అమ్మతనమంటే ఇదే

(లోక రవిచంద్ర)

అప్పుడే ఊపిరి పోసుకుని అనారోగ్యంతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారుల బతుకులను ప్రభుత్వ నిర్లక్ష్యం చిదిమేసింది. బాధ్యత తీసుకుని అభయం ఇవ్వాల్సిన సర్కారు ప్రతినిధులు పిక్నిక్ కు పోయొచ్చినట్లు చేసి చేతులు దులుపుకున్నారు. రాష్ట్రంలోనే మారుమూల జిల్లా ఆదిలాబాద్..అక్కడి జనమంటే అధికారులకు అలుసు. ఆదివాసులంటే మరీ చిన్నచూపు.  సర్కారు దవాఖానలో నిర్వహణ లోపంతో ఐదుగురు పిల్లల ఊపిరాగిపోతే సీఎంకు చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు. పదిహేను రోజుల్లోపు వయసున్న పసిగుడ్లు తమ కళ్లముందే చితికిపోతే కన్నోళ్ల కన్నీళ్లు ఆపడం ఎవరితరం. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పే నేతలే కరవయ్యారు. ఇలాంటి సందర్భాల్లోనే అమ్మతనమంటే తెలిసొచ్చేది.. 

రిమ్స్ ఘటనపై కవిత ఆవేదన

ఆదిలాబాద్ రిమ్స్ లో ఏసీలో మంటలొచ్చి ప్రాణాపాయ స్థితిలో పసికందులు అల్లాడుతున్న విషయం తెలినప్పటి నుంచి తెలంగాణ రక్షణసేన అధినేత్రి కల్వకుంట్ల కవిత విలవిల్లాడిపోయింది. తెల్లారే సరికే ఇద్దరు చిన్నారుల బతుకులు తెల్లారిపోయాయి. పిల్లల యూనిట్లో చికిత్స కోసం ఉన్న 27 మందిలో మంటల ధాటికి వెలువడ్డ పొగతో అప్పటికే ఇద్దరి ఊపిరాగిపోయింది. మిగతా వారిని ప్రైవేటు దవాఖానకు తరలించారు. దారిలోనే మరో ప్రాణం పోయింది. వార్త తెలిసినప్పటి నుంచి ఆందోళనలో ఉన్న కవితలోని అమ్మతనం తట్టుకోలేకపోయింది. ఉన్నఫలంగా ఆదిలాబాద్ బయలుదేరాలనుకుంది..కానీ ప్రభుత్వ సహాయక చర్యలకు తమ పర్యటన ఆటంకం కావద్దనుకుంది. సాయంత్రం వరకు వేచి చూసింది. వైద్య, ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ సంఘటన స్థలానికి వస్తున్నారని తెలిసి  కొంచెం ఊరట చెందారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు భరోసా లభిస్తుందని ఆశపడ్డారు. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వ స్పందన కనిపించింది. కష్టాల్లో ఉన్న బాధిత కుటుంబాలకు ఆసరా కావడం మాట పక్కన పెడితే ప్రభుత్వ ఓదార్పుకు కూడా వారు నోచుకోలేదు. ఈ ఘటన కవితను మరింత కలచివేసింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కన్నా మంత్రి నిర్లక్ష్యం దారుణంగా అనిపించింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన చిన్నారుల అంత్యక్రియలకు కూడా ఆర్థిక సాయం చేయలేదు. పాలకులంటే అజమాయిషీ చేసే అధికారులు కాదు..ఆపదలో మేమున్నామంటూ ఆపన్న హస్తం అందించాల్సిన పెద్దలు. ప్రజలకు అన్ని వేళలా అండగా ఉండాల్సిన పెద్ద దిక్కు. అందునా పేదలకు ఆపద వస్తే వారి చూపు సర్కారు వేపే ఉంటుంది. కానీ రేవంత్ నేతృత్వంలోని మంత్రివర్గంలో మానవత్వానికి చోటే లేకుండా పోయింది. 

K Kavitha visited RIMS Adilabad and met families after five infants died in the hospital fire, highlighting concerns over safety and government response.

బాధిత కుటుంబాలకు కవిత ఆర్థిక సాయం

ఆదిలాబాద్ రిమ్స్ లో దుర్ఘటన బాధితులకు కావలసింది తక్షణ ఊరట..మేమున్నామంటూ భరోసా ఇచ్చే పాలకులు. కానీ వ్యాపార దృక్పథంతో సాగుతున్న పాలనలో అంతకు మించి ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. అప్పటి వరకు బాధితుల కోసం ప్రభుత్వం ఏదైనా చేస్తుందేమోనని ఎదురు చూసిన కవితమ్మలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏ సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో కూడా తెలియనితనం ఒంటి నిండా నింపుకున్న రేవంత్ సర్కారుపై అసహ్యం కలిగింది. మర్నాడే ఆదిలాబాద్ పర్యటనకు పూనుకుంది. బాధితులకు కావలసింది వ్యక్తిగత ఓదార్పు..వారి కన్నీళ్లు తుడిచే అమ్మతనం. వారి బాధను అర్థం చేసుకునే ఆపన్నహస్తం. అప్పటికప్పుడు పార్టీ తరపున బాధిత కుటుంబాలకు తలా రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. రాత్రికి రాత్రే స్థానిక నాయకుల చేత బాధిత కుటుంబాలకు అందేలా పురమాయించింది. మర్నాడు తెల్లవారకముందే బయలుదేరి ఆదిలాబాద్ చేరుకుంది కవిత. దుర్ఘటన జరిగిన రిమ్స్ ను సందర్శించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. కనీస జాగ్రత్తలు తీసుకోలేని అధికారుల వైఫల్యాన్ని బయటపెట్టింది. కవితలోని ఆర్తిని చూసిన అక్కడి సిబ్బంది తమ బాధలను కూడా వెల్లబోసుకున్నారు. ఆమె ఆదిలాబాద్ చేరే సమయానికి చికిత్స  పొందుతున్న మరో ఇద్దరు చిన్నారులు కూడా కన్నుమూశారు. ఇది ఆమెను మరింత బాధించింది. అక్కణ్ణుంచి వెంటనే వేర్వేరు గ్రామాల్లో ఉన్న బాధిత కుటుంబాలను కలుసుకుంది. కన్నబిడ్డలను కోల్పోయిన తల్లులను ఓ అమ్మలా.. తోబుట్టువులా పలకరించి ఓదార్చింది. వారికి ధైర్యం చెప్పింది. పుట్టిన పదిహేను రోజులకే నూరేళ్లు నిండిన తమ పిల్లలను తలచుకుని శోకసంద్రంలో ఉన్న వారికి ఈ సమయంలో కావలసింది ఇలాంటి పలకరింపే..

పాలకుల మానవీయ స్పందనపై ప్రశ్నలు

ఆపదలొచ్చినప్పుడు పేదలు తమ వైపే చూస్తారన్న సోయి పాలకుల్లో లేకుండా పోతున్నది. రైళ్లు గుద్ది పసిపిల్లల ప్రాణాలు పోయినా..బస్సులు బోల్తాపడి ప్రయాణికులంతా లోయలో సమాధైనా కుర్చీలోంచి లేవలేనంత అహంకారం ఆనాటి పాలకులదైతే ఐదుగురు చిన్నారులు అగ్ని ఆహుతైనా కదల్లేని మానసిక దౌర్భల్యం ఈనాటి పాలకులది. నిత్యం హింసాత్మక సంఘటనలతో రాష్ట్రం అల్లకల్లోలమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు బండబారుతున్నాయి. సున్నితత్వమనే పదార్థం పాలకులు తమ మెదళ్ల నుంచి క్రమంగా తొలిగించుకుంటున్నారు. పాలనంటే వ్యాపారంగా మారిపోయింది. అన్నీ ఓట్ల లెక్కన లెక్క కట్టాల్సిందే. బాధితులకు ఓదార్పు.. అన్నార్థులకు భరోసా..ఆపన్నులకు అండ అనేది ఇప్పటి నేతలకు ఆలోచనలకు అందని..అంటని అంశంగా మారింది. అందుకే అమ్మతనం లేని పాలన ఆత్మలేని శరీరం లాంటిది.