నెరేళ్ల దాష్టీకానికి సిగ్గుపడాలి

అప్పుడు పాలించిన కుటుంబంలో ఉన్నందుకు క్షమాపణ అడుగుతున్నా

బాధ్యులైన పోలీసులకు, ధనదాహంతో ప్రాణాలు తీసిన బడా బాబులకు ఎందుకు శిక్ష పడలేదు?

బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

నెరేళ్ల ఘటనలో చనిపోయిన గంధం గోపాల్ కుటుంబ సభ్యులకు పరామర్శ

(తెలంగాణ రక్షణసేన, నేరెళ్ల)

నేరెళ్లలో కొందరి ధన దాహం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయాలా చేసిందని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పోలీసుల దాష్టీకానికి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. బాధితులకు ప్రభుత్వం అన్నిరకాల సహకారం అందించి ప్రతి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. 9 ఏండ్ల కింద ఇసుకలారీల దౌర్జన్యం పై తిరగబడి పోలీసు దెబ్బలతో గాయపడి ఇటీవల మృతి చెందిన నేరెళ్లకు చెందిన గంధం గోపాల్ కుటుంబాన్ని కవిత మంగళవారం పరామర్శించారు. అదే ఘటనలో గాయపడ్డ మరో రెండు కుటుంబాలను కూడా ఆమె కలిసి వారి బాధలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వివిధ పార్టీల నాయకులు గానీ ప్రభుత్వ ప్రతినిధులు గానీ బాధితులను ఊరికే టూరిస్టుల్లా వచ్చి చూసిపోతే సరిపోదని, వారికి ఆర్థిక సహాయం చేయాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుడతాయని అందరం కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకున్నామని కానీ నెరేళ్ల సంఘటన మనందరం సిగ్గుతో తలదించుకునేలా చేసిందన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు ఉన్న ప్రభుత్వంలోని కుటుంబంలో తాను కూడా సభ్యురాలినైనందుకు సిగ్గుతో తలదించుకుంటున్నానన్నారు. ఈ ఘటన పట్ల క్షమాపణ కోరారు. 

 9 ఏండ్ల కింద ఇసుక లారీల కారణంగా ఒక బిడ్డ ప్రాణం పోతే ప్రజలు ఆందోళన చేశారని కవిత గుర్తు చేశారు. 

దానికే వాళ్లపై పోలీసులు దాష్టీకం చేశారని విమర్శించారు. ఐదు రోజుల పాటు 8 మందిని ఇష్టానుసారంగా కొట్టారని తెలిపారు. జైలర్ కూడా వాళ్లను జైల్లోకి తీసుకోలేమని చెప్పేంతగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాష్టీకానికి పాల్పడిన ఒక్క పోలీసుకైనా శిక్ష పడిందో చెప్పాలని రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ ను ప్రశ్నించారు. జాతీయ ఎస్సీ కమిషన్ ను తీసుకొచ్చారు.. కానీ దాని రిపోర్ట్ ఏమైందో బండి సంజయ్ చెప్పాలన్నారు. 

ధన దాహంతో పేదల ప్రాణాలు తీసిన బడా బాబులకు ఒక్కరికైనా శిక్ష పడిందా అని ప్రశ్నించారు. బాధితులను పరామర్శించేందుకు తాము టూరిస్టుల మాదిరిగా రాలేదని చెప్పారు. కచ్చితంగా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కోసం పోరాటం చేస్తామని, అవసరమైతే నెరేళ్ల బాధితులతో కలిసి ఢిల్లీకి వెళ్తామని కవిత ప్రకటించారు. నెరేళ్ల బాధితుల మీద దాష్టీకానికి పాల్పడిన ఎస్పీ పై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ చెప్పిందని, కానీ ఒక ఎస్సైని బలి పశువును చేసి, దమనకాండ చేసిన వాళ్లను వదిలిపెట్టారని ఆరోపించారు. 

Telangana Rakshana Sena chief Kalvakuntla Kavitha meets families affected by the Nerella incident and calls for justice, police accountability, and ₹1 crore compensation

ఎన్నికలకు ముందు నెరేళ్ల బాధితుల పేరు చెప్పుకొని రేవంత్ రెడ్డి ఓట్లు వేయించుకున్నాడని కవిత చెప్పారు. 

కానీ 30 నెలలు గడిచినా ఇప్పటి వరకు నెరేళ్ల బాధితుల పేరు ఎత్తలేదన్నారు. ఈ ముఖ్యమంత్రికి కనీస మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. నెరేళ్ల ప్రాంతం నెత్తురుతో తడవలేదా.. మనందరం మానవత్వం మరిచిపోయామా.. అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు జరిగిన అవమానంపై పోరాటం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని పార్టీలను నేను కోరెదెక్కటే… నెరేళ్ల బాధితుల కుటుంబాలను ఆదుకోవడానికి ఈ దమనకాండకు పాల్పడిన వాళ్లపై మనందరం కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ విషయంలో రాజకీయం వద్దని కోరారు. గత ప్రభుత్వంలోనూ, ఈ ప్రభుత్వంలోనూ ప్రశ్నించే వాళ్లపై దాష్టీకానికి పాల్పడుతున్నారని కవిత విమర్శించారు. ఇసుక కోసం ప్రాణాలు తీస్తారా.. డబ్బు ముందు ప్రాణాలు పలుచన అయ్యాయా అని మండిపడ్డారు. నెరేళ్ల బాధితులందరికీ కచ్చితంగా ప్రభుత్వం కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. 

పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్ ల  మానవత్వం ఏమైందని ప్రశ్నించారు. మీరా కుమార్ ను తీసుకొచ్చి న్యాయం చేస్తామని ఇచ్చిన మాట ఏమైందన్నారు. నెరేళ్ల బాధితుల కన్నీళ్ల పునాదుల మీద మీరు అధికారం అనుభవించటం లేదా అన్నారు. చనిపోయిన గోపాల్ కుటుంబం 9 ఏళ్ల పాటు హాస్పిటళ్ల చుట్టు తిరిగిందని గుర్తు చేశారు. ఒక్క రూపాయి కూడా వారికి ప్రభుత్వం నుంచి సాయం అందలేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని, వాళ్ల పిల్లల చదువుల ఖర్చు భరించాలని సూచించారు. 

ఈ దాష్టీకానికి పాల్పడిన పోలీసులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే వారికి భయం ఉంటుందని స్పష్టం చేశారు. పోలీసులైనా సరే వాళ్లకు కొట్టే అధికారం లేదని చెప్పారు. నెరేళ్లలో బాధితులు తప్పు చేసి ఉంటే వాళ్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవల్సిందని తెలిపారు. తెలంగాణ రక్షణ సేన అంటే తెలంగాణను రక్షించుకునేందుకే పెట్టిన పార్టీ అని.. ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కారిస్తామనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నెరేళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని కవిత స్పష్టం చేశారు.

Kalvakuntla Kavitha visited the families affected by the Nerella incident, expressed solidarity with the victims, demanded ₹1 crore compensation for each affected family, and called for action against those responsible for the alleged police excesses