జాగృతి జనంబాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లక్ష్మా పూర్ రైతులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జాగృతి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

” మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలోని లక్ష్మాపూర్ గ్రామ రైతులు భూముల సమస్యతో ఇబ్బంది పడుతున్నరు. ఇద్దరు సీఎంలు వచ్చినా లక్ష్మా పూర్ నక్ష మారలేదు. వెంటనే లక్ష్మాపూర్ లో రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి. వందేళ్లుగా లక్ష్మాపూర్ నక్ష సరిగా లేకపోవటంతో దీన్ని సరిచేస్తామని గతంలో ఇక్కడ ఆగిన కేసీఆర్ గారు చెప్పారు. అదే విధంగా ధరణి ద్వారా ఈ గ్రామానికి నక్ష చేయటం జరిగింది. ఇలాంటి పరిస్థితి మార్చేందుకే ధరణి తెస్తున్నామని అసెంబ్లీలో కూడా కేసీఆర్ గారు చెప్పారు. శాటిలైట్ సర్వేలో కూడా చాలా ఇబ్బందులు, అవకతవకలు అయ్యాయి. దీంతో రైతులకు ఎప్పుడు కూడా సంపూర్ణంగా రైతుబంధు రాని పరిస్థితి వచ్చింది.

అదే విధంగా ఐదు ఎకరాలకు రైతుకు ఎకరం, రెండు ఎకరాల రైతుకు అర్థ ఎకరం ఉన్నట్లు పడ్డాయి. పట్టా భూములను సైతం లావణి భూములుగా రికార్డుల్లో రాశారు. కేసీఆర్ గారు తప్పు చేశారు కాబట్టి మేము సరిచేస్తామని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. లక్ష్మాపూర్ కు వచ్చి ఇక్కడ ఉండి వారికి హామీ ఇచ్చారు. ధరణి గంగలో కలిపి భూమాత తెస్తున్నామని ఆయన చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తోంది. కానీ ఏమీ చేయలేదు. ఇక్కడ రైతులకు తీవ్రంగా ఇబ్బంది జరుగుతున్న పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడి విషయాలన్నీ తెలుసు. రెండేళ్లు అయిన తర్వాత కూడా పాస్ బుక్కులు రాలేదు. రైతు భరోసా కూడా ఇక్కడి రైతులకు రాలేదు. లక్ష్మాపూర్ లో ఉన్న రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రామస్థులతో కలిసి మేము ఈ సమస్య తీరే వరకు ఫైట్ చేస్తాం.”