-ఎల్.రూప్ సింగ్
సేవాలాల్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ
(హైదరాబాద్)
బంజారా జాతి ఆరాధ్యదైవం, మూలపురుషుడు సంత్ శ్రీ సేవాలాల్ మాహారాజ్ 281వ జయంతిని ఈ నెల 15 న జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి బంజారా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ తెలిపారు. సేవాలాల్ జయంతి వేడుకల పోస్టర్ ను ఆయన ఆదివారం జాగృతి ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎవరూ చేయని విధంగా భోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 15న నిర్వహించే భోగ్ బండార్ కార్యక్రమంలో జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి బంజారా గురువులు చాలా మంది రానున్నారని తెలిపారు. బంజారాల విషయంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం పెద్గగా శ్రద్ధ చూపలేదని వివరించారు. జాగృతి అధ్యక్షురాలు కవిత బంజారాల విషయంలో ఎంతో అధ్యయనం చేశారన్నారు. బంజారాలను ఆదివాసీలను ఏకం చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారని రూప్ సింగ్ చెప్పారు. తెలంగాణలో బంజారా పూజారులను పిలిచి వారిని గౌరవించిన సందర్భాలు లేవన్నారు. కవిత బంజారా పూజారులను ఇంటికి పిలిచి వాళ్లకు నమస్కరించి గౌరవించారని గుర్తు చేశారు. తిరుపతిలోని హాథిరాం మఠాన్ని ఏపీ ప్రభుత్వం కూలగొట్టే ప్రయత్నం చేస్తే అక్కడి సీఎం, టీటీడీ ఛైర్మన్, అధికారులతో మాట్లాడి కూలగొట్టకుండా ఆపారని రూప్ సింగ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జాగృతి బంజారా నాయకులు బి. కిషన్ నాయక్, బి. సంజీవ్ నాయక్, బానోత్ వెంకట్ నాయక్, దేవి బాయి, పున్ని బాయి, రాంజి నాయక్, గుగులోత్ శ్రీనివాస్ నాయక్, బాలు నాయక్, కుమార్ నాయక్, ప్రేమ్ కుమార్, ప్రవీణ్ నాయక్, కృష్ణ నాయక్, జీవన్ నాయక్, రామ చావలి బాయి పాల్గొన్నారు.









