-కల్వకుంట్ల కవిత
(హైదరాబాద్)
అంగన్ వాడీ టీచర్ల విషయంలో రాజకీయ జోక్యం ఉండేలా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే సవరించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇది ఏమాత్రం సరికాదు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అంగన్ వాడీలు ఉమెన్ వెల్పేర్, ఛైల్డ్ వెల్ఫేర్ కిందకు వస్తారని, అలాంటి ఉద్యోగులను నమ్మి ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే ప్రజలకు మంచి సేవలు అందుతాయన్నారు.
అంగన్ వాడీ మొదలైన నాటి నుంచే పిల్లలు, గర్భీణిలకు పౌష్టికాహార లోపం సమస్య చాలా తగ్గిందని వివరించారు.
ఎంత పనైనా సరే చేస్తూ అంగన్ వాడీలు ప్రభుత్వానికి వెన్నెముకగా నిలుస్తున్నారని కవిత చెప్పారు. అటువంటి వాళ్లను ఈ ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు.
ఇప్పటికే చాలా పనులు చేస్తున్న వారిపై మరింత ఒత్తిడి పెంచవద్దని కోరారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆశాలు, అంగన్ వాడీల జీతం ఆపి సంక్షేమ పథకాలకు ఖర్చు చేశామంటున్నారని, అంగన్ వాడీలకు ఆరు నెలలు, తొమ్మిది నెలలు జీతాలు ఆపటం కరెక్ట్ కాదని చెప్పారు.
అంగన్ వాడీలకు, ఏఎన్ఎం, ఆశాలు, కాంట్రాక్ట్ వర్కర్లకు జీతాలు పెంచుతామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందని కవిత గుర్తు చేశారు. కానీ సంక్షేమ పథకాల కోసం వారి జీతాలు ఆపుతున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను వారికి మరింతగా అందేలా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా అంగన్ వాడీల జీతాలు పెంచాలని కోరారు. రాజకీయ జోక్యం ఉన్న జీవోను వెంటనే సవరించాలని కవిత డిమాండ్ చేశారు.








