తెలంగాణ ప్రాచీన, సంప్రదాయ, జానపద కళాకారుల ఏండ్ల కల నెరవేరింది. కళాకారులకు గుర్తింపు కార్డులివ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. కళాకారుల సంక్షేమం కోసం తెలంగాణ జాగృతి నిర్వహించిన పోరాటానికి ఫలితం దక్కింది. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న సంప్రదాయ కళలను నమ్ముకుని జీవిస్తున్న వారితో పాటు వివిధ కళారూపాలు అంతరించి పోకుండా కాపాడుతున్న కళాకారులను గౌరవించుకోవడం మన విధి అని భావించిన తెలంగాణ జాగృతి వారికి అండగా నిలిచింది. తెలంగాణ సాంస్కృతిక రంగానికి ఒక గొప్ప విజయంగా నిలిచే ఈ నిర్ణయం వెనుక కల్వకుంట్ల కవిత దీర్ఘకాల పోరాటం ప్రధాన కారణం. కళాకారుల సమస్యలను గుర్తించి, వారి గౌరవం, హక్కుల రక్షణ కోసం నిరంతరం కృషి చేయడం వల్లే ఈరోజు ప్రభుత్వం ఈ అంశాన్ని అంగీకరించింది. ఎన్నో సార్లు ప్రతిపాదనలు చేయడం, చర్చలు జరపడం, కళాకారుల వాణిని ప్రభుత్వానికి చేరవేయడం ద్వారా ఈ మార్పు సాధ్యమైంది.
ఉద్యమంలో కీలకపాత్ర
తెలంగాణ వ్యాప్తంగా చిందు, యక్షగాణం, ఒగ్గు లాంటి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కళారూపాలున్నాయి. వారసత్వంగా వస్తున్న కళలను నమ్ముకుని కళాప్రదర్శనల ద్వారా వస్తున్న ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్న వారెందరో ఉన్నారు. వీటితో పాటు జానపద, లలిత కళల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల ప్రచారంలోనూ కళాకారులు పాలు పంచుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలమంది కళాకారులు తమ కళానైపుణ్యంతో తెలంగాణ ఉద్యమంలోనూ విశేష సేవలందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర భావజాల వ్యాప్తికి తమవంతు కృషి చేశారు. రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ కళాకారులకు కొత్త రాష్ట్రంలో ఎలాంటి ఆదరణ లభించలేదు. పరిమితంగా కొందరికి ఉద్యోగాలిచ్చి గౌరవించినా మిగతా వారిని అధికారికంగా గుర్తించడానికి కూడా గత ప్రభుత్వం ముందుకురాలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారిని పట్టించుకోలేదు.
కళాకారులకు కవిత మద్దతు
దశాబ్దాలుగా తమ ప్రతిభతో కళలను బతికిస్తూ చాలీచాలని ఆదాయంతో కడుపునింపుకుంటున్న కళాకారులు ప్రభుత్వ సాయం కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు. తమను ప్రభుత్వం గుర్తించి ఐడీ కార్డులిచ్చి పింఛన్ మంజూరు చేస్తే కళలను బతికించి తామూ బతుకుతామంటూ వేడుకున్నారు. కళాకారులకు గుర్తింపుతో పాటు, పింఛన్, ఇండ్ల స్థలాలు ఇప్పించడానికి ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు మురళీధర్ దేశ్ పాండే వారిని ఏకం చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తమ పోరాటానికి మద్దతిస్తే ఫలితం సాధించవచ్చని ఆయన భావించారు. ఆలోచన వచ్చిందే తడవుగా కవితను కలిసి మద్దతు కోరారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణ కోసం దాదాపు 20 ఏండ్లుగా జాగృతి సంస్థ ద్వారా కృషి చేస్తున్న కవిత వెంటనే సమ్మతి తెలిపారు. కళాకారులను గుర్తించడమంటే మన సంస్కృతిని, మన మూలాలను కాపాడుకోవడమేనన్న ఆలోచన కవితది. తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయానికి కళాకారులను పిలిపించుకుని వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఆ తర్వాత మురళీధర్ దేశ్ పాండే ఆధ్వర్యంలో కార్యాచరణ రూపోందించి ముందుకు సాగారు. కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాటలో కళాకారులకు ప్రాధాన్యమిచ్చి కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం తదితర చోట్ల కళాకారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. వారి కళాప్రదర్శనలకు వేదికలిచ్చారు.

జాగృతి విజయం
తెలంగాణ కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులిచ్చి పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఇటీవల ప్రభుత్వానికి కవిత ఉత్తరాలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కళాకారునికి నెలకు కనీసం రూ. 500 పింఛన్ మంజూరు చేసినా దానికి కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.5500 ఇచ్చే అవకాశముందని ఉత్తరంలో పేర్కోన్నారు. ప్రతి కళాకునికి ఇండ్లు కేటాయించాలని, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి వారిని నియమించి ఆదాయం సమకూర్చాలని కవిత ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ జాగృతి సేవల ద్వారా కళాకారుల సంక్షేమం కోసం చేసిన ప్రయత్నాలు ఫలితాన్నిచ్చాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధేశాలతో భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కళాకారుల గుర్తింపు, వారికి ఐడీ కార్డుల మంజూరు, ఆన్‌లైన్ విధానం ద్వారా సులభతరం చేయడం వంటి చర్యలు వారి జీవితాల్లో ఒక కొత్త దశను ప్రారంభించాయి. ఇది కేవలం ఒక పరిపాలనా నిర్ణయం కాదు, కళాకారుల గౌరవాన్ని పెంచే ఒక చారిత్రాత్మక అడుగు. కళాకారులు, జాగృతి పోరాటం, పట్టుదల, అంకితభావం వల్లే ఈ రోజు ఈ విజయం సాధ్యమైంది. ఇది ప్రతి కళాకారుడి విజయం. ఇకపై కూడా కళాకారుల అభివృద్ధి కోసం ఇదే దృఢ సంకల్పంతో జాగృతి ముందుకు సాగుతుంది








