-కల్వకుంట్ల కవిత
బాపూజీకి ఇచ్చే గౌరవం ఇదేనా (కార్వాన్)
మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించిన రేవంత్ సర్కార్ ఆటోవాలాలకు ఇచ్చిన హామీని మాత్రం విస్మరించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అలాగే మహాత్మా బాపూజీకి భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం లు కేసీఆర్, రేవంత్ మాట నిలుపుకోలేదని విమర్శించారు. జాగృతి జనంబాటలో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని బహదూర్ పురా, కార్వాన్, చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాల్లో శనివారం ఆమె పర్యటించారు. బాపూ ఘాట్ నుంచి లంగర్ హౌస్ వరకు కవిత ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.
“కార్వాన్ లో బాపూఘాట్ ఉంది. ఇక్కడే ఈసా, మూసీ నది ల త్రివేణి సంగమం ఉంది. అలాంటి బాపు ఘాట్ డ్రగ్సుకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. దీని మీద పోలీసులు, ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఆనాడు 150 అడుగుల గాంధీ విగ్రహాన్ని కేసీఆర్ పెడతామని చెప్పారు.
ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా విగ్రహాన్ని పెడతామని అన్నారు. కానీ ఇద్దరు చేయలేదు. ఈ ప్రభుత్వమైనా బాపు ఘాట్ ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలి.”
కుక్కలు, క్రైమ్, గంజాయి, డ్రగ్స్ సమస్య తీవ్రం
“మీర్ హుస్సేనీ దర్గా ఇక్కడ చాలా పాపులర్. మేము ఆటోలో ఇక్కడకు వచ్చాం. ఆటోవాలాల కష్టాలు ప్రభుత్వం దృష్టిలో పడాలని అలా వచ్చాం. ఫ్రీ బస్ వచ్చాక ఆటోవాలాలకు ఇబ్బందిగా మారింది. వారికి ఇస్తామన్న రూ. 12 వేలు ఇవ్వాలి. అదే విధంగా వెల్ఫేర్ బోర్డు పెట్టాలి.
సిటీలో ప్రయాణం చేసేందుకు ఆటోలు చాలా ముఖ్యం. కానీ వారికి ఆటోలు పెట్టేకునేందుకు ఆటో స్టాండ్లు కూడా లేవు.
అటు హైదరాబాద్ లో నీళ్ల సమస్య ఉంది. డ్రైనేజీలు సరిగా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకు ఇస్తామన్న రూ. 2500 ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలపై దురాగతలు, మర్డర్లు పెరిగాయి. ఖమ్మంలో సాదినేని రంగారావును హత్య చేశారు. అదే విధంగా హైదరాబాద్ లో ఓ మైనార్టీ కుర్రాడిని రీల్స్ చేస్తే ఏదో చేశాడంటూ అరెస్ట్ చేశారు. అతన్ని విపరీతంగా కొట్టటంతో అతని వెన్నపూస పనిచేయకుండా అయ్యింది. వీటిపై ఫిర్యాదు చేయాలని భావిస్తే డీజీపీ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. హైదరాబాద్ లో ముఖ్యంగా కుక్కలు, క్రైమ్, గంజాయి, డ్రగ్స్ సమస్య భారీగా పెరిగింది.
మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. క్రైమ్, డ్రగ్స్ ను నివారించకపోతే ప్రభుత్వం ఉన్నా కూడా లేనట్లే. క్రైమ్, డ్రగ్స్ నివారణపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నా.”
దాహం తీర్చకుండా ఆర్భాటాలా
” హైదరాబాద్ లో మెస్సీని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిపిస్తున్నారు. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ బ్రాండ్ చేయాల్సిందే. కానీ పేదవాళ్లను కూడా పట్టించుకోవాలి. పేదవాళ్లను పట్టించుకోకుండా చేసే కార్యక్రమం సరికాదు.
హైదరాబాద్ లో చెత్త పేరుకుపోయింది. హైదరాబాద్ లో కనీసం మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నారు. మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా గ్లోబల్ సిటీ ఎలా అవుతుంది? ముందు హైదరాబాద్ ప్రజలకు మంచి నీళ్లు ఇవ్వాలి. కనీసం నీళ్లు, డ్రైనేజీ, కనీస సౌకర్యాలు లేకుండా ఉండటం బాధాకరం.”
దర్గా, గోశాల సందర్శన
జాగృతి జనంబాటలో భాగంగా నగరంలో పర్యటిస్తున్న కవిత లంగర్ హౌస్ లోని దర్గాను సందర్శించి చాదర్ సమర్పించారు. అనంతరం జియాగూడ గోశాలను సందర్శించి గోవులకు ఆహారం అందజేశారు.













