మిస్టర్ డీజీపీ..మీ ఇంటి ఆడవాళ్లను తిడితే ఇలాగే వదిలేస్తావా
నన్ను అసభ్యంగా కామెంట్ చేసిన పోలీస్ ను అరెస్ట్ చెయ్యి
పరీక్ష పాసయ్యావా.. రికమండేషన్ తో డీజీపీ అయ్యావా
అధికారం కోసం ఉద్యమకారులను మోసం చేసిన రేవంత్ రెడ్డి
అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణీత కాల వ్యవధితో కూడిన స్పష్టమైన హామీ ఇవ్వాలి
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్):
సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన పోలీస్ కానిస్టేబుల్ ను రాష్ట్ర డీజీపీ కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవటంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ నుంచి రిమూవ్ చేయకుండా కేసు పెట్టకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. అసలు పరీక్ష పాసయ్యే ఆయన డీజీపీ అయ్యారా? ఆయనకు చట్టం తెలుసా అని కవిత నిలదీశారు. వెంటనే కానిస్టేబుల్ పై చర్యలు చేపట్టకుంటే అంతర్జాతీయ వేదికల్లో ప్రభుత్వం పరువు తీస్తానని హెచ్చరించారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం రేవంత్ రెడ్డి ఉద్యమకారులను వాడుకొని మోసం చేశాడని కవిత అన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో వారికి నిర్ణీత కాల వ్యవధితో కూడిన స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పరీక్ష పాసయ్యే డీజీపీ అయ్యారా?
సోషల్ మీడియాలో తనను అసభ్యంగా దూషించిన కానిస్టేబుల్ పై వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అంత అసభ్యంగా కామెంట్లు చేసిన వ్యక్తిని కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటారా అని ప్రశ్నించారు. అతనిపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 356, సెక్షన్ 79, ఐటీ చట్టాలు ఏం చెబుతున్నాయో డీజీపీ చదువుకోవాలని సూచించారు. మహిళలను ఒక్క పదం అసభ్యంగా మాట్లాడినా సరే 3 ఏళ్ల పాటు శిక్ష వేసేలా చట్టాలు ఉన్నాయని అవి డీజీపీకి తెలియదా అంటూ కవిత నిలదీశారు. అసలు డీజీపీ పరీక్ష పాసయ్యే పోలీసు అధికారి అయ్యాడా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. 20 ఏళ్లు ప్రజా జీవితంలో ఉండి, ఎంపీగా ఎమ్మెల్సీ, ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తనకే రక్షణ లేకపోతే…సాధారణ మహిళలకు ఏం రక్షణ ఇస్తారని నిలదీశారు. మీకు కూడా ఇద్దరు కోడళ్లు ఉన్నారు. వారిని కూడా ఇలాగే కామెంట్లు చేస్తే వదిలేస్తారా అంటూ కవిత ప్రశ్నించారు. ఈ విషయంలో డీజీపీ బాధ్యత లేకుండా సెన్సిబులిటీ లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే కానిస్టేబుల్ పై కేసు పెట్టి చర్యలు తీసుకోకపోతే అంతర్జాతీయ వేదికల్లో ప్రభుత్వం పరువు తీస్తానని కవిత హెచ్చరించారు. ఇప్పుడున్న డీజీపీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందని కవిత అన్నారు. ఖమ్మం వెళ్లి స్వయంగా డీజీపీయే రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ పెరిగిందంటూ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. గంజాయి స్మగ్లింగ్ ను అరికట్టాల్సిందెవరంటూ కవిత ప్రశ్నించారు. అటు హేట్ స్పీచ్ ను అరికట్టేందుకు ముఖ్యమంత్రి తీసుకొస్తామని చెప్పిన బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తేవాలన్నారు.
ఉద్యమకారులకు నిర్ణీత కాలవ్యవధితో కూడిన వాగ్దానం చేయాలి
అధికారంలోకి రావటానికి తెలంగాణ ఉద్యమకారులను రేవంత్ రెడ్డి ఉపయోగించుకున్నారని కవిత అన్నారు. ఎన్నికలకు ముందుకు దాదాపు వాళ్ల కాళ్లు పట్టుకున్నంత పనిచేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధమే లేని రేవంత్ రెడ్డి ఉద్యమకారులు నమ్మలేదని కవిత అన్నారు. ఆయన పక్కన కోదండరాం సర్ ను చూసి రేవంత్ రెడ్డిని నమ్మారన్నారు. కానీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా వారికి చీమకాలంత పనికూడా చేయలేదని విమర్శించారు. ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు చేసిన ఉద్యమకారులు ఇంకా వాళ్లకు ఇచ్చిన హామీల కోసం ఉద్యమాలు చేయాలా అని ప్రశ్నించారు. ఇక వారికి ఆమరణ దీక్ష ఒక్కటే మిగిలిందన్నారు. ఉద్యమకారుల కోసం తాము భూపోరాటం చేస్తే ఉద్యమకారులపై లాఠీలు ఝుళిపించారని కవిత గుర్తుచేశారు. ఉద్యమకారుల జీవితాలు ఇప్పటికే ఆగమాయయ్యాని వారిపై లాఠీలు ఝుళిపిస్తే లాభమెంటనీ ప్రశ్నించారు. తెలంగాణ జన సమితి తరఫున ఉద్యమకారులకు ఐడెంటీ కార్డులు ఇచ్చిన కోదండరాం సార్ వాటినే ఇప్పుడు ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలన్నారు. ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారని ఉద్యమకారులకు మేలు చేయాలని కోరారు. కేకే కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా ఉద్యమకారులకు మేలు చేసే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇప్పటికే ఎంతో మంది ఉద్యమకారుల డేటా ప్రభుత్వం వద్ద ఉందని కవిత అన్నారు. ఉద్యమకారులకు మేలు చేసేలా నిర్ణీత కాలవ్యవధితో కూడిన వాగ్దానాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చేయాలన్నారు. లేదంటే కాంగ్రెస్ నేతలను రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
బీసీల కోసం కాంగ్రెస్ ధర్నాలు చేస్తామనటం జోక్
రాష్ట్రంలో బీసీలను మోసం చేసిన పార్టీయే కాంగ్రెస్ అని కవిత అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి వారి జనాభాను తక్కువ చేసి చూపిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టినట్టే పెట్టి ఆ బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవటం లేదన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే కార్యక్రమం కాంగ్రెస్ ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. కేంద్రం చేపట్టిన కులగణనలో స్పెసిఫిక్ గా కులం అనే కాలం ఉండాలని తాము డిమాండ్ చేస్తున్నామని కవిత అన్నారు. ఐతే బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు కేంద్రంపై వంద రోజుల కార్యాచరణతో ఆందోళన చేస్తామని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. అటు అసెంబ్లీ ప్రజా సమస్యలు చర్చకు రాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు నాటకాలు ఆడుతున్నాయంటూ కవిత విమర్శించారు.








