-కల్వకుంట్ల కవిత
అంబర్ పేటలో జాగృతి జనంబాట
ఏండ్లకేండ్లు పెండింగులో ఉన్న బ్రిడ్జి కింద రోడ్డును తాము పరిశీలిస్తామని ప్రకటించగానే రాత్రికి రాత్రే అధికారులు రోడ్డు వేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. అంబర్ పేట ప్రాంతంలో రెండవ బ్రిడ్జి కూడా నిర్మించాల్సిన అవసరముందన్నారు. జాగృతి జనంబాటలో భాగంగా ముసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించారు. అంబర్ పేట్ లోని ఛే నంబర్ బ్రిడ్జి కింద రోడ్డును పరిశీలించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలంటే బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.


“మలక్ పేట్, అంబర్ పేట్ మధ్య మూడేళ్ల క్రితం హై లెవల్ బ్రిడ్జి కోసం పనులు ప్రారంభించారు. కానీ ప్రభుత్వం మారగానే ఈ బ్రిడ్జి పనులను ఆపేశారు. మొన్న వచ్చిన వరదకు కూడా బ్రిడ్జి ఎత్తు ఆనుకొని నీళ్లు ప్రవహించాయి. కనుక ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ఎంపీ గారు కూడా వరద ఎత్తుకు తగిన విధంగా బ్రిడ్జి ఎత్తు పెంచే ప్రయత్నం చేయాలి. అదే విధంగా ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. కనుక ఈ ప్రాంతంలో మరో బ్రిడ్జి కూడా అవసరముందని స్థానికులు చెబుతున్నారు. మరో బ్రిడ్జిని కూడా ప్రభుత్వం నిర్మించాలి. ఈ ప్రాంతంలో జనసాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం మారగానే పనులు ఆపటం మంచిది కాదు. ఈ పనులు ప్రజల కోసమని గమనించాలి. ఇక్కడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్నా చేసైనా సరే పనులు తర్వగా పూర్తయ్యేలా చూడాలి. నేను 20 ఏళ్లుగా జాగృతి పేరుతో ప్రజల మధ్యనే ఉన్నా. నాకు ప్రజలు కొత్త కాదు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినా నేను ప్రజల్లోనే ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నా. నేను చేసిన సేవలు పార్టీ మరిచిపోయింది. కానీ ప్రజలు మాత్రం మరిచిపోలేదు. మేము ఎక్కడకు వెళ్లినా సరే వారి సమస్యలు తీరుస్తామన్న నమ్మకంతో వారి సమస్యలు చెబుతున్నారు. అంబర్ పేట ఛే నంబర్ వద్ద రోడ్డు పనులను మేము పరిశీలించేందుకు వస్తున్నామని తెలిసి రాత్రికి రాత్రే రోడ్డు వేశారు. రాత్రికి రాత్రే రోడ్డు వేయగలిగే వాళ్లు మేము అడిగే వరకు ఎందుకు చూడాలి. నేను ఎవరినీ టార్గెట్ చేయటం లేదు. అంశాల వారిగానే మాట్లాడుతాను.


ఏ ప్రాంతంలోకి వస్తే అక్కడి సమస్యలను బట్టి నేను మాట్లాడుతున్నాను. ప్రభుత్వాలు మారితే ప్రజలు ఇబ్బంది పడవద్దన్నది నా ఆలోచన. మహారాష్ట్ర, తమిళనాడులో ఇలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వాలు మారినా సరే వాళ్లు ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టకుండా పనిచేస్తారు. కానీ మన వద్ద ప్రభుత్వాలు మారితే గత ప్రభుత్వం చేపట్టిన పనులు ఆపే దరిద్రం ఉంది. ఇప్పుడు ప్రజలకు అవసరమైన బ్రిడ్జిని ఆపాల్సిన అవసరమెందుకు వచ్చింది.”
పేదలందరికి ఇండ్లు ఇవ్వాలి
“అంబర్ పేట అంటేనే బిజిసెన్, ఎడ్యుకేషన్ సెంటర్. ఎంతో మంది ఇక్కడకు బతకటానికి వచ్చి ఉంటారు.
అలాంటి ఈ ప్రాంతంలో రోడ్లు, బ్రిడ్జిల విషయంలో అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే వ్యవహరించాయి. మూసీ పై కడుతున్న బ్రిడ్జిని అత్యంత నాణ్యత లోపంతో నిర్మిస్తున్నారు. మొన్నటి వరదలకు పిల్లర్లు, సలాకలు కుంగి పోయాయి. బ్రిడ్జి రీ డిజైన్ చేసి తొందరగా పనులను ప్రారంభించాలి. కూరగాయల మార్కెట్ లో కొత్త షెడ్లు వేస్తామని ఆ విషయమే మర్చిపోయారు. పేదల ఇళ్ల విషయంలో ప్రభుత్వాలు చాలా తప్పులు చేశాయి. ఎక్కువ జనాభా ఉన్న ఈ ప్రాంతానికి చాలా తక్కువ ఇళ్లను ఇచ్చారు. అంబర్ పేటలో జాగృతికి మంచి యువ నాయకుల టీమ్ ఉంది. ప్రజల సమస్యలపై వారు నిరంతరం ఫైట్ చేస్తారు. అదే విధంగా అంబర్ పేటలోని ప్రతి గల్లీలో జాగృతి జెండా ఎగురవేస్తాం. మాకు ఏ పార్టీలోకి వెళ్లాలన్న ఆలోచన లేదు. జాగృతి సంస్థ ఇండిపెండెంట్ గానే ఎదుగుతుంది.”








