• రిజిస్ట్రేషన్ల రెన్యూవల్ కు 150 క్రెడిట్ పాయింట్ల విధానం రద్దు చేయాలి
  • నర్సులకు కనీస వేతనం రూ.20 వేలు అమలు చేయాలి

-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

(హైదరాబాద్)

నర్సింగ్ సిబ్బంది మనో వేదనను అర్థం చేసుకోవాలని, క్రెడిట్ పాయింట్ల పేరుతో వారిని వేధింపులకు గురి చేయొద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. క్వాలిఫైడ్ నర్సుల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ కు ఐదేళ్లలో 150 క్రెడిట్ పాయింట్లు సాధించి ఉండాలని కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఈ నిబంధనలు తెచ్చిన తర్వాత తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ వాటిపై కనీస అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయలేదని గుర్తు చేశారు. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో 80 వేల మంది నర్సింగ్ సిబ్బంది తమ రిజిస్ట్రేషన్ల రెన్యూవల్ కు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

క్వాలిఫైడ్ నర్సులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి ఐదేళ్లలో 150 గంటల కంటిన్యూయింగ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ క్రెడిట్ అవర్స్ కలిగి ఉండాలనే నిబంధన తెచ్చినట్టు కూడా చాలా మందికి అవగాహన లేదన్నారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనపై తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ అవగాహన కల్పించలేదని తనను కలిసిన పలువురు నర్సింగ్ సిబ్బంది వాపోయారని తెలిపారు. 150  రిజిస్ట్రేషన్లు రెన్యూవల్ చేస్తామంటూ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ ఉత్తర్వులు ఇవ్వడం పూర్తిగా ఏకపక్షమే అని విమర్శించారు. నర్సింగ్ కేవలం వృత్తి మాత్రమే కాదు సేవ చేయడమని కవిత స్పష్టం చేశారు. రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజల ప్రాణాల రక్షణ కోసం సేవలందించే నర్సింగ్ సిబ్బంది రిజిస్ట్రేషన్ల రెన్యూవల్ విషయంలో ఇలాంటి కఠిన నిబంధనలు సరికాదన్నారు.

ఉద్యోగాలు చేస్తూ నర్సింగ్ సిబ్బంది నెలకు కనీసం రెండు కాన్ఫరెన్సులకు హాజరయితే తప్ప నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల మేరకు క్రెడిట్ పాయింట్స్ సాధించడం సాధ్యం కాదని కవిత చెప్పారు. కరోనా కాలంలో నర్సింగ్ కాన్ఫరెన్స్ లు నిర్వహించలేదనే విషయం తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ కు తెలియదా అని ప్రశ్నించారు. ఐదేళ్లకు 150 క్రెడిట్ పాయింట్ల విధానంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న నర్సులకు కనీస వేతనం రూ.20 వేలు అమలు చేస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. నర్సింగ్ సిబ్బందిపై వేధింపులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కవిత హెచ్చరించారు.