డాక్టర్ల కన్నా మంత్రి నిర్లక్ష్యమే బాధించింది

ఆదిలాబాద్ హాస్పిటల్ లో ప్రమాదం మానవతప్పిదమే

ముగ్గురు చిన్నారులు చనిపోతే బాధిత కుటుంబాలకు పైసా సాయం చేయరా?

-తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత

బాధిత కుటుంబాలను పరామర్శించనున్న కవిత

(తెలంగాణ రక్షణసేన, బంజారాహిల్స్, హైదరాబాద్)

ఆదిలాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లోని ఇంక్యుబేటర్ లో జరిగిన ప్రమాద ఘటనలో చిన్నారుల మృతి విషయంలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కన్నా మంత్రి నిర్లక్ష్యమే తీవ్రంగా బాధించిందని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రమాదంలో  తల్లితండ్రులే తమ పిల్లలను కాపాడుకున్నారని వివరించారు. ఆదిలాబాద్ ఘటన నేపథ్యంలో మంగళవారం కవిత మీడియాకు వీడియో సందేశం పంపారు. దురదృష్టవశాత్తు ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు చనిపోయారని, ఈ సంఘటన హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని తెలుస్తున్నదని విమర్శించారు. ఏసీ నిర్వహణ సరిగ్గా లేకపోవటంతోనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారని, అంటే ఇది మానవతప్పిదం కారణంగా జరిగిందేనని స్పష్టమైందన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి కనీస సాయం అందుతుందని భావిస్తామని, కానీ ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బాధితులకు సాయం చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ దవాఖానకు పేదలే వెళ్తారని, చనిపోయిన పిల్లల్లో ఇద్దరు మైనార్టీలు, ఒక ఆదివాసీ బాబు ఉన్నాడని కవిత వెల్లడించారు. ఆ జిల్లాకు వెయ్యి రోజుల తర్వాత వెళ్లిన హెల్త్ మినిస్టర్ ఇంతటి దుర్ఘటన జరిగితే అర్దగంట మాత్రమే అక్కడ ఉన్నాడని విమర్శించారు. హాస్పిటల్ సిబ్బంది కన్నా కూడా ఆయనే ఎక్కువ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని దుయ్యబట్టారు. హెల్త్ మినిస్టర్ వెళ్తున్నాడంటే బాధితులకు ఏదైనా సాయం చేస్తారని మేము భావించామని.. కానీ బాధితులకు సాయం చేస్తమని కూడా మంత్రి చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా మంత్రి వస్తున్నాడని అంత్యక్రియలు చేయాల్సిన కార్యక్రమాన్ని ఆపేశారని మండిపడ్డారు.

ఇంత మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారా.. మీరు ఫోటోలు దిగేందుకు ఈ సంఘటనను వాడుకుంటారా అని ప్రశ్నించారు. కనీసం అంత్యక్రియలు నిర్వహించలేని పేదవాళ్లు వారని, వారికి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ. 50 వేలు అందజేస్తామని ప్రకటించారు.

హెల్త్ మినిస్టర్ ఏదో టూరిజం స్పాట్ కు వెళ్లినట్లు వెళ్లారే తప్ప…సంఘటన మీద కనీసం రివ్యూ నిర్వహించలేదని కవిత విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి అడిట్ చేయించాలని కవిత డిమాండ్ చేశారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో సీలింగ్ కూలిందని, చాలా హాస్పిటళ్లలో ఎక్విప్ మెంట్ సరిగా లేదని చెప్పారు. వాటిపైన ముఖ్యమంత్రి ఆడిట్ నిర్వహిస్తేనే ప్రజలకు ఒక విశ్వాసం కల్పించనట్లు అవుతుందన్నారు. తాము ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని, తమ ప్రాధాన్యాల్లో హెల్త్ కూడా ఒకటని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు.

బుధవారం ఆదిలాబాద్ కు కవిత

ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రక్షణసేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత బుధవారం పర్యటించనున్నారు. రిమ్స్ అగ్ని ప్రమాదంలో మరణించిన చిన్నారుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు ఇచ్చోడకు చేరుకుంటారు. ఇచ్చోడలో చిన్నారి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అక్కడి నుండి ఉట్నూరులో చిన్నారి కుటుంబ సభ్యులను  పరామర్శిస్తారు. అనంతరం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి సందర్శిస్తారు. ప్రైవేట్ ఆసుపత్రి సందర్శించి రిమ్స్ లో గాయపడి చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శిస్తారు.  ఆ  తర్వాత ఆదిలాబాద్ లో మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతారు.