యాకుత్ పురాలో జనంబాట
హనుమాన్ నగర్ వాసులతో సమావేశం
ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అభివృద్ధే ప్రధానంగా పాలన సాగాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అన్ని పార్టీలు ప్రజల మధ్యకు వచ్చి వారి బాగోగులు తెలుసుకోవాలని సూచించారు. జాగృతి జనంబాటలో భాగంగా గురువారం కవిత యాకుత్ పుర నియోజకవర్గం పరిధిలోని హనుమాన్ నగర్ ముంపు ప్రాంత ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బలంగా నిలదీసి అడిగితే మనకు పనులు అవుతాయని స్పష్టం చేశారు.

” ప్రభుత్వాన్ని నిలదీస్తే పనులు వాటంతట అవే జరుగుతాయి. అందుకే జాగృతి తరఫున ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడుగుతున్నాం. దీంతో అధికారులు కూడా స్పందించి పనిచేస్తున్నారు. ముందడుగు పడుతున్నది. ఇక ఓల్డ్ సిటీలో ఏ రోడ్డు చూసినా పన్నేండేళ్ల క్రితం వేసినవే ఉన్నాయి. మోరీలు, డ్రైనేజీ సిస్టమ్ 35 ఏళ్ల కిందిది అట్లాగే ఉంది. సిటిలో అందరికీ సమానమైన అభివృద్ధి కావాలి.
ఇక్కడ చాలా పనుల కోసం డబ్బులు సాంక్షన్ అయ్యాయని చెబుతున్నారు. కాని పనులు మాత్రం పూర్తి కాలేదు. హైదరాబాద్ సిటీకి రూ. 5 వేల కోట్లు బడ్జెట్ కేటాయించారు. అందులో ఓల్డ్ సిటీ వాటా ఎంతో చెప్పటం లేదు.”

“ప్రభుత్వం ఇచ్చిన హామీలను మహిళలు గట్టిగా నిలదీస్తున్నారు. కానీ యువమిత్రులు మాత్రం కాస్త వెనుకబడ్డారు. వారు కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. జాగృతి తరఫున యకుత్ పురాలో గట్టి కమిటీ వేస్తాం. ఈ ప్రభుత్వం మహిళలకు రూ. 2500, గ్యాస్, కరెంట్ ఫ్రీ అన్నారు. ఎన్నో చెప్పారు. కానీ ఒక్కటి కూడా కాలేదు. మూడేళ్లుగా చాలా మందికి పెన్షన్ రాని పరిస్థితి ఉంది. వికలాంగులకు కూడా పెన్షన్ ఇవ్వటం లేదు. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడున్న మహిళలు మాకు ఏదైనా ఉపాధి చూపించాలని అడుగుతున్నారు. ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. లేదంటే వారికి ఇస్తామన్న రూ. 2500 ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్ మెంట్ 9 వేల కోట్ల బకాయిలు పెట్టారు. దీంతో పిల్లలు చదువుకునేందుకు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది.

ఏ సమస్యను కూడా మేము విస్మరించకుండా పోరాటం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పింది. ఇప్పటి వరకు దాని ఊసు లేదు. ఇక ఇండ్ల బాధలు చాలా మందికి ఉన్నాయి. కిరాయి కూడా కట్టలేని పరిస్థితి లో ఉన్నారు. వరదలు వచ్చినప్పుడు ఇక్కడ కార్లు కొట్టుకుపోతున్నాయి. వీటన్నింటి మీద ప్రభుత్వాన్ని మనం గట్టిగా నిలదీయాల్సిన అవసరముంది. మలక్ పేట్, చార్మినార్ సహా అన్ని నియోజకవర్గాల్లో అదే పరిస్థితి.
మనది గోల్డ్ సిటీ, ఒరిజినల్ సిటీ ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. నేను అన్ని పార్టీలను ప్రజల మధ్యకు రావాలని కోరుతున్నా..అప్పుడు మాత్రమే ప్రజల సమస్యలు అర్థమవుతాయి. మాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ ఓట్లు కూడా లేవు.
గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుంటే మేము సిటీలో తిరుగుతున్నాం.”








