పేదల పట్ల ఇంత నిర్లక్ష్యమా – కల్వకుంట్ల కవిత

భూదేవినగర్ బస్తీ వాసుల కష్టాలు విని చలించిన మాజీ ఎంపి

జాగృతి జనంబాటలో భాగంగా గురువారం రాత్రి మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భూదేవినగర్ బస్తీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. బస్తీ వాసుల దుర్భర జీవితాన్ని చూసి చలించిపోయారు. భూదేవినగర్ రైల్వే లైన్ కట్టను ఆనుకుని గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలను పలకరించారు. ఇంటింటికీ తిరిగి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. సుమారు 350 కుటుంబాలు 40 ఏండ్లుగా కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని జీవితాలు గడపడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించిన తనకు ఇట్లాంటి దుర్భర పరిస్థితులు ఎక్కడా కనిపించలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది పాలమూరు నుంచి వలస వచ్చిన వారుగా గుర్తించిన కవిత నగర నిర్మాణంలో తమ చమటను రక్తంగా మారుస్తున్న పేదల పట్ల పాలకులు ఇంత నిర్దయగా ఉండటం దారుణమన్నారు. బూదేవినగర్ పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు వచ్చి తీరాలన్నారు. 

బస్తీ వాసులకు ఇండ్లు ఇప్పించే వరకు తాను విశ్రమింనని స్పష్టం చేశారు. తనవంతు తక్షణ సాయంగా బస్తీ వాసులకు 6 స్నానపు గదులను నిర్మించి ఇస్తానని సభా ముఖంగా కవిత హామీ ఇచ్చారు