియల్ డెత్ పై ఆగ్రహం

“దళిత యువకుడి కస్టోడియాల్ మరణానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సుర్యాపేటలో నిన్ను కర్ల రాజేశ్ అనే యువకుడి కస్టోడియల్ డెత్ జరిగింది. దళిత బిడ్డను పోలీసులు నిర్దాక్ష్యణంగా కొట్టి చంపారు. పైగా పోలీసుల మీద చర్యలు లేకుండా ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వెంటనే ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నారు. ఏమైందో తేటతెల్లం చేయాలని కోరుతున్నా. దళితుల మీద జరుగుతున్న దాడులపై ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆ కుటుంబాన్ని భయబ్రాంతులకు గురి చేయవద్దని డిమాండ్ చేస్తున్నా.అలాగే వికారాబాద్ జిల్లాలో హత్యానేరం ఒప్పుకోవాలని పోలీసులు యువకుడిని చిత్రహింసలకు గురి చేస్తే ఆ యువకుడు ఆస్పత్రి పాలయ్యాడు.. రాష్ట్రంలో సామాన్యులపై పోలీసుల దురాగతాలు ఎంతగా పెరిగిపోతున్నాయో చెప్పడానికి ఇవి మచ్చుకుమాత్రమే” అని అన్నారు. 

 కవిత గారికి ఘన స్వాగతం

జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించేందుకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి ఘన స్వాగతం పలికిన తెలంగాణ జాగృతి నాయకులు. ” సే నో డ్రగ్స్” క్యాంపెయిన్ లో భాగంగా విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న జాగృతి అధ్యక్షురాలు. 

కవిత గారి కామెంట్స్

“జాగృతి జనం బాటలో భాగంగా రంగారెడ్డి  జిల్లాలో పర్యటిస్తున్నాం. శేరిలింగంపల్లి నుంచి మా పర్యటనను మొదలు పెట్టాం. శేరిలింగంపల్లి నియోజకవర్గం చాలా పెద్దది. కానీ ఇక్కడ పేదలు, పేద బస్తీలు చాలా ఉన్నాయి. ఆ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. 

2014 లో ఇక్కడ 64 చెరువులు ఉంటే అనేక చెరువులు కబ్జా అయ్యాయి. ఈ విషయాన్ని హైదరాబాద్, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఒక పక్క తెలంగాణకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు పోయాయి. పేదల కష్టాలు ఏ మాత్రం తీరలేదు. వారికి ఫెసిలిటీస్ పెరగలేదు. ట్రాఫిక్ కష్టాలు పెరిగాయి. అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ సెటిలైన వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇవ్వాళ యువమిత్రులతో కలిసి నో టు డ్రగ్స్ అనే కార్యక్రమం చేపట్టాం. 

మత్తుకు బానిసైన యువత ను ఆ ఊబి నుంచి ఏలా బయటకు తేవాలన్న దానిపై జాగృతి కృషి చేస్తుంది.” అని అన్నారు. 

మియాపూర్ లోని పీఏ నగర్ బస్తీలో పర్యటన

మియాపూర్ లోని పీఏ నగర్ బస్తీలో కవిత గారు పర్యటించారు. బస్తీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

కవిత గారి కామెంట్స్

“బీజేపీ వాళ్లకు వాళ్ల మీద వీళ్ల మీద కేసులు పెట్టటం తప్ప ఇంకో పని లేదు. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదు. ప్రజలకు మొఖం చూపించలేక ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారు. చట్టం, న్యాయం మీద మాకు నమ్మకం ఉంది. కచ్చితంగా రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. అందులో నంబర్ వన్ బాధితురాలిని నేను. ఇప్పుడు ఇంకా ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతారంట. శేరిలింగంపల్లి నియోజకవర్గం దేశంలోనే రిచ్ నియోజకవర్గం అంటారు. పెద్ద పెద్ద బంగ్లాలు, విల్లాలు, కంపెనీలు, ధనవంతులు ఇక్కడ ఉన్నారు. అదే సమయంలో దీపం కిందనే నీడ ఉన్నట్లు ఇక్కడ పేదలు, పేద బస్తీలు ఉన్నాయి. వారిని పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. 

ఫ్రీ కరెంట్, గ్యాస్, మహిళలకు రూ. 2500, ఆరు గ్యారంటీలు అని హామీ ఇచ్చారు. కానీ వాటిని పట్టించుకోవటం లేదు. వాటిని అమలు చేయటం మీ వల్ల కాదు. కనీసం ఈ బస్తీలో రోడ్లు, నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. స్థానికులు వెళ్లి అడిగితే మున్సిపల్ అధికారులు లీడర్లు చెప్పాలని అంటున్నారంట. మున్సిపల్ అధికారులు బస్తీ వాసులకు కనీస పనులు చేయకపోతే ఎట్ల?ప్రజలను మభ్య పెట్టటం మానేసి వారికి మంచి చేసే పని చేయాలి. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఇవ్వటం లేదు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిస్థితి పైన పటారం, లోన లోటారం అన్న చందంగా ఉంది. ఇక్కడి స్మశానం నుంచి పాములు ఇళ్లల్లోని వస్తున్న పరిస్థితి ఉంది. చెత్త తీసుకెళ్లటానికి కూడా డబ్బులు అడుగుతున్నారంట. ముఖ్యమంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ గారు ఇక్కడి సమస్యలను పట్టించుకోవాలి. ఈ బస్తీ వాసులకు జాగృతి అండగా ఉంటుంది. వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారి కోసం పనిచేస్తాం”. అని భరోసా ఇచ్చారు.

బస్తీ వాసులతో సమావేశం

జలాల్ బాబా నగర్, భూపాల్ నగర్ బస్తీ వాసులతో సమావేశం అయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. ఇంటి స్థలాలకు పట్టాలు, సహా వారి సమస్యలు అడిగి తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు. 

కవిత గారి కామెంట్స్

“జనంబాట లో భాగంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన పరిష్కారం కాని సమస్యలు ఉన్న చోటికి వెళ్తున్నాం. వాటిని ప్రభుత్వాల దృష్టికి తెచ్చి ఆ సమస్యల పరిష్కారానికి సర్కార్ పై ఒత్తిడి తెస్తాం. ఇవ్వాళ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ డివిజన్, భూపాల్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ 45 ఏళ్లుగా 25 ఎకరాల్లో 2 వేల కుటుంబాల వాళ్లు ఇళ్లు కట్టుకొని ఉంటున్నారు. 

అనేక పార్టీలు అధికారంలోకి వచ్చాక పట్టాలిస్తామని చెప్పాయి. కానీ ఆ పని మాత్రం జరగలేదు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీల వాళ్లు కూడా సమస్య పరిష్కారం కావాలని అంటున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పని మాత్రం జరగలేదు. ఇప్పుడున్న ల్యాండ్ కు డబుల్ ల్యాండ్ ను ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కు ప్రభుత్వం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఇక్కడి వాసులకు పట్టాలు మంజూరయ్యే అవకాశం ఉంది. 

ఆ పని వెంటనే చేట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇక్కడి ప్రజల సమస్య తీరాలంటే ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి. జాగృతి ఆ పని చేస్తోంది. ఇక్కడి ప్రజలందరికీ పట్టాలు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం.” అని హెచ్చరించారు. 

మొకిల లోని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయ వార్షికోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు

షాబాద్ లో బీసీల దీక్షకు మద్దతు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు 

కవిత గారి కామెంట్స్

“షాబాద్ బీసీ రిజర్వేషన్ సాధన సమితిని చూస్తే ఆనందంగా ఉంది. 40 రోజులుగా కుల, మతాలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ఉద్యమాభినందనలు. షాబాద్ ఉద్యమ స్ఫూర్తి చూస్తుంటే నాకు తెలంగాణ ఉద్యమం గుర్తుకు వస్తోంది. బీసీలకు రిజర్వేషన్లు, రాజ్యాధికారం సాధించటమంటే తెలంగాణ సాధించిన దానికన్నా కష్టం. అందుకని మనం బలంగా, స్ట్రాటజికల్ గా, ఓపిక, ధైర్యంతో పోరాటం సాగించాలి. 

బీసీలలో ఐక్యత లేదని మనల్ని విడగొట్టేందుకు అంటుంటారు. కానీ బీసీలు అవసరమైన ప్రతిసారీ కూడా ఐక్యత చూపించారు. బీసీల్లో ఐక్యతకు సంబంధించి ఎలాంటి రందీ లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకులాల్లో పేదలు, పార్టీల్లోని నాయకులతో మనకు ఐక్యత కావాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెల్లగా రిజర్వేషన్లు తీసేస్తున్నారు. గవర్నమెంట్ కంపెనీలను అమ్ముకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్ల పద్దతే పోతోంది. అలాంటప్పుడు కచ్చితంగా వారి రిజర్వేషన్ల కోసం బీసీలు మాట్లాడాల్సి ఉంటుంది. 

ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పోతున్నప్పుడు మనం మాట్లాడటం లేదు. ఒకరికి అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకోవద్దు. బీసీల రిజర్వేషన్లు రాష్ట్రంలో కాదు. ఢిల్లీలో జరగాల్సిన యుద్ధం. కనుక మనమంతా ఐక్యత సాధించి…ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరముంది. షాబాద్ లో కనిపించినంత ఐక్యత నాకు బీసీ ఉద్యమంలో ఎప్పుడు కనిపించలేదు.మేము జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మేమే అందరినీ ఆహ్వానించాం. కానీ షాబాద్ వాళ్లు మాత్రం మమ్మల్ని ఆహ్వానించారు. బీసీ రిజర్వేషన్ల కోసం చిరంజీవులు, విశారదన్ గారు ఒక పక్క, మరో వైపు ఆర్. కృష్ణయ్య గారు పోరాటం చేస్తున్నారు. బీసీ ల కోసం ఎన్ని సంఘాలు వస్తే అన్ని సంఘాలను మనం స్వాగతించాలి. తెలంగాణ ఉద్యమంలో మనం వందలాది సంఘాలను ఏర్పాటు చేయటంతోనే ఒత్తిడి పెరిగింది. 2024 జనవరిలో మేము పూలే గారి విగ్రహాం అసెంబ్లీ లో పెట్టాలని డిమాండ్ చేశాం. 

కానీ ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై విగ్రహాం పెడతామని అంగీకరించింది. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అంబేడ్కర్ గారి విగ్రహాం అసెంబ్లీలో ఉండాలని నేను పోరాటం చేసి సాధించాను. అదే విధంగా సాయిత్రి భాయ్ ఫూలే గారి జన్మదినాన్ని మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని పోరాటానికి పిలుపునిచ్చాం. 

దీంతో ప్రభుత్వం మేము పిలుపునిచ్చిన ఒకరోజు ముందే ప్రకటించింది. అంటే మనం గట్టిగా అడిగితే గట్టిగా కదులుతారు. మెల్లగా అడిగితే మెల్లగా కదులుతారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని గట్టిగా అడగాల్సిన అవసరముంది.

ఈ ఉద్యమంలో మనం ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పింది. బీసీల కోసం ఒక బిల్లు పెడతామని చెప్పింది. కానీ జాగృతి తరఫున మేమే మొత్తం మూడు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశాం. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల కోసం బిల్లులు పెట్టాలని కోరాం. అయితే విద్య, ఉద్యోగాల కోసం ఒకటి, రాజకీయాల కోసం ఇంకో బిల్లు పెట్టారు. ఇప్పుడు మనందరం రాజకీయానికి సంబంధించిన బిల్లు గురించే మాట్లాడుతున్నాం. విద్య, ఉద్యోగాల బిల్లు కోసం కూడా మాట్లాడాల్సిన అవసరముంది. 

విద్యార్థులను ఏకం చేసి బిల్లుకోసం పోరాటం చేసే దిశగా మనందరం ముందుకు రావాలి. ఇక కాంగ్రెస్ తెచ్చిన బిల్లులు పాసై ప్రెసిడెంట్ దగ్గర ఉన్నాయి. మన సీఎం గారు ఇన్ని సార్లు ఢిల్లీకి వెళ్లారు. ఒక్కసారి కూడా ప్రధానితో బీసీ బిల్లు గురించి మాట్లాడలేదు. అదే విధంగా బీసీ బిల్లు కచ్చితంగా పాస్ కావాల్సిందేనని రైలు రోకో చేస్తామని మేము హెచ్చరించాం. దీంతో ఆర్డినెన్స్ చేసి గవర్నర్ దగ్గరకు పంపారు. బిల్లులు లేమో ప్రెసిడెంట్ గారి దగ్గర, ఆర్డినెన్స్ గవర్నర్ గారి దగ్గర ఉన్నాయి. పాస్ చేయించాల్సిన పార్టీలు కూడా మొన్న బంద్ లో పాల్గొన్నాయి.

అది నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి. తెలంగాణ ఉద్యమ సమయంలో మనం అధికారంలో ఉన్న వారిపై కొట్లాడం. కానీ బీసీ బిల్లు విషయంలో అధికారంలో ఉన్న వారే ఆందోళనలో పాల్గొన్నారు. ఆర్. కృష్ణయ్య, చిరంజీవులు గారు చేసే పోరాటంలో మనం పాల్గొందాం. ఎట్టి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లు సాధించుకునే వరకు వదలొద్దు. నేను బతుకమ్మ ఎత్తుకున్న, బోనాలు ఎత్తుకున్న సరే పట్టు వదల లేదు. బీసీ బిల్లు విషయంలో కూడా నా శక్తి ఉన్నంత వరకు కొట్లాడుతా. వదిలేదే లేదు. బీసీ బిల్లు కోసం ఢిల్లీకి పోయినప్పుడు షాబాద్ వాళ్లు అందరూ రావాలి. అసలు కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్లు అని ఎందుకు మాట్లాడింది. మనం  42 శాతం కన్నా ఎక్కువ ఉన్నాం. అసలు ఆ ఫార్ములా ఎలా వచ్చింది? సరే ముందు 42 శాతమైనా సరే అన్న ఉద్దేశంతో మనం ఒప్పుకున్నాం. పార్టీలు రిజర్వేషన్లు ఇవ్వకపోతే వేరే కులాల నుంచి పోటీ చేసే వారిని ఓడిద్దామన్న నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువ మంది బీసీలు పోటీలో నిలబడాలని అంటున్నారు. అది మంచి నిర్ణయమే. కానీ వేరే వాళ్లను ఓడించటం కన్నా కూడా మనం గెలవాలని పోటీ చేయాలి. ఎక్కువ మంది బీసీలు పోటీ చేయటం కన్నా కూడా ఒక్కరినే నిలబెట్టి గెలిపించుకోవాలి. కచ్చితంగా మనమంతా ఐక్యంగా, బలంగా పనిచేస్తే బీసీ రిజర్వేషన్లు సాధించుకోవచ్చు. షాబాద్ నుంచి మంచి స్ఫూర్తితో నేను వెళ్తున్నా. జాగృతి ఇంకా పార్టీగా మారలేదు. పార్టీగా లేకపోయినా నా కమిట్ మెంట్ కొనసాగుతుంది. నాలుగేళ్ల క్రితం మహిళ బిల్లు కోసం ఢిల్లీలో పోరాటం చేసినప్పుడే తర్వాత బీసీ ల కోసం పోరాటం చేస్తానని చెప్పాను. అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నాను. ఇప్పుడు ఆ పార్టీలో లేను. బీఆర్ఎస్ లో లేకపోయినా సరే నా కమిట్ మెంట్ మాత్రం అలాగే ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అనేది మొదటి స్టెప్ మాత్రమే. బీసీలకు చట్టసభల్లో రాజ్యాంగ పరమైన హక్కులు రావాలి. బీసీలు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలి. అందుకు కచ్చితంగా రాజ్యాంగ పరమైన హక్కు మనకు రావాలి. తెలంగాణ ఉద్యమం మనకు గట్టి, మొండి పట్టు పట్టాలని నేర్పింది. ఆ మొండి పట్టుతో చేసే పోరాటంలో జాగృతి అందరికీ అండగా ఉంటుంది” అని తెలిపారు.

ప్రభుత్వాస్పత్రి సందర్శన 

షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.

ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. 

“షాద్ నగర్ హాస్పిటల్ లో జరిగిన కొన్ని సంఘటనలు గతంలో విన్నాం. దీంతో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవటానికి వచ్చాం. హాస్పిటల్ కు సంబంధించి వంద పడకల కొత్త భవనం పూర్తైందన్నారు. 

అక్కడకు హాస్పిటల్ ను వెంటనే షిప్ట్ చేయాలి. ఈ పాత బిల్డింగ్ లో పెచ్చులు ఊడిపోతున్నాయి. వర్షం వస్తే అంతట ఊడుస్తోంది. 28 మంది స్టాఫ్ నర్సులు ఉండాల్సిన చోట 12 మంది మాత్రమే ఉన్నారు. గైనకాలజి డాక్టర్లు ఆరుగురు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ గత నెలలో 101 డెలివరీలు చేశారు. అరకొర వసతులు, తక్కువ స్టాఫ్ తో కూడా సేవలు చేస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు. హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది పై ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకోవాలి. ఈ హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లంత కూడా పేదవాళ్లే. వాళ్లను ప్రేమతో ట్రీట్ చేయాలి. శానిటేషన్, కేర్ టేకర్స్ సిబ్బంది అంత కూడా ఔట్ సోర్సింగ్ వాళ్లే. వాళ్లకు మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారు. 

హాస్పిటల్ డెవలప్ మెంట్ ఫండ్ కూడా రావటం లేదు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్ల ద్వారా వచ్చిన డబ్బులనే డాక్టర్లు రొటేట్ చేసుకుంటున్నారు. డిపార్ట్ మెంట్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి హాస్పిటల్ ను డెవలప్ చేయాలి. కొత్తగా కట్టిన భవనంలోకి వెంటనే హాస్పిటల్ ను షిప్ట్ చేయాలి. అదే విధంగా స్టాప్ నర్సులు, స్టాఫ్ ను పెంచాల్సిన అవసరముంది. గత ప్రభుత్వమిచ్చిన నెలకు వెయ్యి రూపాయలు, కేసీఆర్ కిట్లు ఇవ్వటం లేదు. 

ప్రభుత్వాస్పత్రి అంటే అదేదో మనం ప్రజలకు వేసే బిక్ష కాదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ హాస్పిటల్ ఉంది. ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా. ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హాస్పిటల్ ను అభివృద్ధి చేయాలి.” అని డిమాండ్ చేశారు.

ట్రిపుల్ ఆర్ నిర్వాసితులతో సమావేశం

షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలో ట్రిపుల్ ఆర్ నిర్వాసితులతో సమావేశం అయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. భూములు కోల్పోతున్న రైతులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ. 

కవిత గారి కామెంట్స్

“ఈ గ్రామ ప్రజల బాధల్ని చూస్తే గుండె చెరువు అవుతోంది. దాదాపు 200 మంది రైతుల ఎకర, అర ఎకర భూములు పోతున్నాయి. పెద్ద వాళ్ల భూములు కాపాడేందుకు, పేద వాళ్ల భూములను లాక్కుంటున్నారు. ఆ పెద్దవాళ్లు ఎవరు? వాళ్ల పేర్లు ఏంటీ అన్న సంగతి తర్వాత చూద్దాం. రీజినల్ రింగ్ రోడ్ నీరు కట్ట పాములా చాలా వంకర్లు తిరిగింది. 

అన్ని దిక్కుల ఒకే విధమైన పద్దతి లేదు. ఘట్ కేసర్ లా ఒకలా ఉంటే…ఇక్కడ మరో విధంగా ఉంది. ఎవడి అభివృద్ధి కోసం ఇలాంటి పద్దతులు పెడుతున్నారు. తప్పకుండా దీని గురించి మనం ప్రశ్నించాల్సిందే. 

రీజినల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులకు కనీస మేలు జరగటం లేదు. నాలుగుసార్లు మార్పులు జరిగాయంటే కచ్చితంగా ఏదో జరుగుతోంది. దీనిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని కలుద్దాం. ఆయన చాలా మంచి మనిషి. ఆయన అపాయింట్ మెంట్ తీసుకొని అన్ని విషయాలు చెబుదాం. రీజినల్ రింగ్ రోడ్ కు సంబంధించి మళ్లీ రీ సర్వే చేయాలని అడుగుదాం. మెదక్ లో ఒకలా, మహబూబ్ నగర్ లో ఒకలా, ఇక్కడ ఒకలా ఉంది. అందరికీ ఒకే విధమైన పద్దతి ఉండాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. అందుకే అవసరమైతే ప్రధాని మోడీని కలుద్దాం. ఇక్కడ ఎంపీ గారిని కూడా కలిసి అడుగుదాం. రైతులకు అన్యాయం చేసే వాళ్లు ఎంత పెద్దోళ్లైనా సరే వారిపై కొట్లాడుదాం. గ్రామ ప్రజల బాధ ఒక్క తీరుగా లేదు. ఆడబిడ్డల కళ్లలో సంతోషం చూడాలి. కానీ గ్రామ ప్రజలంతా దుఖంలో ఉన్నారు. తెలంగాణ చాలా గట్టిది. రైతులు ఎవరు ఏడ్వొద్దు.  పిడికిలి బిగించి కొట్లాడుదాం. చిట్యాల ఐలమ్మ తన భూమి దగ్గరకు వస్తే రాజులనే తరిమికొట్టింది. అందరికీ సమన్యాయం కావాలి. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. మీ సమస్య విషయంలో పార్టీలకతీకంగా అందరూ ఒక్కతాటిపైకి రావటం సంతోషం. ఇది భూమితో పాటు మన ఆత్మగౌరవ సమస్య రైతులు ఏమాత్రం బాధపడవద్దు. పోరాటానికి సిద్ధం కావాలి. మీ సోదరిగా కచ్చితంగా మీకు అండగా నేను ఉంటాను.” అని భరోసా ఇచ్చారు. 

రంగారెడ్డి జిల్లాలో రెండు రోజు పర్యటనలో బిజీబిజీ

మహేశ్వరంలో జాగృతి కార్యాలయం ప్రారంభం

కందుకూరులో తెలంగాణ జాగృతి కార్యాలయం ప్రారంభించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. 

కవిత గారి కామెంట్స్

“జనంబాట లో భాగంగా రెండు రోజులు రంగారెడ్డి జిల్లా పర్యటిస్తున్నాం. మహేశ్వరం, ఎల్ బీ నగర్, ఇబ్రహీం పట్నంలోని సమస్యలను ఇవ్వాళ తెలుసుకుంటాం. ప్రజలకు ఉన్న అనేక సమస్యలు వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై స్థానికులు, మేధావులతో చర్చిస్తున్నాం. నిన్న శేరిలింగంపల్లి నుంచి రాజేంద్ర నగర్, చేవెళ్ల, షాద్ నగర్ లో ఉన్న సమస్యలు తెలుసుకున్నాం. మహేశ్వరంలో పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో  సత్యనారాయణ గారు జాగృతి ఆఫీస్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గ స్థాయిలో గతంలో ఉన్న ఆఫీస్ లు కాకుండా ఇది తొలి అడుగు. మహేశ్వరంలో జాగృతి కార్యాలయం ద్వారా ప్రజలకు మంచి జరగాలి. మహేశ్వరం అంటేనే లక్కీ అనే పేరు ఉంది. జాగృతి కి కూడా శుభం జరగాలి.మహేశ్వరంలో గతంలో ఉద్యమంలో పనిచేసిన జాగృతి కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున చేరుతూ జాగృతిని మరింత బలోపేతం చేయాలని కోరుతున్నా.” అని అన్నారు. 

యాదయ్య విగ్రహానికి నివాళి

కందుకూరు తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదయ్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు

ఏరోస్పేస్ పార్క్ నిర్వాసితులతో సమావేశం

ఇబ్రహీంపట్నం  లోని ఎలిమినేడు ఏరోస్పేస్ పార్క్ నిర్వాసితులతో సమావేశం అయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. నిర్వాసితులను సమస్యలు అడిగి తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు

కవిత గారి కామెంట్స్

“ఎలిమినేడు గ్రామంలో ఏరో స్పేస్ పరిశ్రమలో రైతుల భూములు పోతున్నాయి. మనకు సమస్య వచ్చినప్పుడు చెప్పుకుంటేనే ఆ సమస్య తీరుతుంది. కానీ అన్నలు భయపడి రాలేదు. అక్కలు మాత్రం వచ్చారు. ప్యూచర్ లో వాళ్లు కూడా వస్తారు. ఎవరు వచ్చినా, రాకపోయినా మీ తరఫున కొట్లాడుతాం. భూములు పోయిన వారికి సరైన న్యాయం చేయాలి. అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని డబ్బులు ఇస్తే అవి ఎటు గాకుండా పోయాయి. భూమి కోల్పోతున్న వాళ్లకు కచ్చితంగా న్యాయం చేయాలి. అదే విధంగా భూమి లేని వారికి ఇంటికో ఉద్యోగం ఇచ్చి న్యాయం చేయాలి. ఇక రంగారెడ్డి జిల్లాలో సమస్యలను తెలుసుకుంటూ పర్యటన సాగిస్తున్నాం. ఎక్కడ చూసిన మహిళలకు అనేక సమస్యలున్నాయి. హాస్పిటల్స్ లో సూది ఉంటే దూది లేదు. దూది ఉంటే సూది లేదు. 

ఈ ప్రభుత్వం మహిళలకు రూ. 2500, పెన్షన్ రూ. 4 వేలు చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకు వాటి ఊసే ఎత్తటం లేదు. మనం గట్టిగా అడిగితే ఇస్తారు. తెలంగాణ జాగృతి 20 ఏళ్లుగా మన పద్దతులు, సంస్కృతి కాపాడేందుకు పని చేస్తోంది. జనం బాటలో భాగంగా మొండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఎలిమినేడు గ్రామస్తుల సమస్యలు పరిష్కరించేందుకు  నేను ఫైట్ చేస్తా. బతుకమ్మలు, బోనాలతో నాకు స్వాగతం పలికిన మహిళలకు ధన్యవాదాలు” అని అన్నారు. 

రంగారెడ్డి జిల్లా పర్యటన పై కవిత గారి ప్రెస్ మీట్

కవిత గారి కామెంట్స్

“తెలంగాణ జాగృతి దాదాపు 20 ఏళ్లుగా ప్రజల మధ్య ఉంది. ప్రజల ఆశయాలు, అకాంక్షలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పనిచేస్తూ వస్తోంది.  ఉద్యమ సమయంలోనూ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రజల కోసం పోరాటం చేసింది.  తెలంగాణ ఉద్యమం అట్టుడుకుతున్న సమయంలో మన సంస్కృతి, పండుగలు కాపాడేందుకు పోరాటం చేశాం. బతుకమ్మ, బోనాలు ఎత్తుకొని ఆత్మగౌరవ బావుటా ఎగరవేసినం. ఈ క్రమంలో ఎన్నో అటుపోట్లు ఎదురయ్యాయి. అయిన సరే పోరాటాన్ని వదల లేదు. అసెంబ్లీలో అంబేడ్కర్ విగ్రహాం కోసం మూడు రోజులు దీక్ష చేసిన ఏకైక సంస్థ జాగృతి సంస్థ. ఉమ్మడి రాష్ట్రంలోనే బతుకమ్మ పండుగకు రాష్ట్ర పండుగ హోదా సాధించిన సంస్థ. శ్రీ కృష్ణ కమిటీ ముందు మన సంస్కృతిని ఎలా అణగదొక్కుతున్నారో ఆధారాలతో సహా వివరించాం. మిలియన్ మార్చ్, సాగరహారం సహా అన్ని కార్యక్రమాల్లో జాగృతి ముందుంది. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలని చాలా ఆలోచన చేశాం. ముఖ్యంగా మానవ వనరుల అభివృద్ధి, స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాం. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 2015 నుంచి 2022 వరకు స్కిల్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ చేశాం. వేలాది మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చేందుకు కృషి చేశాం. ఎప్పటికి అప్పుడు తగిన విధంగా లక్ష్యాలు ఏర్పరుచుకొని పనిచేస్తున్నాం. మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం కమిట్ మెంట్ తో పోరాటం చేశాం. 29 రాష్ట్రాల్లో 18 పార్టీలను సమన్వయం చేసుకొని ఢిల్లీ పోరాటం చేశాం. ఆ రోజే అదే బిల్లులో ఓబీసీ మహిళలకు కూడా సబ్ కోటా కావాలని కోరాం. కీలకమైన మహిళ బిల్లు సాధనలో జాగృతి తన వంతు ప్రయత్నం చేసింది. మేమెప్పుడూ తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేశాం. 

సమాజంలో మార్పు కోసం కృషి చేశాం. మనం భౌగోళికంగా మాత్రమే తెలంగాణ సాధించుకున్నాం. సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరముంది. సామాజిక తెలంగాణ అంటే ఎన్నడు అసెంబ్లీ, గ్రామ పంచాయితీ పదవులు దక్కని వారికి అవకాశాలు వచ్చేలా చేయటం. యువకులు, మహిళలు, బ్యాక్ గ్రౌండ్ లేని యువతకు రాజకీయ అవకాశాలు రావాలి. ఆర్థికంగా, సామాజికంగా అన్ని వర్గాలకు అవకాశాలు రావాలి. ఫ్రెంచ్ రెవల్యూషన్, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమాన్ని ఆదర్శంగా మేము తీసుకుంటున్నాం. సామాజిక తెలంగాణ కోసం అందరికీ అవకాశం, అధికారం, ఆత్మగౌరవ ఉండాలని పోరాటం చేస్తున్నాం. సామాజిక తెలంగాణ సాధనకు అనేక మార్గాలున్నాయి.అందులో కాంగ్రెస్ బీసీలకు ఇస్తామన్న రిజర్వేషన్లు కూడా ఒకటి. డబ్బు ఉంటే అసలు కులాల గురించి ఎవరు పట్టించుకోరు. నేను గట్టిగా నమ్మేది డబ్బు ఉన్న కులం, లేని కులం ఈ రెండు మాత్రమే. వివక్ష పోవాలంటే అన్ని వర్గాల వారు కూడా ఆర్థికంగా బలంగా తయారు కావాల్సిన అవసరముంది. వాటి సాధనలో భాగంగా సమస్యలను అర్థం చేసుకోవటానికి తెలంగాణ అంత తిరుగుతున్నాం. ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలను తెలుసుకుంటున్నాం. వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం. ప్రజల సమస్యలు, భావోద్వేగాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే జనం బాట కార్యక్రమం. మా పర్యటనలో భాగంగా రంగారెడ్డి పదో జిల్లా. హైదరాబాద్ కు కంఠహారం మాదిరిగా ఉండే జిల్లా. పేరుకేమో తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న జిల్లా. కానీ ఇక్కడి ప్రజలకు మాత్రం సరై ఫలాలు అందలేదు. అసలైన రంగారెడ్డి వాసికి ఏమాత్రం ప్రయోజనం దక్కలేదు. 

ఫ్యాబ్ సిటీ, ఫ్యూటర్ సిటీ  ఇలా ఏ పెద్ద ప్రాజెక్ట్ వచ్చినా రంగారెడ్డి జిల్లాకే వస్తుంది. కానీ ఇక్కడి ప్రజలకు మాత్రం రూపాయి లాభం లేదు. వారికి ఉద్యోగాలు కూడా రావటం లేదు. 2007 లో నల్గొండ జిల్లాలోని హుజుర్ నగర్ లో స్థానికులకే అక్కడి సిమెంట్ ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు రావాలని మేము కొట్టాడం. కొలువుల కోసం కొట్లాట అని చేస్తే అక్కడి ప్రజలకు మేలు జరిగింది. మహేశ్వరంలో ఎన్నో సంస్థల్లో కనీసం లేబర్ గా కూడా మనవాళ్లను తీసుకోవటం లేదు. కచ్చితంగా మనం గట్టిగా అడిగినప్పుడే మాత్రమే ఇది జరుగుతుంది. కంపెనీలు వచ్చినప్పుడు స్థానికులకు ఎంత శాతం ఉద్యోగాలు కల్పిస్తారో అడగాలి. ఇక మా పర్యటనలో భాగంగా నిన్న శేరిలింగంపల్లికి పోయాం. 

అక్కడి ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు 9 వేల కోట్లు, కాంగ్రెస్ వచ్చాక 650 కోట్లతో అభివృద్ధి చేశానని చెబుతున్నాడు. కానీ అక్కడ గుంతలు లేని ఒక్క రోడ్ కూడా లేదు. తెలంగాణ రాకముందు 64 చెరువులు ఉంటే ఇప్పుడు చాలా చెరవులు కబ్జా గురయ్యాయి. ఈ విషయాన్ని భట్టి విక్రమార్క గారు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.గోపన్ పల్లి, గచ్చిబౌలి పెద్ద చెరవు, ఖానామెట్, చందానగర్, మియాపూర్, మదీనా గూడలో చెరువులు కబ్జా అయ్యాయి. పీఏ నగర్ లో రెండుసార్లు స్మశాన వాటికకు నిధులు వచ్చాయి. అయినప్పటికీ కాంపౌండ్ వాల్ కట్టలేదు. దీంతో ఇళ్లలోకి పాములు వస్తున్నాయి. హైదరాబాద్ లో పాములు ఇళ్లలోకి రావటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పీఏ నగర్, హఫీజ్ పేట, చందానగర్, మియాపూర్ లో  రోడ్లు బాగాలేవు. 10 వేల కోట్లతో అభివృద్ధి చేశామని చెబుతున్నప్పటికీ కనీసం రోడ్లు కూడా బాగాలేవు. ఎక్కడ చెరువు చూసిన ఎమ్మెల్యే గాంధీ గారు కబ్జా పెట్టారని చెబుతున్నారు. మరి హైడ్రా అధికారులు నిద్రపోతున్నారా? ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత కబ్జా చేసిన సరే ఊరుకుంటున్నారు. గాజుల రామారం లో14 ఎకరాలు కబ్జా చేసి కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. 

అదే ప్లేస్ లో 60 వడ్డెర కుటుంబాలనుప మాత్రం వెళ్లగొట్టారు. పెద్దవాళ్లను కాపాడి పేదవాళ్లను ఇబ్బంది పెట్టటమేనా హైడ్రా పని. కబ్జాలకు సంబంధించిన అన్ని వివరాలు హైడ్రాకు ఇస్తాం. ఎలా పనిచేస్తారో మేము చూస్తాం.రాజేంద్ర నగర్ కు వెళితే అక్కడ అదే పరిస్థితి.ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచి కాంగ్రెస్ వచ్చారు.

దాంతో వాషింగ్ మెషీన్ అన్నట్లుగా ఆయన కబ్జాల గురించి కూడా పట్టించుకోవటం లేదు. భుపాల్ నగర్, జలాల్ బాబా నగర్ నగర్ లో 2 వేల కుటుంబాలకు పట్టా చేయాల్సి ఉంది. 20 ఏళ్లుగా అన్ని పార్టీల వాళ్లు వారికి హామీలు ఇస్తున్నారు. కానీ ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. అటవీ శాఖకు ప్రభుత్వం భూమి ఇస్తే ఈ సమస్య తీరుతుంది. పక్కనే ఉన్న కిషన్ బాగ్ లో మాత్రం పట్టాలు ఇచ్చారు. భుపాల్ నగర్, జలాల్ బాబా నగర్ నగర్ సమస్యను కూడా సీఎం గారు పరిష్కారం చేయాలి. షాబాద్ లో బీసీ బిడ్డల రిజర్వేషన్ల పోరాటం కోసం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. కులాలు, మతాలకు అతీతంగా 40 రోజులుగా దీక్ష చేస్తున్నారు. 

బీసీ రిజర్వేషన్ల కోసం ఇతర కులాల వారు పోరాటం చేయటం మంచి ఒరవడి. తెలంగాణలోని అన్ని మండలాల్లో ఇదే ఒరవడి రావాలి.షాద్ నగర్ లో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు కట్టిన హాస్పిటల్ నే ఇంకా వినియోగిస్తున్నారు. ఆ హాస్పిటల్ పెచ్చులు ఊడుతుంది. పక్కనే కట్టిన వంద పడకల హాస్పిటల్ కు దాన్ని మార్చాలి. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కు సంబంధించి భూములు పోతున్నాయంటే తొమ్మిది రేకుల గ్రామానికి వెళ్లాం. నేను ఈ అంశానికి సంబంధించి ఆలైన్ మెంట్ మారిందని మెదక్ లో మాట్లాడితే నా మీద విరుచుకుపడుతున్నారు. కానీ ఇక్కడ నాలుగు సార్లు ఆలైన్ మెంట్ మారింది. బీఆర్ఎస్ హయాంలో రెండుసార్లు, కాంగ్రెస్ వచ్చాక రెండుసార్లు మారింది. ఆలైన్ మెంట్ మారటం కారణంగా పేద, చిన్న రైతుల భూమి పోతోంది. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక్కో చోట ఒక్క విధంగా ఆలైన్ మెంట్ చేస్తున్నారు. ఇక్కడ నాలుగు సార్లు ఆలైన్ మెంట్ మారటానికి పెద్దోళ్ల భూములు ఉండటమేనని స్థానికులు చెబుతున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలోని అమన్ గల్, మాడుగుల మండలాల్లో సీఎం సోదరులు, అదే విధంగా మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యులకు సంబంధించి భూములు ఉన్నాయి. ఇంకా బీఆర్ఎస్ నేతల భూములు కూడా ఉన్నాయి. నేను మొన్న చెప్పిన వారి భూములు ఉన్నాయని కూడా అంటున్నారు. అసలు ఆర్ఆర్ఆర్ మనకు ఎంత అవసరమన్న దానిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలుస్తాం. బాధితులందరినీ ఆయన దగ్గరకు తీసుకెళ్లి కలుస్తాం. చాలా అశాస్త్రీయంగా ప్రాజెక్ట్ ను చేపడుతున్నారు. మళ్లీ రీ సర్వే చేయాలని కోరుతాం. ఇదే విషయంపై నితిన్ గడ్కరీ గారికి ముందుగా లేఖ కూడా రాస్తాను. 

అభివృద్ధికి నేను వ్యతిరేకం కాదు. కానీ ఆ పేరుతో అన్యాయం జరగవద్దు. అవసరమైతే ఆరు నెలలు ఆలస్యమైన పర్వాలేదు. మళ్లీ సర్వే చేసి ప్రభుత్వ భూమి ఎక్కువ, ప్రజల భూములు తక్కువ ఉండే విధంగా చూడాలని కోరుతా. 

ఒరిజినల్ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ ను మెదక్ లో వంకర టింకర తిప్పారు. షాబాద్, షాద్ నగర్ లో కూడా మెదక్ లో కూడా 56 ఎకగరాలు 2025 లో మళ్లీ ఆలైన్ మెంట్ మార్చుతారేమో?ఈ విషయంలో కచ్చితంగా మేము లీగల్ ఫైట్ కూడా చేస్తాం. తొమ్మిది రేకుల గ్రామంలో ఆడబిడ్డల బాధ చూస్తే గుండె చెరవయ్యింది. అందరికీ సమన్యాయం జరగాలి. 

మహేశ్వరంలో రావిర్యాల చెరవు సహా పలు చెరువులు కబ్జా అవుతున్నాయి. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎందుకు స్పందించటం లేదు. అసలు హైడ్రా కూడా ఎందుకు చర్యలు తీసుకుంట లేదు. 

కబ్జాలు అయిన చెరువుల డీయిటెల్స్ అన్ని హైడ్రాకు ఇస్తాం. ఆటో నగర్ డంపింగ్ యార్డ్ సమస్య తీరుస్తామని అన్ని పార్టీల నాయకులు హామీలు ఇచ్చారు. గతంలో ఇక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ గా ఉన్నారు. ఇప్పుడు ఈటల గారు ఎంపీగా ఉన్నారు. ఈ సమస్యపై ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు కదలటం లేదు. 

ఎలిమినేడులో ఏరో స్పేస్ ప్రాజెక్ట్ కోసం భూములు తీసుకున్నారు. ఇప్పటికీ అక్కడికి ఒక్క కంపెనీ కూడా రాలేదు. భూములు తీసుకున్నప్పుడు ధర తక్కువగా ఉంది. ఇప్పుడు ఎకరా మూడు కోట్లు చేస్తోంది. కానీ రైతులు మాత్రం ఆ భూమి కోల్పోయారు. వారికి న్యాయం చేయాలని అడిగేందుకు వెళితే వారిని రాకుండా మాజీ ఎమ్మెల్యే, తాజా ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. అయిన సరే మహిళలు మాత్రం వచ్చారు. అన్నలు రాకపోయినా వారి కోసం పోరాటం చేస్తాం. ఇబ్రహీం పట్నం చెరువు, భూదాన్ భూములు ఎవరు కబ్జా చేశారో ఆలోచన చేయాలి. కొందరి తెలంగాణ కాదు.  అందరి తెలంగాణ కావాలి. కచ్చితంగా భూదాన్ భూముల చెర విడిపించాలి. ఫార్మాసిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ, ఫిప్త్ సిటీ అంటున్నారు. అసలు ఫార్మా సిటీ కి కండిషనల్ భూ సేకరణ చేశారు. ఒక వేళ అక్కడ ఫార్మా సిటీ కట్టకపోతే భూములు తిరిగి రైతులకు వాపస్ ఇవ్వాలి. కాని ఫార్ములేషన్ చేస్తామంటున్నారు. సినిమా వాళ్లకు, కంపెనీలకు ఆ స్థలం ఇస్తామని చెబుతున్నారు. అసలు ఉన్న సిటీని బాగు చేయకుండా ఏమీ లేని చోట ఎందుకు చేస్తున్నారు? ముందు ఉన్న మన సిటీని బాగుచేయండి. ఫార్మా కంపెనీలు పెట్టకపోతే రైతుల భూములు వారికి వాపస్ ఇవ్వండి.  లేదంటే వారి తరఫున కోర్టు కు వెళ్లి పోరాటం చేస్తాం. నాయి బ్రహ్మణులు, రజకులకు 200 యూనిట్లు కేసీఆర్ గారు ఫ్రీ కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఫ్రీ కరెంట్ ఇవ్వటం లేదు. పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటూ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చర్య ద్వారా కాంగ్రెస్ బీసీ వ్యతిరేక ప్రభుత్వమని స్పష్టమవుతోంది. జనం బాటలో భాగంగా మా దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను మేము ఫాలో అప్ చేస్తాం. కమిటీలు వేసుకొని, క్యాడర్ బలోపేతం చేసుకోని పోరాటం చేస్తాం. ఇప్పటికే మేము ప్రస్తావించిన చాలా అంశాల్లో ప్రభుత్వం, అధికారుల నుంచి స్పందన వచ్చింది. జనం బాట విజయవంతం చేసేందుకు కష్టపడుతున్న జాగృతి కార్యకర్తలకు ధన్యవాదాలు. అదే విధంగా మాకు ఎంతో సహకరిస్తున్న మీడియాకు కూడా ధన్యవాదాలు. ఇక రంగారెడ్డి జిల్లాలో లక్ష్మి దేవరపల్లి ప్రాజెక్ట్ కట్టాల్సిన అవసరముంది. ఆ ప్రాజెక్ట్ ఉద్యమంలో అక్కడకు పోని నాయకుడు లేడు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం అక్కడ శిలాఫలాకం కూడా వేయలేదు. సీఎం గారు ఈ ప్రాజెక్ట్ రద్దు చేసి కొడంగల్ – నారాయణ పేట్ ప్రాజెక్ట్ కడుతామంటున్నారు. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మేలు చేసే లక్ష్మి దేవరపల్లి ప్రాజెక్ట్ కట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. రంగారెడ్డిలో కబ్జాల అంశంపై మేము మాట్లాడుతుంటే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. మరి హైడ్రా పెద్దవాళ్లను రక్షించి పేదవాళ్లను ఇబ్బంది పెడుతుందా చూడాలి? హైడ్రాను ఒక సర్టిఫై ఏజెన్సీగా చేయాలని నేను ప్రభుత్వానికి సూచిస్తున్నా. దాని కారణంగా ఇళ్లు కొనే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ చీరలని పేర్లు పెట్టటాన్ని వ్యతిరేకిస్తున్నాం. 

ఢిల్లీ పెద్దల మెప్పు కోసం అలా చేయటం కరెక్ట్ కాదు. ఇప్పటికీ ఢిల్లీకి డబ్బులు భారీగా పంపుతున్నారు. మన సంస్కృతిని కాదని ఇందిరమ్మ చీరలని పేరు పెట్టటం ద్వారా ఢిల్లీ బాసులను మెప్పించాలని చూస్తున్నారు. 

బతుకమ్మ మన సంస్కృతి. ఆడబిడ్డలు ఆ పేరును సెంటిమెంట్ గా భావిస్తున్నారు. అదే విధంగా సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్ ల వాళ్లకే చీరలు ఇస్తున్నారు. వారికి మాత్రమే కాదు. బతుకమ్మ చీరలు ఇచ్చినట్లు అందరికీ ఇవ్వాలి. 

లేదంటే మిగతా తెలంగాణ ఆడబిడ్డలను అవమానించినట్లే.  జనం బాట లో ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం స్టార్టింగ్ పాయింట్ మాత్రమే.  నిరంతరం ఇది జరుగుతుంది. మేధావులతో సమావేశంలో విద్య, వైద్యం, న్యాయం ఉచితంగా అందేలా చూడాలని సలహాలు ఇస్తున్నారు. నా రాజీనామా ను ఆమోదిస్తే కాంగ్రెస్ కు ఇబ్బంది అవుతుందేమో. 

ఇప్పటికీ పదిసార్లు రాజీనామా ఆమోదించాలని కోరాను. ఆడవాళ్ల సమస్యల  తర్వలో ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటాం. జనం బాట పూర్తైన తర్వాత మహిళలకు రూ. 2500 కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.” అని అన్నారు. 

గ్రంథాలయం సందర్శన

బడంగ్ పేట్ లోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించి ఉద్యోగ నియామక పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారితో ముచ్చటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు

ఎల్ బీ నగర్ చౌరస్తా మలి దశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు

ఎల్ బీ నగర్ లోని ఆటో నగర్ డంపింగ్ యార్డ్ పరిశీలించి.. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు

మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేటలో నిర్వహించిన మాటా – ముచ్చట కార్యక్రమంలో పాల్గొని స్థానికులతో ముచ్చటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.