కబ్జాల కారణంగా నగరంలో చెరువులు మాయం కావడంతో కుమ్మరుల కులవృత్తిపై దెబ్బపడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. యాకుత్ పురా నియోజకవర్గంలో జాగృతి జనంబాటలో భాగంగా గురువారం గౌలిపురా కుమ్మరివాడలో కుమ్మరి వృత్తిదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కుమ్మరి వృత్తి చేస్తున్న వారితో కలిసి కవిత మట్టి ప్రమిదలు తయారు చేశారు. కుమ్మర వృత్తిదారుల స్థితిగతులు, వృత్తి పనితో గిట్టుబాటు అవుతుందా? ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కుమ్మరివాడకు సౌకర్యాలు కల్పించాలని కోరారు.

” గౌలిపురాలో పెద్ద సంఖ్యలో కుమ్మరి సోదరులు కులవృత్తి కొనసాగిస్తున్నారు. కానీ హైదరాబాద్ లో చెరువులు లేకుండా పోవటంతో వారికి మట్టి దొరకటం లేదు. బయట నుంచి మట్టి తీసుకురావటానికి ఒక్క ట్రిప్ కోసం రూ. 25 వేలు ఖర్చవుతున్నది. కుమ్మరి సోదరులు మట్టి కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం వారి సమస్యపై దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కుమ్మరి చక్రం వచ్చింది. దాన్ని కులవృత్తి చేసుకునే వారికి ప్రభుత్వం సబ్సిడీ లేదా ఫ్రీ గా అందించాల్సి ఉంది.”

“ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. బీసీల్లో అధిక సంఖ్యలో కుమ్మరి వాళ్ల జనాభా ఉన్నప్పటికీ రాజకీయంగా వారికి సరైన ప్రాతినిధ్యం లేదు. ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి. ఆ ప్రాంతంలో రోడ్లు సరిగా లేవు. నీళ్లు కూడా రావటం లేదు. వస్తున్న నీళ్లు కూడా మురికిగా ఉంటున్నాయి. దాదాపు 35 ఏళ్లుగా ఇక్కడ డ్రైనైజీని బాగు చేయటం లేదు. ఓల్డ్ సిటీ అంటే ఓల్డ్ గా కాకుండా న్యూగా ఉండాలి. ఓల్డ్ సిటీలో మెట్రో ఎక్స్ టెన్షన్ అవుతోంది. కానీ పేద ప్రజలకు మెట్రో ధరలు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. పేద ప్రజలకు ట్రాన్స్ పోర్ట్ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.”








