ప్రశ్నిస్తేనే ఫలితం ఉంటుంది -కల్వకుంట్ల కవిత – మౌలాలిలో మహిళలతో సమావేశం

జాగృతి జనంబాటలో భాగంగా మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో  మహిళలతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

” ఎన్నో కలలతో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఐతే వచ్చిన తెలంగాణలో కొన్ని పనులు జరిగాయి. కానీ జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. 

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు జరిగితే…కాంగ్రెస్ వచ్చాక పరిస్థితి దారుణంగా తయారైంది. 

పెన్షన్ పెంచుతారని ఓటు వేస్తే ఉన్నవే వచ్చే పరిస్థితి లేదు. ఆనాడు రేషన్ కార్డులు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. కానీ ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. వీటిని అడిగే వాళ్లు కచ్చితంగా ఉండాలి. అడిగేటోళ్లు ఉంటేనే సమస్యలు తీరుతాయి. ప్రభుత్వాలు మారినప్పటికీ మన పరిస్థితి మాత్రం మారటం లేదు. ఎందుకు మన పరిస్థితులు మారటం లేదో ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు. మన సమస్యల కోసమే మేము తిరుగుతున్నాం. పెన్షన్, రేషన్ కార్డులు ఇవ్వాలని అడిగే వాళ్లు ఒకరు ఉండాలి. ఆ అడిగే పనిని నేను తీసుకున్నా. ఇది ఓట్ల పోరాటం కాదు. సీట్ల కోసం ఆరాటం కాదు. ఓట్లు ఉన్నప్పుడే పార్టీల నాయకులు వస్తారు. కానీ ఓట్లు లేనప్పుడు కూడా జాగృతి మీతో ఉంటుంది. “

 ” నేను 20 ఏళ్లు బీఆర్ఎస్ నా పార్టీ, నా కుటుంబ పార్టీ అని పనిచేశాను. కానీ ఎందుకో కనికరం లేకుండా నన్ను సస్పెండ్ చేసి రోడ్డు మీద వేశారు. అయినా ఏమాత్రం భయపడలేదు. ఎందుకంటే ఉద్యమంలో కూడా రోడ్ల మీదే ఉండి పోరాటం చేశాం. మళ్లీ తెలంగాణ ప్రజల కోసం రోడ్లపై ఉండి పోరాటం చేస్తాను. చాలా మంది పార్టీ అండ లేదు. నువ్వు ఏం చేస్తావని అడిగారు. ఆడబిడ్డలు గట్టిగా అనుకుంటే ఏదైనా చేస్తారని నిరూపించేందుకే నేను పోరాటం చేస్తున్నా. నేను చేసేది తప్పు కాదు. బీద ప్రజల కోసం పంతం పట్టి ముందుకు పోతున్నా. అంత పెద్ద తండ్రి నీడ నా మీద లేదు. కానీ  తెలంగాణ ఆడబిడ్డల నీడ ఉందని నమ్మి ముందుకు వెళ్తున్నా. “

 ” తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు. వారి పాడె మనం మోశాం. 12 వందల మంది చనిపోతే 540 మందికి మాత్రమే సాయం చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్లు కనీసం వార్డు మెంబర్ కూడా కాలేని పరిస్థితి వచ్చింది. ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. గట్టిగా అడిగితే ఏదైనా అవుతుంది. అడిగే వాళ్లు కచ్చితంగా ఉండాలి. “

“ఇవ్వాళ మేము మేడ్చల్- మల్కాజ్ గిరి జనంబాటకు బయలుదేరాం. పొద్దున ఓ చెరువును సందర్శించాం. మేము వస్తున్నామని తెలిసి మూడు రోజులుగా చెరువును క్లీన్ చేస్తున్నారు. ఉప్పల్ లో రోడ్డు బాగాలేదని మాట్లాడితే అక్కడ పనులు మొదలు పెట్టారు. అందుకే అడిగేటోళ్లు ఉంటే కచ్చితంగా పనులు అవుతాయి. ఇప్పుడు మల్కాజ్ గిరి వెళ్తున్నాం. అక్కడ ఎన్నో ఏళ్లుగా రైల్వే బ్రిడ్జి పెండింగ్ లో ఉంది. మేము వెళ్లి అడిగిన తర్వాత కచ్చితంగా రైల్వే బ్రిడ్జి కూడా వస్తుంది. ఆర్పీలకు జీతాలు పెంచాల్సిన అవసరముంది. ఆశా వర్కర్లు మన ఆత్మీయులు. వారికి జీతాలు పెంచాలి. బతుకమ్మ చీరలను గ్రూప్ లలో లేని మహిళలకు కూడా ఇవ్వాలి. మహిళలకు రూ. 2500 ఇస్తామన్నారు. ఎవరికైనా వచ్చాయా? తులం బంగారం ఎవరికైనా వచ్చిందా? రూ.2500 ల కోసం కూడా పోరాటం చేస్తాం. అడిగితేనే ఎవరికైనా పనులు అవుతాయి. ఆటో డ్రైవర్లకు రూ. 12 వేలు, వారికి వెల్పేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆర్టీసీలో తొలగించిన వారిని వెంటనే రిక్రూట్ చేసుకోవాలి. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ ని కలిసి ఈ విషయం పై మాట్లాడాను. వారిని ఉద్యోగంలోకి తీసుకునే వరకు కూడా పోరాటం చేస్తాం.”