జాగృతి జనంబాటలో భాగంగా 2025, డిసెంబర్ 8న సోమవారం కూకట్ పల్లిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. కూకట్ పల్లి వై జంక్షన్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి నియోజకవర్గ పర్యటన ప్రారంభించారు. అనంతరం బాలానగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ హైదరాబాద్ కు కూకట్ పల్లి కామధేనువుగా మారిందన్నారు.

“హైదరాబాద్ కు కామధేనువుగా మారిన కూకట్ పల్లిలో రూ. 2 వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం అమ్మింది. కానీ కూకట్ పల్లి నియోజకవర్గం కోసం కనీసం రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని ఇప్పుడు గొప్పగా పెడుతున్నారు. కూకట్ పల్లిలో కనీస వసతులు లేవు. ఇక్కడ ఒక్క స్టేడియం కూడా లేదు. అసలు హైదరాబాద్ ను గ్లోబల్ సిటి అని ఎలా చెబుతున్నారు? జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉంది. కూకట్ పల్లి అంటే ఒక మినీ ఇండియా మాదిరిగా ఉంది. కానీ ఇక్కడ పేదవాళ్లు రెంట్ కు ఇళ్లు తీసుకునే పరిస్థితి కూడా లేదు. కనీసం ప్రభుత్వాన్ని అడిగే వాళ్లు లేకుండా పోయారు.

ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఓట్లు లేనప్పుడు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవటం లేదు. పాలక పక్షం పట్టించుకోవటం లేదు. ప్రతిపక్షం అడగటం లేదు. అందుకే జాగృతి ప్రశ్నించే బాధ్యతను భుజాన వేసుకొని ముందుకు సాగుతున్నది. కూకట్ పల్లిలో భూములు అమ్ముడే కాదు. ఇక్కడ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ శ్రద్ధ పెట్టాలి. ప్రజా సమస్యలపై యుద్ధ భేరియే మా జాగృతి చేస్తోంది.”