Telangana Jagruti land protest in Manakondur led by Kavitha

ఇంటి స్థలం కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోండి – తెలంగాణ ఉద్యమకారులకు కవిత పిలుపు

కరీంనగర్ లో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూ పోరాటం- తెలంగాణ వచ్చాక కూడా ఉద్యమకారులకు గౌరవం దక్కలేదు

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తాం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత – (మానకొండూరు)

తెలంగాణ కోసం రక్తం ధారబోసిన ఉద్యమకారులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్యాయం చేశాయని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. అందుకే ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకోవాలని ఉద్యమకారులకు  పిలుపునిచ్చారు. ప్రభుత్వ పెద్దలు దిగి వచ్చే వరకు జాగృతి తరపున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులతో  కలిసి ఆమె బుధవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. భూ పోరాటం ప్రారంభించడానికి ముందు అల్గునూరు చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉద్యమకారులతో కలిసి కవిత నినాదాలు చేస్తూ మానకొండూరులోని 5 ఎకరాల ప్రభుత్వ స్థలానకి చేరుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయినందున తామే ప్రభుత్వ స్థలాన్ని ఉద్యమకారులకు పంపిణీ చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. అనంతరం అక్కడ గుడిసెలు వేయించారు. డోజర్లతో స్థలాన్ని చదును చేసి ప్లాట్ల కోసం ముగ్గు పోశారు.

 ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆ భూమిలో తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యమకారులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం

“తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్లీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 

కరీంనగర్ గడ్డ మీద ఏ పోరాటం చేసినా అది సక్సెస్ అవుతుంది. ఇవ్వాళ మనం ఉద్యమకారుల కోసం చేస్తున్న భూపోరాటం కూడా సక్సెస్ అవుతుంది. ఒక్క కరీంనగర్ లో మాత్రమే కాదు అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల భూమి ఇచ్చే వరకు పోరాటం చేస్తాం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విలువైన భూములు ఉంటాయి. కానీ అక్కడ కూడా వదలం. ప్రభుత్వం అక్కడ భూములు అమ్ముకోవాలని చూస్తోంది. కానీ ఉద్యమకారుల పోరాటం, చెమట ద్వారానే తెలంగాణ వచ్చింది. మనం కడుపు మాడ్చుకొని కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఎవరో కొట్లాడితే రాలేదు. మనం బతుకమ్మ, బోనం ఎత్తాం, వంట వార్పు అంటూ ఉద్యమాలు చేశాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకు నష్టం జరిగితే ఓపిక పట్టాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల ద్వారా లబ్ధి పొందేందుకు వారికి ఎన్నో హామీలు ఇచ్చింది. పెన్షన్, సంక్షేమ బోర్డు, 250 గజాల జాగ ఇస్తామని మాట ఇచ్చింది. కానీ కనీసం ఉద్యమకారులను గౌరవించి వారికి శాలువాతో సన్మానం కూడా చేయలేదు. అమరవీరుల కుటుంబాలకు ఎంతో చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. 1200 మంది అమరులైతే బీఆర్ఎస్ సర్కార్ 540 మందికి మాత్రమే మేలు చేసింది. ఎంతో మంది అమరవీరుల కుటుంబాల వారు వచ్చి వారి బాధలు నాకు చెప్పారు. జూన్ 2, ఆగస్ట్ 15, జనవరి 26 లాంటి సందర్నభాల్లో కూడా వారిని గౌరవించలేదు. “

ఏకమైన తెలంగాణ ఉద్యమకారులు

“ఇప్పుడు ఉద్యకారులంతా ఫోరంగా ఏర్పడి ఒక్కటయ్యారు. ఇక ఉద్యమకారుల ఐక్యతను ప్రదర్శిద్దాం. తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవంతో పాటు ఉద్యమకారుల వాటా ఇవ్వమని మాత్రమే కోరుతున్నాం. ఇస్తామన్న పెన్షన్, సంక్షేమ బోర్డు, 250 గజాల స్థలం మాత్రమే అడుగుతున్నాం. తెలంగాణ వచ్చిన 12 ఏళ్లలో ఎంతో మంది ఉద్యకారులు చనిపోయారు. హాస్పిటల్ లో చేరితే వారికి సాయం కూడా చేయలేదు. నిజంగా ఉద్యకారుల కుటుంబాలు ఎంతో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. తెలంగాణ వ్యతిరేకులు ఉద్యమపార్టీలోకి వచ్చి మనపైనే పెత్తనం చెలాయిస్తూ కేసులు పెట్టారు. సెక్రటేరియేట్ కు వెళ్తే మనల్నే ఇక్కడ ఏం పని అంటూ అవమానించారు. ఉద్యమకారులను ఉరికిచ్చి కొడుతామని కూడా బెదిరించారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఉద్యకారులకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు హామీలకు సంబంధించి ఒక్క ప్రకటన కూడాలేదు. అప్లికేషన్లు పెట్టుకోమన్నారు అంతే. వారిపై కేసులు లేవు అంటున్నారు. ఉద్యకారులందరిపై కేసులు ఉంటాయా? తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఎంతో మంది ఆగమయ్యారు. ఏ ఊరిలోకి, ఏ జిల్లాకు వెళ్లినా సరే అక్కడి ప్రజలు ఉద్యమకారులెవరో చెబుతారు. వాళ్లు చెప్పిన వారికే ప్రభుత్వం ఇస్తామన్న హామీలు నెరవేర్చాలి. ఇప్పుడు మళ్లీ కమిటీలు అంటున్నారు. కమిటీలు జాన్తా నయ్. ఉద్యమకారుల ఫోరం ఇచ్చిన డేటా ప్రకారమే ఉద్యమకారులను గుర్తించండి. ఆ డేటానే సీఎం కార్యాలయం ముందు పెడుదాం. పోరాటాల ద్వారా తెలంగాణనే తెచ్చుకున్నాం. ఐదు ఎకరాల భూమి తెచ్చుకోవటం పెద్ద పనా? ప్రభుత్వం దిగివచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు. మేము శాంతియుతంగా పోరాటం చేస్తామని ప్రభుత్వానికి చెబుతున్నా. “