మానకొండూరులో ఉద్యమకారుల ఇంటినిర్మాణానికి భూమిపూజ | మానకొండూరు-కరీంనగర్




మానకొండూరులో భూ పోరాటం చేసి నిర్మించిన గుడిసెలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాలు పొంగించారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారులతో కలిసి వంటావార్పు నిర్వహించారు. స్వయంగా కూరగాయలు తరిగి వంట చేశారు. ఈ సందర్భంగా వేసిన గుడిసెలో ఆమె పాలు పొంగించారు.. ఉద్యమకారుల ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల జాగ ఇస్తామన్న విషయాన్ని గుర్తు చేసేలా పోరాడుతున్నామన్నారు. మీరు ప్రామిస్ చేసినట్లుగా రూ. 25 వేల పెన్షన్, గుర్తింపు కార్డులు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో ఉద్యమకారులు వివిధ ఫోరమ్ లలో ఉద్యమం మొదలు పెట్టారని తెలిపారు.
వారందరికీ జాగృతి తరఫున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు.
మానకొండూరులో జర్నలిస్టులకు 2012 లో జాగలు ఇచ్చినట్టే ఇచ్చి ప్రభుత్వం వెనక్కి తీసుకుందని కవిత విమర్శించారు. గద్వాల్, నిజామాబాద్ సహా చాలా ప్రాంతాల్లో ఇలాగే చేశారన్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా యాజమాన్యంతో కొట్లాడి జర్నలిస్టులు ఉద్యమ వార్తలను అందించారని కవిత గుర్తు చేశారు. ఉద్యమంలో వార్తలను హైలెట్ చేసేందుకు వారి వంతు ప్రయత్నం చేశారని తెలిపారు. అలాంటి జర్నలిస్టులకు కచ్చితంగా భూములు ఉండాలని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం కొట్లాడిన వారికి భూముల మీద హక్కు ఉండాలని చెప్పారు.
ప్రతి జిల్లాలో ఇదే విధంగా భూపోరాటాలు కొనసాగిస్తూ ఉద్యమకారులకు అండగా నిలుస్తామని ప్రకటించారు.













