Telangana Jagruthi president interacts with patients at CHC Tungaturthi

కేసీఆర్ చేత శంకుస్థాపన-పనులింకా పెండింగే -కల్వకుంట్ల కవిత | తుంగతుర్తి

జాగృతి జనంబాటలో భాగంగా శనివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూర్యాపేట జిల్లా

తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని కమ్యునిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న వంద పడకల ఆస్పత్రని పరిశీలించి నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి కారణాలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వాలు మారినా పనులు కాలేదు

“తుంగతుర్తిలో40 ఏళ్లుగా 30 పడకల హాస్పిటలే ఉంది. దీన్ని వంద పడకల హాస్పిటల్ గా మారుస్తామని 2018 లో కేసీఆర్ వచ్చి మాట ఇచ్చారు. కానీ 2022 వరకు కూడా మొదలు, మోక్షం లేకుండా ఉండిపోయింది. 2022 లో జీవో ఇచ్చి అప్పటి హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా వచ్చి మళ్లీ శంకుస్థాపన చేశారు. రెండు సార్లు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు మాత్రం పూర్తి కాలేదు. కేసీఆర్ హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు హాస్పిటల్ నిర్మాణం పెండింగులో ఉంది. పైగా ఉన్న హాస్పిటల్ ను సగానికి కూలగొట్టారు. దీంతో వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆరు మండలాల ప్రజలకు సరైన వైద్య సదుపాయం లేని పరిస్థితి వచ్చింది. నెలకు రెండు డెలివరీలు మాత్రమే ఇక్కడ జరుగుతున్నాయి. విధి లేని పరిస్థితుల్లో ప్రజలంతా ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్తున్నారు. వీలైనంత తర్వగా ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.”