సింగరేణి యాజమాన్యం కుట్రను ఎండగడుతాం
రెండువేల మంది కార్మికుల వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమిస్తాం
సింగరేణి ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తాం
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణ సేన, బంజారాహిల్స్)
సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహణ అస్తవ్యస్తంగా సాగిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. 2 వేల మంది కార్మికులు మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తుంటే కేవలం 120 మంది కార్మికుల పేర్లు మాత్రమే ప్రకటించిందని తెలిపారు. అందులోనూ 28 మంది కార్మికులకు తమను మెడికల్ బోర్డుకు పిలిచారనే సమాచారం కూడా లేదని వెల్లడించారు. మెడికల్ బోర్డుకు పిలిచిన వారిలో కేవలం 20 శాతం మందినే అన్ ఫిట్ చేశారని కవిత వివరించారు. సింగరేణిలో మెడికల్ అన్ ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న 2 వేల మంది కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇచ్చేవరకు టీఆర్ఎస్ ఉద్యమిస్తుందని ఆ పార్టీ చీఫ్ ప్రకటించారు. మెడికల్ బోర్డు నిర్వహించకుంటే నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని తాము హెచ్చరించడంతో ప్రభుత్వం రెండు రోజుల పాటు నామమాత్రంగా మెడికల్ బోర్డు నిర్వహించిందని చెప్పారు. సింగరేణిని కాపాడాలని, కార్మికులకు మంచి చేయాలని.. వారికి భరోసా ఇవ్వాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
ఎమ్మెల్యేలూ..సిగ్గుపడండి
కాంట్రాక్టర్ల నుంచి వచ్చే కమీషన్లకు సీఎం, డిప్యూటీ సీఎం కక్కుర్తి పడి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని కవిత ఆరోపించారు. గతంలో మాదిరిగానే అన్ ఫిట్ ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డారు. కార్మికులకు అన్యాయం జరుగుతుంటే సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మీరు మీ ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకుంటరో.. బతిమాలుకుంటరా అనేది మీరే నిర్ణయించుకోవలని, ప్రతినెలా రెండు సార్లు మెడికల్ బోర్డు పెట్టించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలను నిలదీయాలని హెచ్ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన క్యాడర్ కు పిలుపునిచ్చారు. కార్మికులకు తెలంగాణ రక్షణసేన ఎల్లవేళలా అండగా ఉంటుందని కవిత హామీ ఇచ్చారు.








