పాలమూరు ప్రాజెక్టుకు దెబ్బ పెట్టిందే అతను | కేసీఆర్ ను సీఎం తిడితే రక్తం మరుగుతున్నది
తెలంగాణ నాయకులకు మాత్రం ఎందుకు ఆ చిత్తశుద్ధి లేదు | హైదరాబాద్
స్వార్థ రాజకీయాల కోసం ప్రాజెక్టుల పనులు పెండింగులో పెట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర ప్రజల కడుపులు మాడుస్తున్నారని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పరస్పర దూషణల కోసమే అసెంబ్లీ సమావేశాలను పరిమితం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రాజెక్టులకు సమస్యలు తెచ్చి పెట్టిన హరీశ్ రావుకే బీఆర్ఎస్ అసెంబ్లీ పగ్గాలు ఇవ్వడం దౌర్భాగ్యమన్నారు. కేసీఆర్ ను టెర్రరిస్ట్ తో పోల్చుతూ రేవంత్ చేసిన విమర్శలకు తన రక్తం మరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం కవిత మాట్లాడారు.
“ఉద్యమ నాయకుడు కేసీఆర్ ను కసబ్ లాంటి టెర్రరిస్ట్ తో పోల్చటం సరికాదు. రాళ్లతో కొట్టాలి, ఉరి తీయాలంటూ మాట్లాడటమంటే అవి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాటల మాదిరిగా లేవు. కేసీఆర్ కూతురుగా రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలకు నా రక్తం మరుగుతోంది. కేసీఆర్ గారి ఉద్యమ ఫలితంగానే తెలంగాణ సాధించుకున్నాం. అలాంటి రాష్ట్రానికే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అలాంటి వ్యక్తి కేసీఆర్ పై చేసే విమర్శలు సరికాదు. ఆరోపణలు చేస్తున్న వారి నోళ్లు మూతపడేలా కేసీఆర్ గారు చేయాలి. కేసీఆర్ గారి చిత్తశుద్దిని శంకిస్తున్నారు. అందుకే నేను కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. జూరాల నుంచి శ్రీశైలం కు ఇన్ టేక్ పాయింట్ ఎందుకు మార్చారో ఆయనకే బాగా తెలిసి ఉంటుంది. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ ను భగవంతుడు కూడా కాపాడలేడు. బబుల్ షూటర్ లాంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి జవాబు చెప్పిస్తే ప్రజలకు అర్థం కాదు. అసలు బబుల్ షూటర్ వల్లే ట్రబుల్ వచ్చింది. బబుల్ షూటర్ కారణంగానే మొదటి ప్యాకేజీకి దెబ్బ పడ్డది. ఆయన కారణంగానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో పడింది. ఇంకా అలాంటి వాళ్లకే పెత్తనం ఇచ్చి వారితో సమాధానం చెప్పిస్తున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి. అనుకోకుండా అందలం ఎక్కిన వ్యక్తితో కేసీఆర్ గారు మాటలు పడాల్సిన అవసరమేముంది? తెలంగాణ సీఎం తన మాటతీరు మార్చుకోవాలి. తెలంగాణ పౌరుషాన్ని సూచించేలా ఆయన మాటతీరు లేదు. కేసీఆర్ గారిని టెర్రరిస్టుతో పోల్చటమంటే మీరు దేశ ద్రోహం చేస్తున్నట్లే.”

చిత్తశుద్ధి లేని కాంగ్రెస్, బీఆర్ఎస్
” పాలమూరు-రంగారెడ్డి ద్వారా గత 12 ఏళ్లలో ఒక్క ఎకరం నీరు కూడా ఇవ్వలేదన్నది నూటికి వెయ్యి శాతం వాస్తవం. ప్రాజెక్టును 10 ఏళ్లు బీఆర్ఎస్ సాగదీసిందంటూ ముఖ్యమంత్రి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మాట్లాడితే పాలమూరు బిడ్డను అని ప్రగల్భాలు పలికే సీఎం ఎందుకు నీళ్లు ఇవ్వలేదు. పాలమూరు-రంగారెడ్డికి లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుందాం. భీమా, నెట్టెంపాడు, సుందిళ్ల, కల్వకుర్తికి ఏమైంది? కల్వకుర్తిలో రెండు మోటార్ల రిపేర్ కు ఎందుకు పైసా కూడా ఇవ్వలేదు? భీమా సగం కెపాసిటీతోనే ఉంది. నెట్టెంపాడు 4 టీఎంసీల సామర్థ్యం కలిగిందైతే 2 టీఎంసీల నీళ్లు కూడా లేవు. కొడంగల్-నారాయణ్ పేట్ -మక్తల్ లిప్ట్ ఇరిగేషన్ కోసం ఎందుకు భీమాను ఇన్ టేక్ పాయింట్ గా తీసుకున్నారు. భీమా చిన్న పిల్ల కాల్వనా..? మీకు ఆంధ్రా నేతలతో ఏం లాలూచీ ఉంది? ఆంధ్రాలో చంద్రబాబు, జగన్ రాజకీయాలను పక్కన పెట్టి వాళ్ల ప్రాంత ప్రయోజనాల కోసం మన నీళ్లు దోచుకుంటున్నారు. కానీ తెలంగాణ నాయకుల్లో మాత్రం ఆ చిత్తశుద్ధి లోపించింది. రెండేళ్లు టైమ్ పాస్ చేసి ఇప్పుడు కృష్ణా నీళ్లకు సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. కానీ పాలమూరు బిడ్డగా మీరు పూర్తిగా వైఫల్యం చెందారు. ఇకనైనా పాలమూరు-రంగారెడ్డి ఇన్ టేక్ సోర్స్ మార్చాలి. పాలమూరుకు సంబంధించి ఎన్జీటీలో స్టే ఉందని సీఎం చెబుతున్నారు. మరి ఆంధ్రాకు సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడుకు కూడా స్టే ఉంది. కానీ ఆంధ్రా నాయకులు మాత్రం వాటి పనులు కొనసాగించారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇప్పటికే 27 వేల ఎకరాల భూ సేకరణ చేసిన ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క కాలువ కూడా కట్టలేదు. డిప్యూటీ సీఎం వద్ద పాలమూరు-రంగారెడ్డి సహా 12 వేల ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి.”
రాజకీయ కక్షతో మేడిగడ్డను ఎండబెట్టిన సీఎం
” దాదాపు రెండేళ్ల పాటు మేడిగడ్డను ఎండబెట్టిన ముఖ్యమంత్రికి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది. మేడిగడ్డ రిపేర్ కోసం కాంట్రాక్ట్ పనులు ఇస్తారంట. రెండేళ్ల పాటు వేలమంది రైతులకు అన్యాయం చేశారు. వాళ్ల కడుపుకోత మీకు తగులుతుంది. ఆ ప్రాజెక్ట్ అయినా సరే రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాలను కాపాడే విధంగా పనులు చేయాలి. ప్రాజెక్టును ఆపి ప్రతిపక్షాలను బద్నాం చేసే రాజకీయాలు వద్దు. ప్రతిపక్షాన్ని తిడుతూ కాలం గడుపుతామంటే ఇది ఎడ్డి, గుడ్డి తెలంగాణ కాదు. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. వారికి వాస్తవాలు తెలిసేలా చేసేందుకు జాగృతి బయలుదేరింది. ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ను బీఆర్ఎస్, బీఆర్ఎస్ ను కాంగ్రెస్ తిట్టేందుకే అసెంబ్లీ పెట్టారు. ఇక్కడ టైమ్ పాస్ చేస్తూ, రీల్స్ చేస్తూ బయటకు వస్తున్నారు.”








