రాజీనామా చాలదు..సంస్కరణలు తేవాలి
విద్యార్థులకు నిజమైన న్యాయం జరగాలి
విద్యార్థులపై దాడికి దిగిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :
విద్యార్థుల ఆందోళనకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా శాశ్వత పరిష్కారం కాదవి ఈ వ్యవస్థలో సంస్కరణలు తేవాలని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయటంపై కవిత స్పందించారు. విద్యార్థుల ప్రొటెస్ట్ కారణంగానే కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేవలం కేంద్ర మంత్రి రిజైన్ చేస్తే సరిపోదని కవిత ఎక్స్ లో పోస్ట్ చేశారు. పేపర్ లీకేజీ సంక్షోభాలకు ఇది ఎంత మాత్రం పరిష్కారం కాదన్నారు. కేవలం బీజేపీకి జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకే కేంద్రమంత్రి తో రాజీనామా చేయించారని చెప్పారు. విద్యార్థులకు నిజంగా న్యాయం జరగాలంటే మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థాగత సంస్కరణల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందన్నారు. యూపీఎస్సీ తరహాలోనే ఎన్టీఏకు కూడా చట్టబద్ధమైన స్వతంత్రత ఇవ్వాలన్నారు. భవిష్యత్ లో పేపర్ లీకేజీలను అరికట్టేందుకు అత్యంత కఠినమైన చట్టాలను తీసుకురావాలని కవిత కోరారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు. వీటన్నింటికి తోడు ఈనెల 20న విద్యార్థులపై పాశవికంగా పోలీసులు జరిపిన దమనకాండపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లాఠీఛార్జీకి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవల్సిందేనన్నారు. అప్పుడు మాత్రమే విద్యార్థులకు జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుందని చెప్పారు. కేవలం కేంద్రమంత్రితో రాజీనామా చేయించి కంటితుడుపు చర్యలు చేపడతామంటే ఊరుకునేది లేదని కవిత హెచ్చరించారు.








