ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కరిస్తాం- ఇదే మా విధానం

 -కల్వకుంట్ల కవిత

తెలంగాణ జాగృతిలో చేరిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, ఆయన అనుచరులు

(తెలంగాణ జాగృతి కార్యాలయం-బంజారాహిల్స్)

రాసి పెట్టుకోండి…తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజు ఏప్రిల్ 25..కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను ఈ గడ్డకు పరిచయం చేస్తాం. ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కరిస్తామంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ధీమా వ్యక్తం చేశారు. నడిగడ్డ హక్కుల పోరాటసమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, ఆయన అనుచరులు బుధవారం తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్ల్ లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యమంలో కవిత మాట్లాడుతూ పప్పన్నం తింటాం, ప్రజల మధ్యలో ఉంటాం. వారితోనే కలిసి పనిచేస్తామని ప్రకటించారు. సామాన్యుల చేత, సామాన్యుల కొరకు, సామాన్యులే ఉండే రాజకీయం తెస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. ప్రజల సమస్యల గురించి ప్రశ్నించేది  కేవలం జాగృతియే అనే మాట ప్రతినోటా వినబడుతున్నదన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా సరే కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంగా మారిందని కవిత దుయ్యబట్టారు. రియల్ ఎస్టేట్, హైడ్రా పేరుతో బెదిరిస్తూ ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తున్నదని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఫోన్ చేస్తే ఫోన్ లో మాట్లాడేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి నిలబడే మాట్లాడుతున్నాడని ఎద్దెవా చేశారు. లేదంటే తన కుర్చీకి ఎక్కడ ఎసరు వస్తుందోనని భయపడుతున్నాడని చెప్పారు. ప్రజల సమస్యల గురించి అడిగితే నో రాహుల్ జీ అని ఆయనకు సమాధానం చెబుతున్నాడని, కానీ కేరళం ఎన్నికలకు మనీ కావాలంటే మాత్రం ఎస్ రాహుల్ జీ అంటూ గులాంగిరీ చేస్తున్నారని విమర్శించారు. అప్పర్ భద్రకు కేంద్రం జాతీయ హోదా ఇస్తే రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాడని కవిత ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే మనకు స్వయం పాలన వస్తుందని భావించామని, కానీ ఢిల్లీ పాలన వచ్చిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రైతు భరోసా వేయలేదు, ఋణమాఫీ సగం కూడా చేయలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను తీవ్రంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. కానీ తెలంగాణలో అన్ని చేశామంటూ ఈ ముఖ్యమంత్రి కేరళంకు వెళ్లి చెప్పుకుంటున్నాడని విమర్శించారు. 

 జాతీయ హోదా కారణంగా తుంగభద్రకు నీళ్లు రాక నష్టపోయేది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాయేనని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ బీజేపీని ఒక్క మాట కూడా ఈ ముఖ్యమంత్రి అనటం లేదని తప్పుబట్టారు. అటు కాంగ్రెస్ ను, ఇటు బీజేపీని మెయింటెయిన్ చేస్తూ ప్రజలను మాత్రం మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ జాగృతి తరఫున వచ్చే పార్టీ…ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో నిపుణులతో సమావేశమై ప్రజల కోసం అద్భుతమైన అజెండా రూపొందిస్తున్నామని వెల్లడించారు. కొత్త తరహా రాజకీయాలు, ప్రజల కోసం చేసే రాజకీయాలు ఎలా ఉంటాయో చూపిస్తామని కల్వకుంట్ల కవిత తెలిపారు.

గడీల పాలనకు గండి కొట్టాలి

వెలుగుమట్లలో చేసిన పోరాటం మాదిరిగానే ఇంకా మూడేళ్ల పాటు పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ ఎంతో కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి అని, అందుకే ప్రజల కోసం పోరాటం చేసేందుకు జాగృతి పెట్టబోయే పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించామని కవిత వెల్లడించారు. ఇవ్వాళ మా ఆహ్వానం మన్నించి తుంగభద్ర ప్రవాహం మాదిరిగా మీరంతా ఇక్కడకు వచ్చారని, గద్వాల్ గడీలో టేకేదార్లు పోయి ఉద్యమకారుల జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. 70 ఏళ్ల గడీల పాలనలో కేతిదొడ్డి, గట్టు, ఐజా మండలాలు వెనుకబాటుతనంలో పోటీ పడుతున్నాయని కవిత చెప్పారు. చేనేతలు, సీడ్ పత్తి విత్తనాల రైతులు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. రైతు సంఘర్షణ సభలో మేము సీడ్ పత్తి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే ఇప్పటి కూడా వారికి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేదని చెప్పారు. డీకే అరుణమ్మ కి సంబంధించి అలీబాబా చాలీస్ చోర్ అన్నట్లు 40 మంది ఏజెంట్లు రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన ఆర్డర్లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తున్నదని దుయ్యబట్టారు. వెంటనే వారికి ఇచ్చే ఆర్డర్లు, నూలు, రంగులు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జాగృతి తరఫున మొన్న సింహం గుర్తుతో పోటీ చేస్తే మొట్టమొదటి విజయం ఇచ్చింది గద్వాల్ జిల్లానే అని కవిత గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ మొట్టమొదటగా గెలిచేది తమ్ముడు రంజిత్ అని ధీమా వ్యక్తం చేశారు. బహుజనులు, ఉద్యమకారులకు రాజకీయాల్లో అవకాశాలు రావటం లేదని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను కూడా మోసే అచేతన స్థితిలో బీఆర్ఎస్ ఉందని ఎద్దెవా చేశారు. బహుబలి కట్టప్పను ఎందుకు చంపాడో ఎంత సస్పెన్స్ క్రియేట్ చేసిందో…ఇప్పుడు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడన్నది కూడా అంతే సస్పెన్స్ గా ఉందన్నారు. గద్వాల్ లో చేనేత సమస్యలు, సీడ్ పత్తి రైతుల సమస్యలపై మాట్లాడేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల కోసం జాగృతి మాత్రమే పనిచేస్తుందని మీకు భరోసా ఇస్తున్నానని స్పష్టం చేశారు. రంజిత్ తమతో పాటు ఐదు నెలలుగా పనిచేస్తున్నాడని, ఏ సమయంలోనైనా ఏలా స్పందిస్తామో ఆయనకు తెలుసని చెప్పారు. ఇప్పుడు మీరంతా కూడా జాగృతి మనుషులు, మీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకునే బాధ్యత నాదేనంటూ కవిత భరోసా ఇచ్చారు.

కవితక్క కమిట్ అయితే ఎంత కష్టమైనా లెక్కచేయరు

కవితక్క ఒక్కసారి కమిట్ అయింతే ఎంత కష్టమైనా సరే లెక్క చేయరని నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగొళ్ల రంజిత్ కుమార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాదం వినిపిస్తూ ప్రజల కోసం ఫైట్ చేస్తున్న కవితక్కను బీఆర్ఎస్ నుంచి కుట్ర చేసి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదు నెలలుగా కవిత గారి కమిట్ మెంట్ చూస్తున్నానని మాట ఇస్తే ఎంత కష్టమైనా సరే అండగా ఉంటారని చెప్పారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లే సత్తా ఆమెకు ఉందన్నారు. తనకు కవితక్క దేవుడు ఇచ్చిన అక్క అని… ఆమె కోసం నిజాయితీగా చిత్తశుద్ధిగా పనిచేస్తానని చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జాగృతి జెండాను ప్రతి గ్రామానికి తీసుకెళ్తామన్నారు.