కరీంనగర్ లో తెలంగాణ జాగృతి జనంబాట

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కు మొదటి రోజు ఘనస్వాగతం. 

జనం బాటలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తేదీ 31-10-2025 శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఉదయం తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లి కొనుగోలు కేంద్రాన్నిపరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టును సందర్శించారు. అక్కడి మత్తడిని వెంటనే బాగు చేయించి రైతులకు మేలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హుజూరాబాద్ మండలం రాంపూర్ లో ఇటీవల బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థిని శ్రీవర్షిత కుటుంబాన్ని పరామర్శించి…అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. సాయంత్రం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ పట్టణానికి చేరుకున్నారు. జాగృతి శ్రేణులు.. బతుకమ్మలు, బోనాలు, ఒగ్గుడోలు, డప్పువాయిద్యాలతో ఆమెకు జాగృతి శ్రేణులు ఘనస్వాగతం పలికారు. 

మక్తపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన. 

వర్షాల కారణంగా ధాన్యం తడిసిన రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న కవిత. వారికి ప్రభుత్వం అండగా ఉండాలని…ఎకరాకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్. 

“మొంథా తుపాను కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడిగా కొనుగోళ్లు చేయటం లేదు. దానికి తోడు వర్షాల కారణంగా రైతు పరిస్థితి దయనీయంగా మారింది. మానవతా దృక్పథంతో ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. ఎకరాకు రూ. పదివేలు పరిహారం ఇస్తామంటే ఏ మూలకు సరిపోదు. 

రైతులకు మేలు జరగాలంటే ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలి. మొలకెత్తిన, బూజు పట్టిన, తేమ శాతం ఎక్కువ ఉన్న సరే ధాన్యం కొనుగోలు చేయాలి. కరీంనగర్ లోని తిమ్మాపూర్ మండలం మక్తాపల్లి గ్రామంలో ఉన్నాం. 

ఇక్కడ కొనుగోలు కేంద్రంలో రైతులు ధాన్యాన్ని నెల రోజులుగా ఉంచారు. రాత్రి పడ్డ వానకు ధాన్యమంతా తడిసి ముద్దైంది.  ఇప్పటి దాకా వాళ్లు చాట్లతో ఎత్తుకున్న పరిస్థితి. ఇది చాలా దారుణం, బాధాకరం. నెల రోజులుగా ధాన్యం కుప్పలు పోసి ఉంచారు. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం కారణంగా ధాన్యమంతా తడిసి పోయింది. వర్షాల కారణంగా ఇంకా నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ధాన్యానికి మెులకలు వస్తున్నాయి. మొత్తం దారుణంగా తడిసి పోయింది. ఇలాంటి సందర్భంలో తేమ శాతం 17 కన్నా తక్కువ ఉండాలని మిల్లర్లు కండిషన్లు పెడుతున్నారు. 

అది సాధ్యపడదు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఇప్పటి వరకు అసలు కొనుగోలు కేంద్రాలే ఎందుకు ప్రారంభించలేదని కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నా. అసలు ఐకేపీ సెంటర్లు లేకుండా డైరెక్ట్ గా ధాన్యం మిల్లర్లే కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఐకేపీ సెంటర్ల నుంచి మిల్లర్ల వద్దకు ధాన్యం తీసుకెళ్లేందుకు రైతులకు అదనంగా ఖర్చు అవుతోంది. తేమ శాతం ఎక్కువ ఉన్న, బూజు పట్టిన, మొలకలు వచ్చిన సరే ధాన్యం కొనుగోలు చేసేలా మిల్లర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. భూమి దస్తావేజులు లేవంటూ కౌలు రైతుల ధాన్యం కొంటలేరని చెబుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రైతులను ఇబ్బంది పెట్టటం సరికాదు. వారి ధాన్యం కొనేలా వెసులుబాటు ఇవ్వండి.

అదే విధంగా కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలి. ఇక వర్షాల కారణంగా చాలా జిల్లాల్లో వరి మొత్తం ఒరిగిపోయింది. అసలు కోసే పరిస్థితి కూడా లేదు. వాటికి సంబంధించిన నష్టాన్ని కూడా ప్రభుత్వం రైతులకు చెల్లించాలి. ఇప్పటి వరకు పంట నష్టం అంచనా వేయలేదు. ప్రభుత్వం, కలెక్టర్, అధికారులు ఏం చేస్తున్నారు?

వెంటనే ఫీల్డ్ లోకి వచ్చి పంట నష్టం అంచనా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మొంథా తుపాను పై రివ్యూ చేసి…పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పొట్టకు వచ్చి కోత వచ్చిన పంటకు రూ. 10 వేలు ఏ మూలకు సరిపోతుంది? రైతులకు నష్టం జరగకుండా ఉండాలంటే ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలి. లేదంటే రైతుల పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఇప్పటికే బీహర్ లో ఎన్నికల కారణంగా కూలీలు రావటం లేదు. దీంతో రైతులు అదనపు కూలీ చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇస్తామన్న బోనస్ ఇవ్వలేదు. పైగా వర్షాలతో పంట నష్టం జరుగుతోంది. 

రైతుకు అన్ని రకాలుగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. 

డైరెక్ట్ గా మిల్లర్లే ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి”. అన్నారు. 

శంకరపట్నం మండలంలో కొట్టుకుపోయిన కల్వల మత్తడి పరిశీలన

కల్వల మత్తడి కొట్టుకుపోయిన కారణంగా మూడేళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్ట్ ను సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ మత్తడిని బాగు చేయించాలని డిమాండ్ చేశారు. 

“శంకరపట్నం మండలంలోని కల్వల మత్తడి కొట్టుకుపోయి 3 ఏండ్లు అవుతోంది. దీని రిపేర్ కోసం గత ప్రభుత్వమే రూ. 70 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. కానీ తర్వాత ప్రభుత్వం మారటంతో పనులు జరగటం లేదు. 

ఈ మత్తడిని రిపేర్ చేయించాలని హుజురాబాద్, మానకొండూరు ఇద్దరు ఎమ్మెల్యేలను కోరుతున్నా. మానకొండూరు లో మత్తడి ఉంటే హుజురాబాద్ లో నీళ్లు పారుతున్నాయి. దీంతో ఈ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యే లు ఒకరు రిపేర్ చేయిస్తే ఒకరికి పేరు వస్తదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 6 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్ట్ పై వందలాది రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి. గతంలో ఇచ్చిన రూ. 70 కోట్ల జీవో ను పాస్ చేయాలి. రాజకీయాలకు సంబంధం లేకుండా రైతుల బాగు కోసం మత్తడి పనులను తొందరగా బాగు చేయాలి. రైతు లేనిదే రాజ్యం లేదని అంటాం. దాన్ని నిజం చేయాలంటే రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. గతంలో కట్ట తెగినప్పుడు అప్పటి ప్రజాప్రతినిధులు స్పందించి తొందరగా దీన్ని బాగు చేయించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా మత్తడి బాగు చేయించాలి. 

మొంథా తుపాను కారణంగా తెలంగాణ మొత్తం రైతులు నష్టపోయారు. కానీ ముఖ్యమంత్రి గారు వరంగల్, ఖమ్మం రైతులకు మాత్రమే ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామన్నట్లుగా విన్నాం. కానీ శంకరపట్నంలో కూడా వరి రైతులు నష్టపోయారు. వారికి కూడా పరిహారం ఇవ్వాలి. ఎకరాకు రూ. 10 వేలు కాదు. ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలి. దాదాపు చేతికొచ్చిన పంట రైతులు నష్టపోయారు. ఇప్పుడు పంట కోసిన కూడా 25 శాతం వచ్చే పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వం రైతుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. కలెక్టర్ గారు చొరవ చూపి అధికారులను ఫీల్డ్ కు పంపించి పంట నష్టం లెక్కలు తీయాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా కేంద్రం తరఫున రైతులకు పంట నష్టం పరిహారం ఇప్పించాలి. కల్వల మత్తడి రిపేర్ కోసం సీఎం గారితో ఎంపీ గారు మాట్లాడాలి. అటు ఈ ప్రాజెక్ట్ మీదనే దాదాపు 180 ముదిరాజ్ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 

వారికి ఇదే జీవనాధారం. వెంటనే మత్తడి బాగు చేయించి వారిని ఆదుకోవాలి. ఇప్పటికే సాంక్షన్ అయిన డబ్బులను తీసుకొచ్చి పనులు చేయించటమే. మానకొండూరు, హుజురాబాద్ ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని పనులు చేయించాలి.” అని డిమాండ్ చేశారు.

బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో అనుమానాస్పదంగా చనిపోయిన విద్యార్థిని కుటుంబానికి పరామర్శ

బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో అనుమానాస్పదంగా చనిపోయిన హుజురాబాద్ మండలం రాంపూర్ కు చెందిన శ్రీవర్షిత  కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు పరామర్శించారు. విద్యార్థిని మృతి పై అనుమనాలను ఉన్నాయని ఆరోపించారు. వెంటనే స్పెషల్ ఎంక్వైరీ లేదంటే సిట్ వేయాలని డిమాండ్ చేశారు. 

“పీవీ గారి ఊరు వంగరలో బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో ఉంటూ చదువుతున్న శ్రీ వర్షిత అనుమానాస్పదంగా చనిపోయింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రభుత్వం, స్కూల్ వాళ్లు సూసైడ్ చేసుకుందని చెబుతున్నారు. కానీ చనిపోవటానికి గంట ముందు కూడా శ్రీవర్షిత తమతో మాట్లాడిందని తల్లితండ్రులు చెబుతున్నారు. గంటన్నరలోనే ఇన్సిడెంట్ జరిగింది. టీచర్లు, పోలీసులు అసలు ఏమీ చెప్పలేదు. కనీసం అంబులెన్స్ ను కూడా పిలిపించకుండా పంపించారు. ఇంత మానవతా దృక్పథం లేకుండా వ్యవహరిస్తారా? కచ్చితంగా ఇందులో ఏదో కుట్ర ఉంది. ఎంక్వైరీ చేయాల్సిన అవసరముంది. ఎన్నిసార్లు మాట్లాడిన సరే శ్రీ వర్షిత తల్లితండ్రులు మాత్రం ఒకటే చెబుతున్నారు. మా దుఖం, బాధ వేరే ఎవరికీ జరగకూడదని కోరుకుంటున్నారు. న్యాయం జరగాలని అంటున్నారు. అసలు ఏం జరిగిందో తెలియాల్సి ఉంది.  సంఘటన జరిగి 8 రోజులైనా ఒక పోలీసాఫీసర్ గానీ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ అధికారులు గానీ ఎమ్మార్వో గానీ రాలేదు. ఏం జరిగిందో వివరాలు చెప్పలేదు. ఎంక్వైరీ చేయటం లేదు. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.  మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సొంత నియోజకవర్గం ఇది. నేను చూసుకుంటా అని ఆయన స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కనీసం పట్టించుకోలేదు. గత ఏడాదిన్నరగా నేను చెబుతూనే ఉన్నా. వేల్పేర్ హాస్టల్ లో పిల్లలు పిట్టల్లాగ రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇదే జిల్లాలో ఇంకొక బాబు సూసైడ్ కు ప్రయత్నించిన పరిస్థితి. గర్ల్స్ హాస్టల్ లో సీసీ టీవీ కెమెరాలు పెడితే ఎంత దారుణం జరిగిందో చూశాం.  పేద పిల్లలు చదువుకునే స్కూల్స్ అంటే ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయింది.  వాళ్ల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుంది. మోసం చేయవద్దు, మభ్య పెట్టవద్దు. శ్రీ వర్షిత విషయంలో ఏం జరిగిందో ప్రభుత్వం కచ్చితంగా స్పష్టం చేయాలి. శ్రీ వర్షిత చదువుల్లో ఫస్ట్, స్కూల్ లీడర్ గా ఉంది. కలెక్టర్ తో అవార్డులు పొందింది. ఐఏఎస్, ఐపీఎస్ అవుతా అనే గోల్ పెట్టుకొని చదువుతుంది.