ఎస్టీపీ నిర్మాణం ఆపాలి – కల్వకుంట్ల కవిత | Stop the STP Construction

ఉప్పల్ భగాయత్ లో నిర్మాణంలో ఉన్న ఎస్టీపీని పరిశీలించిన కవిత

జాగృతి జనంబాటలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉప్పల్ భగాయత్ వద్ద నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ది కేంద్రం (ఎస్టీపీ) ని పరిశీలించారు.  ముందస్తు అభిప్రాయ సేకరణ జరపకుండా నిర్మిస్తున్న ఎస్టీపీ వల్ల స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని కవిత తప్పుపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను కవితకు విన్నవించారు.

“ఎక్కడో వేరే చోట మంజూరైన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) ఇక్కడ నిర్మిస్తున్నారు. దీంతో ఇక్కడి నాలుగు కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. 

ఈ ప్రాంతంలో నాలుగు ఎకరాలు ఖాళీ స్థలం ఉంది. ఐతే ఇక్కడ పార్క్, ఓపెన్ జిమ్, కమ్యునిటీ హాల్, లైబ్రరీ ఇలా ప్రజలకు ఉపయోగపడే వాటిని నిర్మించాల్సింది. కానీ ఎక్కడికో మంజూరైన ఎస్టీపీని ఇక్కడ నిర్మిస్తున్నారు. 

ఎస్టీపీలు కూడా అవసరమే. కానీ వాటిని కట్టే ముందు కాలనీ వాసులను అడగాలి. ఇప్పటికే ఇక్కడి ప్రజలు మూసీ కారణంగా బాధపడుతున్నారు. మళ్లీ ఎస్టీపీ తీసుకొచ్చి వారిని ఇబ్బంది పెట్టటం సరికాదు. ఇక్కడ ఉన్న వాళ్లంతా పేద, మధ్య తరగతి వాళ్లే. ఎంతో కష్టపడి ఇళ్లు కొనుక్కున్నారు. మూసీ, ఎస్టీపీ కారణంగా ఇక్కడ నేల, నీళ్లు, ఆరోగ్యం పాడవుతుందని వారంతా బాధపడుతున్నారు. వేరే చోట శాంక్షన్ అయిన ఎస్టీపీ ని ఇక్కడెందుకు నిర్మిస్తున్నారో చెప్పాలి.అసలు ఇక్కడ కనీసం భూ పరీక్షలైనా చేశారా? ఎందుకు ఇక్కడే ఎస్టీపీ నిర్మిస్తున్నారో వెల్లడించాలి.”

“ఎస్టీపీ నిర్మాణం  పనులు ఆపాలని మహిళలు అడిగితే వారిని నాలుగు పోలీస్ స్టేషన్ల చుట్టు తిప్పారంట. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? మహిళా పోలీసులు లేకుండా మహిళలను అరెస్ట్ చేసి నాలుగు స్టేషన్ తిప్పటం దారుణం. ఇది చాలా సీరియస్ విషయం. డీజీపీ గారు ఈ ఘటనపై విచారణ జరపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ అంశాన్ని వదిలిపెట్టను. తక్షణమే ఎస్టీపీ నిర్మాణం పనులను ఆపేయాలి. మున్సిపల్ శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారే కావటం మన ఖర్మ. 

ఆయన దొరకడు. సమస్య ఎవరికి చెప్పాలో అర్థం కాదు. 

మున్సిపల్ శాఖ కమిషనర్ ను కూడా కలిసి సమస్య వివరిస్తాం. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ప్రజావాణికి కాలనీ వాసులందరితో కలిసి వస్తాం. అప్పటికైనా సీఎం గారు మాట్లాడుతారో చూస్తాం. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లి పనులను ఆపించే ప్రయత్నం చేస్తాం. మూసీ ప్రక్షాళన కచ్చితంగా జరగాల్సిందే. కానీ అది ప్రజల ఆమోదంతో జరగాలి. జనం బాటలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలో పలు సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటి గురించి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అడిగే వాళ్లు ఉంటేనే ప్రభుత్వం పట్టించుకుంటుందన్న ఉద్దేశంతో మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.”