తొలి రోజే బాధితుల సమస్యలు పరిష్కారమయ్యేలా సాగిన నిజనిర్ధారణ కమిటీ పర్యటన

కమిటీ ముందు తమ గోడు వెళ్లబోసుకున్న బాధితులు

పరిష్కారానికి కలెక్టర్ హామీ

అర్హులకు ఇళ్ల మంజూరు, పిల్లల చదువు, భోజనం, షెల్టర్ బాధ్యత ప్రభుత్వానిదేనన్న కలెక్టర్

కమిటీకి, కల్వకుంట్ల కవితకు, విశారదన్ మహారాజ్ కు బాధితుల కృతజ్ఞతలు

(వెలుగుమట్ల, ఖమ్మం)

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన వారికి  న్యాయం చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ…బాధితులకు  కొండంత భరోసాగా మారింది. తొలి రోజే బాధితుల సమస్యలు పరిష్కారమయ్యేలా పలు చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై కమిటీ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వం కల్పించిన షెల్టర్ లో ఉన్న వారి పిల్లల చదువు, వారికి షెల్టర్, ఫుడ్, ఆరోగ్యానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వమే చూసుకుంటుందని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తెలిపింది. అదే విధంగా అర్హులైన వారెవరికైనా ఇళ్ల పట్టాలు రాకపోయి ఉంటే వారికి ఇళ్లు ఇస్తామని, సరైన ఆధారాలుంటే అనర్హులను లిస్ట్ నుంచి తొలగిస్తామని కలెక్టర్ స్పష్టం చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మొత్తం 750 మంది బాధితుల జాబితాను కూడా త్వరలోనే ఇస్తామని ఆయన చెప్పారన్నారు. అంతకుముందు ఖమ్మం ఖానాపురంలోని ఫూలే అంబేద్కర్ అధ్యయన వేదికలో నిజ నిర్ధారణ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో సభ్యులు… బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారంతా కమిటీ ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఎంతో మంది అర్హులకు పట్టాలు రాలేదని, కొంతమందికి టోకెన్ ఇచ్చి ఇంటి నంబర్ ఇవ్వలేదని చెప్పారు.  తమ సొంత గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు తీసుకునేందుకు తాము ఒప్పుకోకున్నా ఒప్పుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు టోకెన్ ఇచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వలేదని, వేరే వారికి తన టోకెన్ నంబర్ కేటాయించారని విజయలక్ష్మి అనే బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. 

కలెక్టర్ తో సమావేశం

బాధితులతో మాట్లాడిన తర్వాత కమిటీ సభ్యులు కలెక్టర్ తో సమావేశమయ్యారు. బాధితులు చెప్పిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా ఇళ్లు కోల్పోయి ప్రభుత్వం ఇచ్చిన షెల్టర్ లో ఉంటున్న వారి పిల్లల చదువు, వారికి భోజనం, ఇతర సౌకర్యాల అంశాన్ని సభ్యులు ప్రధానంగా కలెక్టర్ ముందు ఉంచారు. అర్హులైన చాలా మందికి ఇళ్లు రాలేదని, అనర్హులకు ఇళ్లను కేటాయించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పిల్లలను గురుకుల, అంగన్ వాడీ స్కూళ్లలో చేర్పిస్తామని, వారికి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. అదే విధంగా అర్హులైన వారి పేర్లు ప్రభుత్వం ఇచ్చిన జాబితాలో  లేకపోతే వారికి ఇళ్లను మంజూరు చేస్తామని కూడా కలెక్టర్ భరో ఇచ్చారని చెప్పారు. 

బాధితులకు అండగా కమిటీ

ఇళ్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్ లో కష్టాలు పడుతున్న వారికి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అండగా మారింది. వారి అన్ని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో వాటికి పరిష్కారం దొరుకుతోంది. ఇప్పటి వరకు కూడా పిల్లల చదువు, షెల్టర్ విషయం సహా చాలా మంది అర్హులకు ఇళ్లు రాని పరిస్థితి ఉండే. ఐతే కమిటీ సభ్యులు వెళ్లిన తర్వాత వారి అన్ని సమస్యలను తీర్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వెలుగుమట్ల బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టోకెన్ ఇచ్చిన తర్వాత కూడా ఇళ్లు రాని విజయలక్ష్మి అనే బాధితురాలి అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లటంతో ఆమెకు కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో బాధితురాలు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, డీఎస్పీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి బాధితునికి న్యాయం జరిగే విధంగా ప్రజాస్వామ్య పద్దతిలో తాము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా కమిటీ ఛైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ చెప్పారు.