janam bata kavitha-mahabubnagar 2nd Day

జనం బాటలో కవితకు మహబూబ్ నగర్ జనం బాసట రెండో రోజు

మహబూబ్ నగర్ లో రెండో రోజు బిజీ బిజీ

జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా 2025 అక్టోబర్ 29న బుధవారం మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బిజీ బిజీగా గడిపారు. జిల్లాలోని పలు ఆలయాలు, దర్గాలు సందర్శించారు. అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఎండీ నిజామూద్దీన్ కుటుంబాన్ని పరామర్శించారు. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు. రెండు రోజుల మహబూబ్ నగర్ పర్యటనలో తన దృష్టికి వచ్చిన పలు అంశాలను ప్రస్తావించారు. ఆమె వెళ్లిన ప్రతిచోట జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. 

మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన

Kavitha Visits Manyamkonda Temple, Mahabubnagar & Hanamkonda - 2nd Day

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్న కవిత గారి సంప్రదాయబద్దంగా ఆహ్వానించిన అర్చకులు.. అనంతరం ప్రత్యేక పూజలు చేయించి వేద ఆశీర్వచనం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయురారోగ్య ఆశైర్యాలు ప్రసాదించాలని స్వామివారికి కవిత గారు ముడుపు కట్టారు. 

ప్రెస్ మీట్ 

మధ్యాహ్నం మీడియా ప్రతినిధులతో కవిత చిట్ చాట్ నిర్వహించారు. తన పర్యటన ఉద్దేశం వారికి వివరించారు. భవిష్యత్ కార్యాచరణ కు సంబంధించి సలహాలు సూచనలు తీసుకున్నారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత పలు అంశాలను ప్రస్తావించారు. 

“కవిత ఇండిపెండెంట్. నా వెనుక ఎవరు లేరు. నా ముందు ప్రజలు ఉన్నారు. కొత్తగా వచ్చిన వారిపై ఆరోపణలు, అనుమానాలు, అవమానాలు ఉంటాయి. కాంగ్రెసేమో నేను బీజేపీ బీ టీమ్ అని, బీజేపీ వాళ్లు కాంగ్రెస్ బీ టీమ్ అని అంటారు. బీఆర్ఎస్ వాళ్లు ఏదేదో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే నా నడక ద్వారా నా స్టాండ్ ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. అందుకు కొంత సమయం పడుతుంది. నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నీళ్ల విషయంలో మహబూబ్ నగర్ చారిత్రాక అన్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆయనను ప్రజలు క్షమించరు. నియామకాల్లో 8 మంది నాన్ లోకల్స్ కు గ్రూప్- 1 లో ఉద్యోగాలు ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశాను. నిధుల విషయంలోనూ అన్యాయమే చేస్తున్నారు.  రెండున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చారు. అయినా ఆరు గ్యారంటీలు అమలు చేయటం లేదు. తెచ్చిన డబ్బులు మిస్ యూజ్ అయ్యాయి. వాటి గురించి ప్రశ్నిస్తాం. జాగృతి తరఫున షాడో కేబినెట్ వేస్తాం. కేబినెట్ లో ఉన్న వారిని నీడలా వెంటాడుతాం. ప్రజలకు చేయాల్సిన పనులను చేయిస్తాం. దగాపడ్డ ఉద్యకారుల్లో నేను కూడా బాధితురాలినే. ఆడబిడ్డలు అన్ని చెప్పరు. గుంభనంగా అభివృద్ధి జరగాలని ఎన్నో విషయాలను బయటకు చెప్పలేదు. గతంలో కన్నా కూడా ఇప్పుడే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దగాపడ్డ ఉద్యమకారుల మంచి చేయాలనే నా ఈ ప్రయాణం. గతంలో కొన్ని పనులు చేయించలేకపోయాను. అమరవీరులందరికీ న్యాయం జరగలేదు. అందుకే అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇప్పించాలని పోరాటం చేస్తున్నా. 

నేను ఒక పని పెట్టుకుంటే ఆ కమిట్ మెంట్ ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది. బతుకమ్మ ఎత్తుకొని మొత్తం ప్రపంచానికి పరిచయం చేశాను. అలాంటి కమిట్ మెంట్ తో పనిచేస్తాను. నా రాజీనామా యాక్సెప్ట్ చేయండి నేను అడుగుతూనే ఉన్నా. కాంగ్రెస్ వాళ్లకు ఏం రాజకీయం ఉందో? నా రాజీనామా యాక్సెప్ట్ చేస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేల రాజీనామాలు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందేమో?  నేను లోకల్ బాడీ ఎమ్మెల్సీ ని. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియదు. నాకు బీఆర్ఎస్ తో సంబంధం లేదు. బీఆర్ఎస్ ద్వారా వచ్చిన రాజీనామా యాక్సెప్ట్ చేయమని కోరుతున్నా. తెలంగాణ జాగృతి ఉద్యమ సంస్థ. గతంలో అనేక ఉద్యమాలు చేశాం. తెలంగాణ ఉద్యమంలో మాకంటూ ఓ పేజీనే క్రియేట్ చేసుకున్నామని గర్వంగా చెప్పగలను. సాధించుకున్న తెలంగాణలోను మా వంతు పాత్ర పోషించాం. తెలంగాణ వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు పెట్టి ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వచ్చేలా  చేశాం. ఎంపీగా, ఎమ్మెల్సీ గాను నా దృష్టికి వచ్చిన ఎన్నో సమస్యలను పరిష్కరించాను. ఐతే మనం భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించాం. సామాజిక తెలంగాణ విషయంలో ఇంకా ఒక్క అడుగు వెనుకే ఉన్నాం. 

నిన్న జడ్చర్ల లోని ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యం అందక ఒక యువ రైతు చనిపోయాడు.

ఎంతో ఆశతో, ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణలో వైద్యం అందించలేని స్థితి వచ్చింది. డబ్బు లేని వారు వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారు. విద్య విషయంలో అదే పరిస్థితి ఉంది. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవటంతో పేద విద్యార్థులు ఇంటి దగ్గరే ఉంటున్నారు. ప్రభుత్వం మీద ఆధారపడి చదవుకునే వారికి విద్య దొరకకుండా చేస్తున్నారు. అందుకే అందరికీ సమాన వాటా, సమాన అవకాశాలు ఉండాలని కోరుతున్నా. దీని కోసమే మేము ప్రజల ముందుకు వచ్చాం. నిన్న అప్పంపల్లి అనే గ్రామానికి వెళ్లాను. అక్కడ 1948 లో భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసిన అమరుల స్థూపం ఉంది. ఆనాటి పోరాటం సక్సెస్ అయ్యింది. స్వేచ్ఛ, స్వాతంత్రం కోసం చేపట్టిన  ఫ్రెంచ్ విప్లవం కూడా సక్సెస్ అయ్యింది. నీళ్లు నిధులు, నియామకాలు నినాదంతో చేపట్టిన తెలంగాణ ఉద్యమం కూడా విజయవంతమైంది. అయితే తెచ్చుకున్న తెలంగాణలో అందరికీ అవకాశం, అధికారం, ఆత్మగౌరవం ఉండాలని కోరుకుంటున్నా. అది సామాజిక తెలంగాణ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకోసమే నా ప్రయత్నం. ఐతే ఈ 10 ఏళ్లు ఏం చేశారన్న ప్రశ్న కూడా వస్తుంది.

అందరికీ ఆహారం, నీళ్లు, పెన్షన్లు ఇలా కేసీఆర్ గారు కొంత మంచి చేశారు. కానీ కాంగ్రెస్ వచ్చాక ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ఏమీ చేయటం లేదు. జడ్చర్లలో 100 పడకల హాస్పిటల్ ను 50 పడకల హాస్పిటల్ గా మార్చారు. రాంరెడ్డి గూడెం లోని గురుకులంలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే కనీసం పట్టించుకోవటం లేదు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు, హాస్పిటల్స్ ను కూడా ఈ ప్రభుత్వం మెయింటెన్ చేయలేకపోతోంది.  చచ్చే టోళ్లు చస్తున్నారు. చదివు ఆపేటోళ్లు ఆపుతున్నారు. అయినా సరే ప్రభుత్వానికి పట్టింపు లేదు. మేము స్వాతంత్ర ఉద్యమాన్ని చూడలేకపోయాం. అందుకే తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పోయిన సరే అని ఉద్యమం చేశాం. ప్రాణాలకు తెగించి తెచ్చుకున్న తెలంగాణను తెర్లు కానివ్వం. 

ఎంతో మంది పోరాటం కారణంగా ఎస్సీల్లో వర్గీకరణ జరిగింది. కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎందుకు వర్గీకరణ అమలు చేయలేదు? దీన్ని చూసుకుంటూ ఎలా కూర్చుంటాం. జాగృతి తరఫున ప్రశ్నిస్తాం.  బీసీలకు 42 శాతం వాటా రావద్దా? అగ్ర వర్ణాల్లోనూ రాజకీయంగా ప్రాతినిధ్యం లేని వైశ్యులు ఉన్నారు. 

ముస్లింలు, లంబాడాలు లేని మొదటి కేబినెట్ ఇది. కనీసం ముస్లింలకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి కాదా? ఇవన్నీ కావాలంటే సామాజిక తెలంగాణ సాధించుకుంటేనే సాధ్యమవుతుంది. 

అందరికీ అవకాశం, అభివృద్ధి, ఆత్మగౌరవం ఉండాలన్నదే మా విధానం. మహబూబ్ నగర్ లో బీసీ జనాభాకు తగిన విధంగా ఎమ్మెల్యేలు ఎందుకు లేరు? గతంలో విప్లవాత్మక ఆలోచనలు చేసినప్పుడల్లా భారత్ బాగు పడింది. మళ్లీ విప్లవాత్మక ఆలోచన చేస్తేనే సామాజిక తెలంగాణ వస్తుంది. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలనే నేను కోరుతున్నా. అది నాకోసం కాదు. నేను ఎంపీగా, ఎమ్మెల్సీ గా పనిచేశాను.  బతుకమ్మ ఎత్తుకొని ప్రపంచం మొత్తం తిరిగాను. ఇప్పటికీ ఎక్కడికీ వెళ్లినా సరే నాకు ఆడబిడ్డలు ఘనస్వాగతం పలుకుతారు. ఇవ్వాళ్టికి కూడా వివక్ష ఎదుర్కొనే ఎస్సీ లు, అధికారానికి దూరంగా ఉన్న బీసీలు,  వైశ్యులు, మహిళలకు అవకాశాలు రావాలనే నేను కోరుతున్నా. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడే యువ మిత్రులకు అవకాశాలు రావాలి. 

ఈ ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ పులిబిడ్డను అని చెప్పుకుంటారు. కానీ రెండేళ్లలో మహబూబ్ నగర్ టౌన్ కు ఎన్నిసార్లు వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి తప్ప మళ్లీ రాలేదు. మహబూబ్ నగర్ టౌన్ కు కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేస్తారా లేదా చెప్పండి.  ఇప్పటికీ మహబూబ్ నగర్ లో మూడు రోజులకొకసారి నీళ్లు వస్తాయా? అది బీఆర్ఎస్ తప్పా, కేసీఆర్ తప్పా అనేది ఇక్కడ చర్చ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తప్పులను సవరించండి. పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేస్తే మంచి పేరు వస్తుందని సీఎం గారికి సూచిస్తున్నా. కేవలం కేసీఆర్ కు మంచి పేరు వస్తదనే ఉద్దేశంతో పనులు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకండి. లేదంటే ఏపీ ప్రభుత్వం మన నీళ్లను తీసుకెళ్తుంది. ఇప్పటికే కృష్ణా బేసిన్ నీళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి నీళ్ల కోసం బనకచర్ల కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నారు.  ఆల్మట్టి ఎత్తు పెంచే ప్రయత్నం కూడా జరుగుతుంది. అదే జరిగితే కృష్ణా ప్రాజెక్ట్ ల కాల్వల్లో క్రికెట్ ఆడుకోవాల్సిందే. చుక్క నీరు రాదని మహబూబ్ నగర్ ప్రజలకు చెబుతున్నా. దీన్ని ఆపే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేయాలి. ఉద్ధండపూర్, కరివెన రిజర్వాయర్లను తర్వగా పూర్తి చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ సహా ఎన్నికల్లో ఇచ్చిన రూ. 2500 హామీ, తులం బంగారం  వెంటనే ఇవ్వాలి.  జాబ్ క్యాలెండర్ ప్రకటించి యువతకు న్యాయం చేయాలి. ఇక వర్షాల కారణంగా పత్తి మొత్తం తడిచింది. 12 శాతం కన్నా ఎక్కువగా తేమ ఉంటే పత్తి కొనమని చెబుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోని ఎంత తడిచిన సరే పత్తి, వరి కొనాలి. పండగ సాయన్న పుట్టిన నేల ఇది. ఇక్కడ మా బీసీ నేతలు బీసీ జేఏసీ గా ఏర్పడి పని చేస్తున్నారు. 

ముఖ్యమంత్రి గారు బీసీ రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీల డెలిగేషన్ ను ఢిల్లీ తీసుకెళ్లాలి. రానున్న రోజుల్లో జాగృతి సంస్థను మరింత పరిపుష్టం చేసుకుంటాం.  

నియోజకవర్గ, మండల స్థాయిలో కమిటీలు వేసుకుంటాం. మా లక్ష్యం సామాజిక తెలంగాణ. దాని కోసం పోరాడుతాం. దళితుడిని  సీఎం చేస్తానని కేసీఆర్ అన్నారు. కానీ 2014 లోనే కేసీఆర్ సీఎం అభ్యర్థి అని చెప్పి ఎన్నికలకు వెళ్లారు. అయినా బీఆర్ఎస్ తో నాకు సంబంధం లేదు.  ఆ పార్టీ గురించి అడగకండి.

తెలంగాణ జాగృతి సివిల్ సోసైటీ ఆర్గనైజేషన్. మా ప్రాధాన్యమంతా ప్రజల సమస్యల పరిష్కారమే. 

రాష్ట్ర సాధనలోనూ మేము యాక్టివ్ గా పనిచేశాం. రాజకీయ విమర్శలు చేశాం. చిత్తశుద్ధితో పనిచేస్తే సివిల్ సోసైటీగా కూడా ఎన్నో విజయాలు సాధించవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ లో అంబేడ్కర్ విగ్రహాం, బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగా చేసుకున్నాం. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేరు. అందుకే ఆయనకు తెలంగాణ తల్లి గురించి తెలియదు. ప్రభుత్వం మారినప్పుడల్లా తెలంగాణ తల్లి మారదు. గెజిట్ లేదన్న చిన్న కారణంతో తెలంగాణ తల్లిని మార్చారు. మేము పాత తెలంగాణ తల్లినే గౌరవించుకుంటాం. ఎంబీసీల కోసం జాగృతి పనిచేస్తుంది. ఎంబీసీ ల కోసం మేము ప్రత్యేకంగా శాఖ పెట్టుకున్నాం. బీసీ, ఎంబీసీ లకు వేర్వేరు రిజర్వేషన్లు కావాలని నేను కోరుతున్నా. ఆగస్ట్ 15, 2016 లోనే కేసీఆర్ గారితో నేను ఎంబీసీ అంశంపై ప్రకటన చేయించాను. 

ఎంబీసీ కులాల అభివృద్ధి కోసం పనిచేయటం జాగృతి లక్ష్యం. సామాజిక తెలంగాణ మాత్రమే తెచ్చుకుంటే ప్రయోజనం లేదు. లీడర్లను కూడా తయారు చేయాలి. నేను మహిళ బిల్లు కోసం కొట్లాడాను. అంతటితో ఆపకుండా మహిళలను లీడర్లుగా తయారు చేసేందుకు లీడర్ అనే కార్యక్రమం చేశాను. ప్రతి సామాజిక వర్గంలోనూ లీడర్లు తయారు కావాల్సి ఉంది. అలాంటి వారిని తయారు చేసే పని జాగృతి చేస్తోంది”. అని కవిత అన్నారు. 

హజ్రత్ సయ్యద్ మర్దాన్ అలీ షా ఖాద్రీ సాహబ్ దర్గా సందర్శన

మహబూబ్ నగర్ లోని షా సాహబ్ గుట్టలోని హజ్రత్ సయ్యద్ మర్దాన్ అలీ షా ఖాద్రీ సాహబ్ దర్గా ను జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. అక్కడి సాంప్రదాయం ప్రకరం చాదర్ సమర్పించారు. తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు. 

అమెరికా పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఎండీ నిజాముద్దీన్ కుటుంబానికి పరామర్శ

అమెరికా పోలీసుల కాల్లుల్లో  మృతి చెందిన ఎండీ నిజాముద్దీన్ కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన 29 ఏళ్ల నిజాముద్దీన్ సెప్టెంబర్ నెలలో కాలిఫోర్నియా లో పోలీసులు కాల్పుల్లో మృతి చెందాడు. బుధవారం మహబూబ్ నగర్ లో నిజాముద్దీన్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులను కవిత గారు పరామర్శించి ఓదార్చారు.

అభిమాని ఇంటికి కవితక్క

జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన జాగృతి నాయకుడు జేపీ శ్యామ్ ప్రసాద్ ఇంటికి కల్వకుంట్ల కవిత వెళ్లారు. ఆమెకు ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు. గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలో మహిళలు, చిన్నపిల్లలు, వృద్దులతో మాట్లాడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.