పుస్తెమెట్టెల ఫైల్ పైనే సీఎంగా నా మొదటి సంతకం

విశ్వకర్మల జీవితాల్లో మార్పులు తెస్తాం

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విశ్వకర్మల జీవితాల్లో వెలుగులు నింపే నిర్ణయాలు తీసుకుంటామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. పుస్తెలు, మట్టెలు స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి అమ్మే ఫైల్ పై మొదటి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. ఉప్పల్ భగాయత్ లో గురువారం నిర్వహించిన విశ్వకర్మ జయంతిలో పాల్గొని మాట్లాడారు. విశ్వకర్మల్లోని ఐదు దాయిలైన మను, మయ, త్వష్ట, విశ్వజ్ఞ, శిల్పుల జీవితాలు అభివృద్ధి చెందాల్సిన అవసరముందని అన్నారు. విశ్వకర్మల్లోని ఐదు దాయిల జీవనస్థితిగతులు మారాలన్నారు. ఆ వృత్తుల్లో ఉండే కష్టాన్ని దగ్గరుండి చూశానని.. ఎన్నోసార్లు చట్టసభల్లో ఈ అంశాలపై మాట్లాడానని గుర్తు చేశారు. కమర్షియల్ గోల్డుషాపులు వచ్చిన తర్వాత స్వర్ణకారుల జీవితాలు ఆగమయి.. సైనేడ్ తిని సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్రంగులకు జీవితబీమా, శిల్పులకు దేవాలయాల కమిటీల్లో స్థానం కల్పించాల్సిన అవరముందన్నారు. విశ్వకర్మలకు భూములు ఉండవని భూములు లేని వర్గాలకు భూమి పంపిణీ చేయాలన్న మంచి ఉద్దేశంతో భూలక్ష్మీ పథకాన్ని రూపొందించామని కవిత వెల్లడించారు. భూలక్ష్మీ పథకానికి స్ఫూర్తి మారోజు వీరన్న, ప్రొఫెసర్ జయశంకర్ సార్, శ్రీకాంతాచారిలేనని కవిత చెప్పారు. జయశంకర్ సార్ తనకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వారని ఆయన ఫోటో లేకుండా తమ పార్టీ కార్యక్రమం ఏదీ జరగదని చెప్పారు. విశ్వకర్మల కష్టం తెలిసిన బిడ్డనని తన పార్టీకి ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వాలు పట్టించుకోక పోయినా సరే 40 ఏళ్లుగా విశ్వకర్మ జయంతిని ఘనంగా కులపెద్దలు నిర్వహిస్తుండడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని కల్వకుంట్ల కవిత అన్నారు.