పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డగోలు అబద్దాలు చెప్పిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు. జాగృతి జనంబాటలో భాగంగా సూర్య పేట జిల్లాలో పర్యటిస్తున్న కవిత ఆదివారం సూర్యాపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాగు జలాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అన్యాయం చేశాయని దుయ్యబట్టారు.
“నిన్న అసెంబ్లీలో విచిత్ర పరిణామాలు జరిగాయి. అసలు సెషన్ లో మొత్తం ప్రతిపక్షమే లేకుండా సభ జరిగింది. దీంతో పాలకపక్షం అడ్డగోలుగా అబద్దాలు చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టానుసారం ప్రసంగం కొనసాగించారు. నిజానికి కృష్ణా జలాల మీద చర్చ అని చెప్పారు. అలాంటప్పుడు స్టేక్ హోల్డర్స్ అయిన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ గురించి మాట్లాడాలి. కానీ అపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడి వచ్చిన దాని మీద మాత్రమే చర్చ చేశారు. దాంతో ప్రజలకు ఏం లాభం? కృష్ణా వాటర్ రివర్ మేనేజ్ మెంట్ బోర్డులో రెండు రాష్ట్రాలను మాత్రమే ఉంచి మనకు అన్యాయం చేశారు. సభలో మాత్రం సీఎం నేను మాట్లాడేది వందేళ్లు చరిత్రలో ఉంటుందన్నారు. అసలు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టిని డ్యాం ఎత్తును 5 మీటర్లు పెంచుతుంటే దాని మీద కదా మాట్లాడాలి. కర్ణాటక చర్య కారణంగా వంద టీఎంసీల నీళ్లను మనం నష్టపోయే పరిస్థితి ఉంది. దీనిపై ఏమాత్రం చర్చ జరపకుండా ఒక లెటర్ రాసి సైలెంటుగా ఉన్నారు. అసలు ఆల్మట్టి ఎత్తు పెంపుపై ఎందుకు మాట్లాడలేదు. కృష్ణా జలాలపై ఎందుకు చర్చించలేదు? బీఆర్ఎస్ ను తిట్టి పొలిటికల్ గా ప్రయోజనం పొందేందుకు చర్చ జరిగినట్లు ఉంది. నిజంగా పాలమూరు జిల్లాపై ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉందా? “

“జాతీయ హోదానే ఇవ్వమని చెప్పిన కేంద్రం…కర్ణాటక ఎన్నికల కోసం అప్పర్ భద్రకు ఆ హోదా ఇచ్చింది. దీని కారణంగా తుంగభద్రకు రావల్సిన నీళ్లను వాళ్లు ఆపుకున్నారు. అదే విధంగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎందుకు మాట్లాడటం లేదు?
భవిష్యత్తులో మహారాష్ట్రతో ఇబ్బంది వస్తే ఎలా అన్న దానిపై కూడా చర్చించాలి కదా? తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కురచ మనసుతో మాట్లాడారు. రేవంత్, ఉత్తమ్ లకు చిత్తశుద్ధి ఉంటే అప్పర్ భద్ర జాతీయ హోదా, ఆల్మట్టి ఎత్తు పెంపునకు వ్యతిరేకంగా తీర్మానం చేయండి. ఆల్మట్టి ఎత్తు తగ్గించేలా రేవంత్ రెడ్డి కృషి చేయాలి. లేదంటే ఆయనను పాలమూరు ప్రజలు క్షమించరు. నారాయణ పేట్- కొండగల్- మక్తాల్ ఇన్ టేక్ పాయింట్ ను జూరాల నుంచి మార్చుకోవాలి. పాలమూరు ప్రజలకు ఎంతో మేలు చేసే అవకాశాన్ని వదులుకొని చరిత్ర హీనులు కావద్దు.”