రిమ్స్ లో చిన్నారుల మృతి ప్రభుత్వ హత్యలే

దత్తత తీసుకున్న జిల్లాలో చిన్నారులు చనిపోతే ముఖ్యమంత్రికి వచ్చే తీరిక లేదా?

హెల్త్ మినిస్టర్ ఎక్స్ కర్షన్ కు వచ్చినట్లు వచ్చి బాధ్యత లేకుండా వ్యవహరించారు

బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి

పెండింగ్ బిల్లు చెల్లించకుంటే..ఆదివాసీలతో కలిసి ఘెరావ్ చేస్తాం

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం జరిగిన ఎస్ఎన్ సీయా పరిశీలన

(తెలంగాణ రక్షణసేన, ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్)

రిమ్స్ లో జరిగిన ఘటన కేవలం కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య ఫలితమేనని తెలంగాణ జాగృత రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటననో, ప్రకృతి ప్రకోపం కారణంగానో జరగలేదన్నారు. రోజులు కూడా నిండకముందే ఐదుగురు పసివాళ్లకు నిండు నూరేళ్లు నిండాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీ పేలిన ఘటనలో అగ్ని ప్రమాదానికి ఐదుగురు చిన్నారులు మృతి చెందిన ఆదిలాబాద్ రిమ్స్ ను కవిత బుధవారం సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. దవాఖానలో వైద్య సదుపాయాలు, సేవలు, సిబ్బంది సంఖ్యపై ఆరాతీశారు. ఈ సందర్భంగా సిబ్బంది తమ సమస్యలను కవితకు వివరించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్ రిమ్స్ లో జరిగింది హృదయవిదాకరమైన సంఘటన అన్నారు. ఇక్కడ ఇదే మొదటి సంఘటన కాదని.. ఈ హాస్పిటల్ లో గతేడాది 204 మంది, అంతకుముందు ఏడాది 174 మంది చిన్నారులు చనిపోయారని కవిత చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ పరిస్థితులపై ప్రభుత్వం బేరీజు వేసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి హాస్పిటల్ కు వచ్చేందుకు సరైన రోడ్లు లేవన్నారు. ఏ రోజు పేపర్ చూసినా గర్బిణి మృతి.. చిన్నారులు మృతి అనే వార్తలే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి గురించి వార్తలు రాసి, కథనాలు ప్రచురించి మీడియా వాళ్లే విసిగిపోయారని చెప్పారు.

సీఎంకు తీరిక లేదు

రిమ్స్ లాంటి పెద్ద దవాఖనలో 150 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట సగం మంది కూడా లేరని, నర్సులు సగం మందే ఉన్నారని కవిత విమర్శించారు. శానిటేషన్ సిబ్బంది 20 శాతం మాత్రమే ఉన్నారన్నారు. సిబ్బందితో నడ్డి విరిగేలా పనిచేయిస్తూ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 ఏసీలు ఉంటే ఒక్క మెకానిక్ లేడని.. ముగ్గురు ఎలక్ట్రీషియన్స్ మాత్రమే ఉన్నారని, వారిని ఎన్నో పనులకు వాడుకుంటున్నారని కవిత విమర్శించారు. ఈ సంఘటనకు హాస్పిటల్ సిబ్బంది గానీ పేషెంట్లది గానీ తప్పు కాదన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ దవాఖానకు రూ. 500 కోట్ల రావల్సి ఉన్నాయని కవిత తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నానని ముఖ్యమంత్రి చెప్పారని, దత్తత తీసుకున్న జిల్లా పరిస్థితి ఇలా ఉంటుందా? ఐదుగురు పిల్లలు చనిపోతే వచ్చి చూసేందుకు తీరక లేదా అని ప్రశ్నించారు. ఫుట్ బాల్ ఆడేందుకు, విదేశాల్లో తిరిగేందుకు ఈ ముఖ్యమంత్రికి సమయం ఉంటుంది కానీ..మైనార్టీ, ఆదివాసీ పిల్లలు చనిపోతే చూసే టైమ్ కూడా ముఖ్యమంత్రికి లేదా అని నిలదీశారు. హెల్త్ మినిస్టర్ వచ్చి ఇక్కడ కనీసం గంటన్నర కూడా లేరని, ఆయన వచ్చి కలెక్టర్ తో సమీక్ష నిర్వహించలేదని చెప్పారు. ఎక్స్ కర్షన్ కు వచ్చినట్లు వచ్చి వెళ్లారని దుయ్యబట్టారు. పేదలైన బాధిత కుటుంబాలకు కనీసం పైసా సాయం చేయలేదని, ప్రభుత్వం చేసిన తప్పులకు పరిహారం కాదు ఫైన్ కట్టాలని స్పష్టం చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన తప్పునకు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు.

అధ్యయనానికి టీఆర్ఎస్ కమిటీ

జనంబాటలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడే ఇక్కడి పరిస్థితులను ప్రభుత్వానికి చెప్పామని కవిత గుర్తు చేశారు. అడవులతో పచ్చగా ఉండే ఆదిలాబాద్ లో క్యానర్ పేషెంట్లు పెరుగుతున్నారని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ కు సంబంధించి కమిటీ వేస్తామని ప్రకటించారు. ఆ కమిటీ ద్వారా అన్ని అంశాలపై స్టడీ చేసి నివేదిక ఇస్తామని తెలిపారు. ఒక్క రిమ్స్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటళ్లలో పరిస్థితులు బాగా లేవన్నారు. వరంగల్ ఎంజీఎంలో పై కప్పు కూలిందని, నాగర్ కర్నూల్ లో ఎలుకలు కొరికి ఈసీజీ మెషీన్ పనిచేయటం లేదని కవిత చెప్పారు. కచ్చితంగా అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో ఫోరెన్సిక్ అడిట్ నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర బడ్జెట్ లో హెల్త్ కోసం 10 శాతం బడ్జెట్ కేటాయిస్తామన్న ముఖ్యమంత్రి 5 శాతం మాత్రమే కేటాయిస్తున్నారని వెల్లడించారు. దాంట్లో సగం జీతాలకే పోతున్నదని, ఇక మౌలిక సదుపాయాలకు ఆ నిధులు ఏం సరిపోతాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ ఉచిత విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తుందని, ఈ విషయంలో తాము రాజకీయం చేయమని చెప్పారు. ముఖ్యమంత్రికి నెల రోజులు సమయం ఇస్తున్నాం.. ఈ లోగా పెండింగ్ బిల్లులు చెల్లించి…ఈ ప్రాంతంలో రోడ్లు వేయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్యంగా వచ్చి పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. ఎస్టీల కోసం వస్తున్న నిధులకు సంబంధించి కూడా లెక్క చెప్పాలన్నారు.

లేకుంటే మొత్తం ఆదివాసీలతో కలిసి ఆదిలాబాద్ ను ఘోరావ్ చేస్తామని ప్రకటించారు. ఆశామాషీగా వచ్చి చూసి పోయే వాళ్లం కాదని, ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కారం అయ్యే వరకు ఫైట్ చేస్తామని కవిత స్పష్టం చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో శిశువులు, గర్భిణీల మరణాలు, వైద్య ఆరోగ్య సేవలపై టీఆర్ఎస్ పార్టీ తరపున అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. కమిటీ సమగ్ర అధ్యయనం చేసి పరిష్కారాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు.