సీఎం హిట్లర్ కన్నా దారణమైన తాలిబన్
-కల్ల్వకుంట్ల కవిత ఫైర్
స్కూళ్ల మూసివేత అనాలోచిత నిర్ణయం
(తెలంగాణ రక్షణ సేన కార్యాలయం, హైదరాబాద్)
రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు తాలిబన్లను తలపిస్తున్నదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆమె ఫైరయ్యారు. సోమవారం ఈమేరకు వీడియో సందేశం విడుదల చేశారు. 27 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసేసి 4 వేల పాఠశాలలు మాత్రమే నడిపిస్తాను అంటున్న రేవంత్ రెడ్డి హిట్లర్ మాత్రమే కాదు.. అంతకన్నా ఎక్కువని దుయ్యబట్టారు. రేవంత్ తాలిబన్ లాంటివాడని మండిపడ్డారు. అందుకే ఆడపిల్లలు, పేదలకు చదువులు దూరం చేసేందుకు ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తమని అంటున్నారని చెప్పారు. విద్యాశాఖపై రేవంత్ పట్టు కోల్పోయిండని విమర్శించారు. సర్కస్ లెక్క విద్య శాఖను మార్చేసిండని తెలిపారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ బోర్డు ఉండదని ముందు సీఎం ప్రకటించిన మరుసటి రోజే అడ్మిషన్లకు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు.
జూనియర్ కాలేజీలు ప్రారంభమై వారం రోజులు అవుతున్నా ప్రభుత్వ, ప్రవేట్ జూనియర్ కాలేజీలకు ఈ ప్రభుత్వం కనీసం అఫిలియేషన్ ఇవ్వలేదని కవిత వివరించారు. డిగ్రీ అడ్మిషన్లను గందరగోళంగా మార్చేశారని.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కొన్ని కోర్సులను సిఫార్సు చేస్తే.. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ మరికొన్ని కోర్సులు రిఫర్ చేసిందని తెలిపారు. వాటిలో ఏ ఒక్క కోర్సుకు కూడా యూనివర్సిటీలు అప్రూవల్ ఇవ్వలేదని తెలిపారు. అయినా దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు.
సమీక్షలేవి..
గురుకులాల్లో వంద మందికి పైగా విద్యార్థులు చనిపోయినా ఈ ముఖ్యమంత్రి కనీసం సమీక్ష చేయడం లేదని కల్వకుంట్ల కవిత విమర్శించారు. రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకే ట్యూషన్ ఫీజులు ఇస్తామని చెప్పి జీవో నెంబర్ 7 తీసుకువచ్చారని తెలిపారు. ఈ జీవో కారణంగా విద్యార్థులను ప్రైవేటు కాలేజీలు దోపిడీ చేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జీవో నెంబర్ 7 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం వెంటనే అమల్లోకి తెచ్చి ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు.








