కొంగరకుర్దు- ఏ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ భూ మాఫియా
ఆ భూములు రైతులకే దక్కాలి
అధికార, ప్రతిపక్ష ముఖ్య నాయకులు వక్ఫ్ భూములు కొట్టేస్తున్నారు
-తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత
భూ బాధితులతో కలిసి మీడియా సమావేశం
నమస్తే తెలంగాణ, సాక్షిలో ఒక్క రోజు వార్తలు రాసి బీఆర్ఎస్ ముఖ్య నేత ఒత్తిడితో కబ్జా బాగోతాన్ని పక్కన పెట్టారని ఆరోపణ
(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆర్గనైజ్డ్ గా భూ మాఫియా పెద్ద ఎత్తున భూములు కబ్జా పెడుతున్నదని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కొంగరకుర్దు(ఏ) లో అధికార, ప్రతిపక్ష ముఖ్య నాయకులు వక్ఫ్ భూములు కొట్టేస్తున్నారని ఆ భూములు రైతులకే తగ్గాలని డిమాండ్ చేశారు. కొంగరకుర్దు(ఏ) భూ బాధితులతో బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం కవిత సమావేశమయ్యారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కొంగరకుర్దు(ఏ)లో ఉన్న 580 ఎకరాల వక్ఫ్ భూమిలో ఇప్పటికే 150 ఎకరాలు భూ మాఫియా చెరలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. కొంగరకుర్దులోని సర్వే నంబర్లు 2 నుంచి 400 వరకు ఉన్న 580 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు చెందుతుందని 2007లోనే గెజిట్ ఇచ్చి 22ఏ లో చేర్చారని వివరించారు. 2022లో ఈ భూములపై మాఫియా కన్ను పడిందన్నారు. ఒక రైతు 58 ఎకరాల్లో పంటలు సాగు చేస్తే మూడు జేసీబీలతో ఆ పంటను ధ్వంసం చేసి లే ఔట్ చేశారని తెలిపారు. బిహార్, ఉత్తర ప్రదేశ్ లో ఎంతటి దౌర్జన్య పరమైన రాజ్యం సాగుతుందో కొంగరకుర్దులో అంతే దౌర్జన్యంగా రైతులు సాగుచేసుకుంటున్న భూములు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ మాఫియా ఆగడాలపై రెవెన్యూ, పోలీస్ అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా కనీసం కేసులు కూడా నమోదు చేయడం లేదని విమర్శించారు. కొంగరకుర్దు గ్రామంతో సంబంధం లేని వారి పేర్లతో ఓ ఆర్ సీ లు సృష్టించి వాటితో కోర్టుల్లో కేసులు వేసి అనుకూలంగా తీర్పులు తెచ్చుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని ఆరోపించారు. 2022 లో 22ఏ లో ఉన్న కొంగరకుర్దు భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయన్నారు. దానికి సంబంధించిన అన్ని రికార్డులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని కవిత చెప్పారు.

కోర్టులో తేలుతుంది
అర్బన్ క్రెస్ట్, సిటీ గ్రాండ్ ఎన్ క్యూ వెంచర్స్ అనే సంస్థలు కొంగరకుర్దు(ఏ)లో భారీ వెంచర్లు వేశాయని కవిత తెలిపారు. 2022 తర్వాత ఇక్కడ జరిగిన అన్ని రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో లే ఔట్ పర్మిషన్ ఎలా ఇచ్చారని, హెచ్ఎండీఏ కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ రోజు కూడా కొంగరకుర్దు భూముల్లో నిషేధిత జాబితాలో ఉన్నట్టు ప్రభుత్వ రికార్డులే స్పష్టం చేస్తున్నాయని వెల్లడించారు. ఆ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులు, వక్ఫ్ బోర్డుకు మధ్య కోర్టులో న్యాయ వివాదం కొనసాగుతుంది.. కోర్టు తీర్పు వస్తే అది వక్ఫ్ బోర్డుదా, రైతులదా అనేది తేలుతుందన్నారు. అర్బన్ క్రెస్ట్, సిటీ గ్రాండ్ ఎన్ క్యూ వెంచర్స్ ఇకపై ఒక్క గజం భూమిలో వెంచర్ ఎక్స్ టెండ్ చేసినా రంగారెడ్డి కలెక్టర్ ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. కొంగరకుర్దు రైతులను రెండు నిర్మాణ సంస్థలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని కవిత చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కలిసి రూ.5 వేల కోట్ల విలువైన 580 ఎకరాల భూమిని కొట్టేస్తున్నారని తెలిపారు. బందిపోటు దొంగలు కూడా ఇలా పగటి పూట దొంగతనం చేయరని విమర్శించారు. నమస్తే తెలంగాణలో ఒక్కరోజు ఈ భూ మాఫియాపై వార్త వచ్చిందని.. అది ఒక ప్రముఖ బీఆర్ఎస్ నాయకుడి వెంచర్ ..దాని వెనుక మరో ముఖ్య నాయకుడు ఉన్నాడని తెల్లారి నుంచి ఆ పేపర్ల ఒక్క ముక్క కూడా రాయలేదని విమర్శించారు. సాక్షి పేపర్లో భూ మాఫియాకు వ్యతిరేకంగా ముందురోజు ఆర్టికల్ వచ్చిందని.. ఆ తెల్లారే రైతులకు వ్యతిరేకంగా స్టోరీ రాసిన్రని గుర్తు చేశారు. రామన్న -జగనన్న దోస్తులు అయ్యిండ్రని ఈ మధ్యే తెలిసిందని.. అందుకే ముందరోజు భూ మాఫియా కు వ్యతిరేకంగా వార్త వస్తే.. తెల్లారే దాన్ని రైతులకు వ్యతిరేకంగా మార్చిన్రని అర్థమైందన్నారు. దీని వెనుక ఏ శక్తులు ఉన్నయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ అక్రమాలకు నిదర్శనం
కొంగరకుర్దు భూముల విషయంలో తన సంతకాలు ఫోర్జరీ చేశారని.. ఆ డాక్యుమెంట్లు యాక్సెప్ట్ చేయొద్దని బాలమయా దేవి అనే ఐఏఎస్ ఆఫీసర్ ప్రభుత్వానికి లేఖ రాసిందని కవిత చెప్పారు. నర్సమ్మ అనే రైతు భూమికి లక్ష్మీ అనే పేరుతో ఓ ఆర్ సీ తెచ్చుకున్నారని, ఇలాంటి అక్రమాలు ఎన్నో కొంగరకుర్దులో జరిగాయని ఆరోపించారు. వెంటనే ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో కొన్ని ఇండ్లే బంగారం అయ్యాయని తాను ముందు నుంచీ చెప్తున్నానని దానికి ఈ కొంగరకుర్దు భూముల అక్రమాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.








