మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఎంత ముఖ్యమో.. ఓబీసీ సబ్ కోటా అంతే ముఖ్యం
అన్ని వర్గాలకు మేలు చేసినప్పుడే అసలైన సామాజిక న్యాయం
లేదంటే జాగృతి తరఫున ఉద్యమిస్తాం
-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
(హైదరాబాద్)
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల నెరవేరే సమయం ఆసమన్నమవుతున్న తరుణంలో సామాజిక న్యాయాన్ని కూడా పాటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఆ రిజర్వేషన్లలో ఓబీసీ మహిళల కోసం సబ్ కోటా ఉండటం అంతే ముఖ్యం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లును ప్రస్తుత లోక్ సభ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కవిత స్పందించారు. “మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు ఉప కోటా కల్పించకపోవడం అంటే మెజారిటీ ప్రజలను మోసం చేయటమే” అని పేర్కొన్నారు. చట్టసభల్లో సామాజిక సమానత్వం రావాలంటే ఓబీసీ మహిళల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాల్సిందేనని అన్నారు. రిజర్వేషన్లలో ఓబీసీ రిజర్వేషన్ ఉంటేనే సామాజిక న్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
మళ్లీ పోరాటం తప్పదు
ఓబీసీ మహిళలకు ఉప కోటా లేకుండా ముందుకు వెళ్లాలని కేంద్రం భావిస్తే మరోసారి పోరాటం తప్పదని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఏ విధంగా పలు రాజకీయ పార్టీలను, మహిళా సంఘాలను ఏకం చేసి ఢిల్లీలో దీక్ష చేసామో… అదే విధంగా మరోసారి పోరాటం చేస్తామన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో పెట్టిన సందర్భంలోనే తాము ఈ డిమాండ్ చేశామని కవిత గుర్తు చేశారు. ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వకుండా మహిళా రిజర్వేషన్లు వచ్చినా… ఆయా వర్గాల ఆడబిడ్డలకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం దక్కదని కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

అన్ని వర్గాలకు మేలు చేయటమే సామాజిక న్యాయం
దేశంలో అన్ని వర్గాలకు మేలు చేయటమే సామాజిక న్యాయమని కవిత అన్నారు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఓబీసీ వర్గాల మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించకపోతే వారికి ఎలా న్యాయం దక్కుతుందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు రాజ్యాంగబద్ద వాటా ఉందని…కానీ ఓబీసీల పరిస్థితి ఏంటనీ నిలదీశారు. ఈ విషయంలో అన్ని పార్టీల నాయకులు, ఆయా పార్టీల్లో ఉన్న ఓబీసీ మహిళ నేతలు, మహిళా సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఓబీసీ మహిళలకు ఉప కోటా కేటాయించే వరకు జాగృతి తరఫున మరోసారి పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.మహిళా బిల్లు ఆమోదం పొందటంలో కీలక పాత్ర

దేశ రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలనే లక్ష్యంతో జాగృతి అధ్యక్షురాలుగా తాను, తమ నాయకులు చేసిన పోరాటం ఫలితంగా మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ముందడుగు పడిందన్నారు. దేశంలోని 18 రాజకీయ పార్టీలను, మహిళా సంఘాలను, పలు ప్రజా సంఘాలను ఏకం చేసి జంతర్ మంతర్ సాక్షిగా నిరాహార దీక్ష చేశామని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు తెచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, మేధావులతో చర్చలు, పలు నిరసన కార్యక్రమాల ద్వారా ఈ అంశాన్ని జాతీయ అజెండాగా మార్చగలిగామని తెలిపారు. ఇదే సందర్భంగా ఓబీసీ మహిళా కోటా కేటాయిస్తూ సామాజిక న్యాయం కూడా చేయాలని కోరామని చెప్పారు. మహిళల కోటాలో ఓబీసీ సబ్ కోటా ప్రస్తావన లేకపోవడం విచారకరమని అన్నారు. కేంద్రం ఓబీసీ కోటాపై స్పందించాలని కవిత డిమాండ్ చేశారు.








