సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాటం -కవిత, విశారదన్

(సోమాజిగూడ ప్రెస్ క్లబ్ – హైదరాబాద్)

ఖమ్మం వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చిన ఘటనలో అసలు ఏం జరిగిందో తేల్చడానికి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి, ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఖమ్మం బయల్దేరింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, డీఎస్ పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వెలుగు మట్ల బాధితులందరికీ న్యాయం కోసం నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అసంపూర్తిగా ఉన్నాయని విశారదన్ విమర్శించారు.

బాధితులు ఎక్కడుండాలి: కల్వకుంట్ల కవిత

“ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దారుణంగా వెలుగుమట్లలో ఎటువంటి నోటీసులు, హెచ్చరిక లేకుండా పేదల వాళ్ల 750 ఇళ్లను కూల్చేశారు. ధర్మసమాజ్ పార్టీ, జాగృతి ఈ అన్యాయంపై చేసిన పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చింది. 

కూల్చిన చోటే 311 మందికి పట్టాలు ఇస్తామని…మరో 101 మందికి వాళ్ల గ్రామాల్లో ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వం స్పందించిన తీరును బట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాపోరాటాలకు గెలుపు ఉంటుందని భావిస్తున్నాం. అయితే 750 మంది ఇళ్లను కూల్చేసి,  412 మందికి మాత్రమే ఇళ్లను ఇస్తామంటున్నారు. ఇంకా చాలా మందికి న్యాయం జరగలేదన్నది స్పష్టంగా తెలుస్తున్నది. బాధితులందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో విశారదన్ నిన్న కూడా ఖమ్మం వెళ్తే ఆయనను అరెస్ట్ చేశారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏమాత్రం పారదర్శకత లేకుండా ఉంది. ప్రభుత్వం బాధ్యతాయుతంగా మెలిగేలా ఎలా చేయాలన్న దానిపై మేము చర్చించాం. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ తో పాటు సమాజం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న చాలా మందితో మాట్లాడాం. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, ఆర్మీ మాజీ మేజర్ మదన్ మొహన్, ప్రొఫెసర్లు అనురాధ, నాగం కుమార స్వామి, రామయ్యతో పాటు లాయర్లు సుంకర నరేష్, శ్రావణ్ గౌడ్, నూర్జహాన్, జర్నలిస్టులు తెలంగాణ విఠల్, ఆకాశ్ గౌడ్, క్రాంతి లాంటి వాళ్లు ఒక కమిటీగా ఏర్పడ్డారు. పేద వాళ్లకు న్యాయం చేసేందుకు వాళ్లు ఉద్యోగాలు చేస్తూనే సమాజం కోసం పోరాటం చేసేందుకు ముందుకు వచ్చారు. వాళ్లందరి కమిట్ మెంట్ ను ప్రశంసిస్తున్నా. ప్రభుత్వం, అధికారులు ఈ కమిటీకి సహకరించాలి. జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ ప్రజాపోరాటాలకు ప్రభుత్వం దిగివచ్చింది. కానీ సంపూర్ణ న్యాయం జరగలేదు. డిసెంబర్ 9 నాటికి వాళ్ల ఇళ్లను పూర్తి చేస్తామని చెబుతున్నారు. కానీ అప్పటి వరకు ఆ పేదలు ఎక్కడ ఉండాలి? వాళ్ల ఇంటి అద్దె, పిల్లల చదువుకు కావాల్సిన సాయం ప్రభుత్వమే చేయాలి. ఇప్పుడు ఏర్పడిన కమిటీ ద్వారా బాధితులకు న్యాయం జరిగే విధంగా అన్ని విధాలుగా పోరాటం చేస్తాం. అదే విధంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న మేధావులు కూడా ఈ విషయంలో స్పందించాలి. ప్రొఫెసర్ కోదండ రాం, హరగోపాల్, ఆకునూరి మురళి లాంటి వాళ్లు స్పందించాలని కోరుతున్నా. వెలుగుమట్లలో ఎంత కర్కషంగా, దారుణంగా, అన్యాయంగా బాధితుల ఇళ్లు కూల్చారో వెళ్లి తెలుసుకోండి. పేదలకు మేలు చేసేందుకు ఇదే సరైన సందర్భం అని మీకు సూచిస్తున్నా. మేధావుల మౌనం సమాజానికి ఎంతో నష్టం చేస్తుంది. దయచేసి కోదండ రాం, హరగోపాల్, ఆకునూరి మురళి లాంటి వాళ్లు స్పందించాలి. అదే విధంగా ఈ కమిటీ ఒక న్యూట్రల్ కమిటీ. కనుక వారికి ప్రభుత్వం సహకరించాలి.”

Velugumatla demolition victims fact finding team send off

పేదలు గౌరవంగా బతకాలి: విశారదన్ మహారాజ్

“వెలుగుమట్లలో కలెక్టర్ ద్వారా అక్కడి పేదల మీద ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది. ఈ అన్యాయంపై ప్రజా సంఘాలు, పార్టీలు చాలా వరకు ప్రశ్నించాయి. అయితే బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం మెడలు వంచేలా జాగృతి సంస్థ, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ పోరాటం చేసింది. దీంతో ప్రభుత్వం స్పందించి 412 మందికి మాత్రమే న్యాయం చేస్తామని అంగీకరించింది. 750 మంది ఇళ్లను కూల్చేసి 412 మందికి మాత్రమే న్యాయం చేస్తామని చెబుతున్నారు. మేము కోరేది బాధితులందరికీ కూడా సంపూర్ణ న్యాయం జరగాలి. కానీ అసంపూర్తిగా ఈ ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. కూల్చిన ఇళ్ల విలువకు తగిన విధంగా 750 మంది బాధితులకు ఆత్మగౌరవంతో బతికేలా ఇండ్లు కట్టించాలి. అదే విధంగా అక్కడ అన్ని విధాలుగా సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకునే క్రమంలో తత్తరపాటుకు గురైంది. లక్షల విలువ చేసే ఇళ్లను కూల్చేసి 5 లక్షలే ఇస్తామనటం, 75 గజాలకే పరిమితం చేయటం అసంబద్ధం. నిజనిర్ధారణ కమిటీ ప్రజాస్వామ్యబద్దంగా భూ బాధితుల సమస్యలు తెలుసుకొని వారికి ఏ విధంగా న్యాయం చేయాలన్న దానిపై నివేదిక సిద్ధం చేస్తుంది.”

నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మంగళవారం రాత్రి ఖమ్మం చేరుకొని అక్కడే బస చేస్తారు.. బుధవారం ఉదయం వెలుగుమట్లలో పర్యటిస్తారు.. అనంతరం బాధితులు, ప్రభుత్వ అధికారులతో పాటు పలువురు ప్రముఖులతో సమావేశం అవుతారు.