వెలుగుమట్ల నిజ నిర్దారణ కమిటీకి పౌర సమాజం నుంచి సలహాలు, సూచనలు
ఛైర్మన్ జసిస్ట్ చంద్రకుమార్ గారికి ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి లేఖ
(హైదరాబాద్)
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ పట్ల పౌర సమాజం నుంచి మంచి స్పందన వస్తున్నది. బాధితులకు సంపూర్ణ న్యాయం దక్కాలంటే వారికి ఏ రకంగా న్యాయం చేయాలి? వారి సమస్యలను ఎన్ని రకాలుగా పరిశీలించాలన్న దానిపై పలువురు తమ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఎం.వి. ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి నిజ నిర్ధారణ కమిటీ ఛైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ కు లేఖ రాశారు. మార్చి 6 న తాను బాధితులను కలిశానని లేఖలో పేర్కొన్నారు. వారి దుస్థితి చూసి ఆవేదన కలిగిందన్నారు. బాధితులు ఉంటున్న ప్రాంతంలో వారి పరిస్థితి ఆధ్వాన్నంగా ఉందని చెప్పారు. నిజ నిర్ధారణ కమిటీ పలు అంశాలపై దృష్టి పెట్టాలని కోరుతూ కొన్ని సూచనలు చేశారు. నిరాశ్రయులైన పిల్లల ఇబ్బందులను తీర్చాలంటూ తాను కలెక్టర్ వినతి పత్రం ఇచ్చినప్పటికీ స్పందన లేదన్నారు. బాధిత కుటుంబాలకు సరైన తిండి లేక దాతలు పెట్టే భోజనంపై ఆధారపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా పిల్లలంతా కూడా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా కుటుంబాల్లోని పిల్లలు చదువుకు దూరమయ్యారని… పనులకు వెళ్లి కుటుంబాలను పోషిస్తున్నారని చెప్పారు. ఇంటి బాధ్యతల కారణంగా చాలా మంది విద్యార్థినులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులున్న ప్రాంతం పూర్తిగా అశుభ్రంగా ఉండటం కారణంగా రోగాల పాలవుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని నిజ నిర్ధారణ కమిటీ తమ నివేదికలో పలు అంశాలను చేర్చాలంటూ ఆయన కోరారు. ఈ లేఖ కాపీలను జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, డీఎస్పీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ కు కూడా పంపించారు.
వెంకట్ రెడ్డి చేసిన సూచనలు
“వెలుగుమట్ల నిజనిర్ధారణకమిటీ తప్పకుండా పిల్లల పరిస్థితిని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఇండ్ల కూల్చివేతల కారణంగా పిల్లల ఆరోగ్యం, వారి కుటుంబాల పోషణ, పిల్లల విద్యపై పడిన ప్రభావాన్ని అంచనా వేయాలి. మేము లేవనెత్తిన అంశాలపై సకాలంలో చర్యలు తీసుకోకపోవడంపై ఖమ్మం జిల్లా కలెక్టర్ నుండి వివరణ కోరాలి. పిల్లల హక్కులు, సంక్షేమాన్ని కాపాడటానికి తక్షణమే తగిన చర్యలను సిఫార్సు చేయాలి. ఇలాంటి కూల్చివేతల కారణంగా మానసికంగా, నిస్సహాయ స్థితిలో ఉండి బాధితులయ్యేది పిల్లలే. కనుక వారి పరిస్థితిని మానవీయకోణంలో కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. పిల్లల హక్కులు, వారి విద్యకు సంబంధించిన అంశాలపై నిజ నిర్ధారణ కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి.”








