తెలంగాణ మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వ తీరుతో నష్టం

ప్రభుత్వం తెచ్చిన జీవో కారణంగా తెలంగాణ బిడ్డలు రక్షణలు కోల్పోయే ప్రమాదం ఉంది

ఈ విపత్తుకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజమంతా పోరాటం చేయాలి

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :

మెడికల్ సీట్లలో స్థానికత మార్చే విధంగా ప్రభుత్వం తెచ్చిన జీవో లు 33, 150 ల కారణంగా పెను ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఈ జీవోలతో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుందని..ఇతర రాష్ట్రాల విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆవేదన వ్యక్తం  చేశారు. తెలంగాణకు నష్టం చేసే ఇలాంటి జీవోలను రద్దు చేయాల్సింది పోయి.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ దాన్ని డిఫెండ్ చేయటమేమిటనీ ప్రశ్నిస్తూ సోమవారం వీడియో సందేశం విడుదల చేశారు. వెంటనే ఈ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ తెచ్చుకున్నదే ఇక్కడి ప్రజలకు అన్ని రంగాల్లో సర్వ హక్కుల కోసమని..కానీ కాంగ్రెస్ సర్కార్ ఆ హక్కులనే హరించేలా జీవోలు తెస్తోందని మండిపడ్డారు. 1 నుంచి 7 వ తరగతి వరకు చదివిన వాళ్లను స్థానికులుగా భావించాల్సింది పోయి 8 వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు ఇక్కడ చదివిన వాళ్లకు స్థానికులుగా అవకాశం ఇవ్వటమేమిటనీ ఆమె నిలదీశారు. దీని కారణంగా తమ పిల్లలు నష్టపోతున్నారని ఇప్పటికే విద్యార్థుల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెడికల్ సీట్లలో తీసుకొచ్చిన ఈ స్థానికత విధానాన్ని రేపు అన్ని రంగాల్లో అమలు చేస్తారని..అదే జరిగితే తెలంగాణ యువత పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందన్నారు. 

విపత్తుకు వ్యతిరేకంగా గళమెత్తాలి

ప్రభుత్వం తెచ్చిన జీవోలు తెలంగాణకు విపత్తు లాంటివని కవిత హెచ్చరించారు. దీనిపై కచ్చితంగా తెలంగాణ సమాజమంతా ప్రశ్నించాల్సిన అవసరముందని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఛైర్మన్ గా ఉన్న ప్రొఫెసర్ కోదండ రాం ఈ అంశంపై గళమెత్తాలని.. విద్యార్థులకు జరిగే నష్టాన్ని ప్రభుత్వానికి వివరించాలని కోరారు. అదే విధంగా తెలంగాణ మేధావి వర్గం, యువత, విద్యార్థులు అంతా కూడా ఈ జీవోలను వ్యతిరేకించాలన్నారు. ఇప్పటికే గ్రూప్ -1 లో స్థానికత అంశం కారణంగా తెలంగాణ విద్యార్థులు ఎంతో నష్టపోయారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా బుద్ది మార్చుకోవాలని సూచించారు. లేదంటే తెలంగాణ ప్రజలు సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెట్టటం ఖాయమన్నారు.