నీలోఫర్ లో బాలింతల పట్ల నిర్లక్ష్యం

ప్రభుత్వం మెడలు వంచి సదుపాయాలు అందిస్తాం

 -తెలంగాణ రక్షణ సేన మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మనోజ గౌడ్

హాస్పిటల్ లోనికి వెళ్లకుండా టీఆర్ఎస్ మహిళా నేతలపై సిబ్బంది దౌర్జన్యం

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్): 

నీలోఫర్ హాస్పిటల్ లో బాలింతలను కూర్చీలో కూర్చొపెట్టి వైద్యం అందించడం సిగ్గు చేటని తెలంగాణ రక్షణసేన మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు పడాల మనోజ గౌడ్ విమర్శించారు. నీలోఫర్ లో కనీస వైద్యసౌకర్యాలు లేక బాలింతలు, గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారనే సమాచారంతో టీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు మంగళవారం హాస్పిటల్ సందర్శించారు. నీలోఫర్ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది టీఆర్ఎస్ నాయకులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. హాస్పిటల్ లో పరిస్థితులను చిత్రీకరిస్తున్న ఫొటోగ్రాఫర్ల దగ్గరి నుంచి కెమెరాలు, మైకులు లాక్కునే ప్రయత్నం చేశారు. హాస్పిటల్ సిబ్బంది, సెక్యూరిటీ తీరుపై టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. గర్భిణీలకు కనీస వైద్య సదుపాయాలు కల్పించాలని కోరితే దౌర్జన్యానికి పాల్పడుతారా అని ప్రశ్నించారు. సరైన వైద్య సేవలు అందిస్తే తమను ఎందుకు లోపలకి పంపించడం లేదని నిలదీశారు. మహిళలకు కనీస వైద్య సౌకర్యాలు లేవని, ఒక్కో బెడ్ ను ముగ్గురు పేషెంట్లకు కేటాయిస్తున్నారని తెలిపారు. ఆపరేషన్ అయిన పేషెంట్లను స్ట్రెచర్ పై తీసుకెళ్లకుండా నడిపించుకుంటూ తీసుకెళ్లడం అత్యంత దారుణమన్నారు. నీలోఫర్ హాస్పిటల్ లో జరుగుతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వంలోని మహిళా మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ లో సరైన వసతులు కల్పించాలని కోరారు. లేదంటే ప్రభుత్వం మెడలు వంచైనా వసతులు కల్పించేలా చేస్తామని హెచ్చరించారు.

Telangana Rakshana Sena alleged inadequate healthcare facilities for mothers and pregnant women at Niloufer Hospital and called for immediate improvements in medical infrastructure.