మన ఆలోచన విధానం మారితేనే కుల వివక్ష నిర్మూలన
బీసీ జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతున్నది
బీసీ ఉప కులాలను లెక్కించాలి
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :
బీసీ కులాల జనాభాను తక్కువగా చూపి…వారు ఐక్యంగా పోరాడకుండా కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్ర చేస్తున్నదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. జనగణనలో ఓబీసీ కాలాన్ని కులాల వారీగా చూపకుండా బలహీన వర్గాలను కులాల సముహాలుగా విడగొట్టి ఐక్య పోరాటాలు జరగకుండా ప్రయత్నాలు చేస్తోందన్నారు. బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో శుక్రవారం ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్, సకలజన సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘పాలిటిక్స్ బియాండ్ క్యాస్ట్’’ సదస్సులో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం చేపట్టే కులగణనలో బీసీ జనాభా విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కేవలం క్యాస్ట్ కాలం పెట్టేసి చేతులు దులుపుకుంటామంటే ఊరుకునేది లేదన్నారు. ప్రతి రాష్ట్రంలో ఉన్న కులాల జాబితాను కచ్చితంగా అప్ లోడ్ చేయాలని…అదే విధంగా ఉపకులాలను కూడా కలిపి లెక్కించాలి. లేదంటే బీసీల జనాభా తక్కువగా కనిపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒకే కులానికి సంబంధించి దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్టేటస్ ఉందని…ఆ సమస్యను పరిష్కరించాలంటే బీసీ కులాల ఉపకులాలను కూడా కలిపి లెక్కించటం జరగాలన్నారు. లేదంటే ఉప కులాల్లో ఉండే వారికి న్యాయం జరగదని వారిని కూడా ఒక కులంగా లెక్కల్లో చూపే ముప్పు ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ లో ఉన్న 57 ఉపకులాల కారణంగా ఉప కులాల్లో వారికి న్యాయం జరగడం లేదన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. అయినప్పటికీ వేల కోట్లు ఖర్చు చేస్తూ బీసీ జన గణనలో కూడా సొలుష్యన్ లేకుండా చేయటం సరికాదన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కులగణన పేరుతో బీసీ జనాభాను తక్కువ చేసి చూపిందని కవిత చెప్పారు. కేంద్రం చేపట్టే కుల గణన ద్వారా ఆ సమస్య తీరుతుందని భావిస్తే…వాళ్లు సమస్యను మరింత ఝఠిలం చేస్తున్నారని మండిపడ్డారు. కులగణనకు సంబంధించి మరో నాలుగు నెలల సమయం ఉందని…ఈ లోగా కేంద్రం ఈ సమస్య పరిష్కరించటంపై దృష్టి సారించాలన్నారు.

మన డీఎన్ఏ లోనే కుల వివక్ష
కుల వివక్ష అనేది మన డీఎన్ఏ లోనే పాతుకుపోయిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, స్పీకర్ లాంటి వాళ్లు కూడా కుల వివక్షకు గురికావటం అన్యాయమన్నారు. ఈ ఝఠిలమైన సమస్యకు మల్టీ డైమన్షన్ సొలుష్యన్స్ అవసరమన్నారు. ఈ సమస్యకు అప్పర్ కాస్ట్, బాధితుడు అనే రెండు కోణాలున్నాయని… బాధితుడి కోణం నుంచి చూసినప్పుడు మాత్రమే సరైన పరిష్కారం లభిస్తుందని చెప్పారు. మారోజు వీరన్న చెప్పినట్లుగా ప్రతి కులాన్ని ఎంపవర్ చేయాల్సిన అవసరముందన్నారు. రాజ్యాధికారంతో పాటు ఆర్థికంగా ఆయా కులాలను బాగు చేయాలని…అధికారంలో ఉన్న పార్టీలే ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. చట్టాల పరంగా ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడే కుల వివక్ష నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు.
పురుషులతో సమానంగా మహిళలకు వేతనం ఇవ్వాలి
పురుషులతో సమానంగా పనిచేసినప్పటికీ మహిళలకు వేతనాల్లో వ్యత్యాసం చూపించటం అన్యాయమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతన చట్టాలు ఉన్నప్పటికీ…2026 లో కూడా వేతన వ్యత్యాసం చూపుతున్నారన్నారు. శుక్రవారం అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం సందర్భంగా ఈ అంశంపై ఎక్స్ లో ట్వీట్ చేశారు. మహిళల శ్రమకు సమానమైన విలువ ఇచ్చినప్పుడు మాత్రమే నిజమైన పురోగతి సాధ్యమవుతుందన్నారు.








